ఇందిరమ్మ ఇండ్లకు కండిషన్ల తిరకాసులు

ఇందిరమ్మ ఇండ్లకు కండిషన్ల తిరకాసులు

వరంగల్, నిర్దేశం:
ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుంటే.. ప్రభుత్వం రూ.5 లక్షలు ఇస్తోంది. విడతల వారీగా నగదును లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో వేస్తోంది. అయితే.. ప్రభుత్వం రూ.5 లక్షలకు తోడు.. ఇంకా కొంచెం డబ్బులు కలిపి మంచిగా ఇల్లు కట్టుకోవాలని చాలామంది అనుకున్నారు. కానీ.. ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని 400 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలోపే నిర్మించుకోవాలని ప్రభుత్వం షరతు పెడుతుండటంతో.. లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా మొదటి విడతగా రాష్ట్రంలో 70 వేల 122 ఇళ్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో 2వేల 830 మంది లబ్ధిదారులు పునాదిని పూర్తి చేసుకున్నారు. సుమారు 280 మందికిపైగా 600 చదరపు అడుగులకుపైగానే ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు. దీన్ని గుర్తించిన అధికారులు మొదటి విడత బిల్లు రూ.లక్ష విడుదలకు నిరాకరించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పునాదిలో మార్పులు చేసుకుంటేనే బిల్లులు అందిస్తామని స్పష్టం చేస్తున్నారు.

ఈ పథకంలో భాగంగా సొంత స్థలాలు ఉన్నవారు తమకు నచ్చిన విస్తీర్ణంలో నిర్మాణాలు చేసుకోవచ్చని, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తామని ప్రభుత్వం పలు సందర్భాల్లో వెల్లడించింది. ఇందిరమ్మ మోడల్‌ ఇళ్లను లబ్ధిదారులకు అందుబాటులో ఉంచింది. ఎలాంటి నిబంధనలను పెట్టబోమని స్పష్టం చేసింది. కానీ తాజాగా అధికారులు 400 నుంచి 600 చదరపు అడుగుల మధ్యలోనే ఇంటిని నిర్మించుకోవాలని పదేపదే చెబుతుండడంతో లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే రూ.5 లక్షలు కాకుండా.. తాము కూడా ఇంటికి అదనంగా ఖర్చు చేసుకుంటున్నామని, ఇప్పుడు నిబంధనలు విధిస్తే ఎలా అని లబ్ధిదారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. 600 చదరపు అడుగులు దాటితే బీపీఎల్‌ పరిధిలోకి రారని అధికారులు వివరిస్తున్నారు. పేదల ఇళ్లను 400 చదరపు అడుగుల్లోనే నిర్మించాలని.. ప్రభుత్వం అదనంగా 200 చదరపు అడుగులకు పెంచిందని గృహ నిర్మాణ శాఖ చెబుతోంది. 5వ తేదీలోపు ఇందిరమ్మ ఇళ్ల రెండో జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇంటి నిర్మాణం 400 నుంచి 600 చదరపు అడుగుల లోపు ఉండాలనే నిబంధనను విస్తృతంగా ప్రచారం చేయాలని.. క్షేత్రస్థాయి అధికారులకు ఉన్నతాధికారులు ఆదేశాలు ఇస్తున్నారు. నిబంధనల ప్రకారం కాకుండా.. నచ్చినట్టు కట్టుకుంటే బిల్లులు రావనే విషయంపై అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు.
తాపీ మేస్త్రీలకు ఫుల్ డిమాండ్
ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలులో సమస్యలు ఎదురవుతున్నాయి. కచ్చితంగా లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులపై ఒత్తిడి పెరిగింది. అయితే ఈ పథకం ముదుకు సాగాలంటే.. భవన నిర్మాణ పనులు చేపట్టే తాపీ మేస్త్రీలు కీలకం. కానీ ప్రస్తుతం సరిపడా లేరు. దీంతో ప్రభుత్వ ఆదేశంతో అధికారులు దృష్టిపెట్టారు. గ్రామాల్లో కొరత ఉండటంతో.. ఎంపిక చేసిన కొందరికి శిక్షణ ఇప్పించేందుకు కసరత్తు చేస్తున్నారు. యువత అన్ని రంగాల్లో పని చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ భవన నిర్మాణ రంగానికి వచ్చేసరికి విముఖత కనబరుస్తున్నారు. దీంతో శిక్షణ ఇప్పించడం కూడా అధికారులకు కష్టంగా మారుతోంది. అయినా కొందరిని ఎంపిక చేసి.. నిర్మాణ పనుల్లో ఎదురయ్యే ఆటంకాలు, మెలకువలు ఇతర అంశాలపై నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ ఆధ్వర్యంలో శిక్షణ ఇప్పించనున్నారు.ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం రూ.5 లక్షలు ఇస్తోంది. ఆ ఖర్చుతోనే దృఢమైన నిర్మాణం ఎలా చేపట్టాలి, పునాది ఎలా ఉండాలి, సిమెంటు, ఇసుక, కంకర ఎంత పరిమాణంలో వినియోగించాలి, గోడ గట్టిగా ఉండాలంటే ఏంచేయాలి, స్లాబ్‌లో ఇనుము ఎంత వాడాలి ఇతర అంశాలపై అయిదు రోజులపాటు భోజన సౌకర్యంతో శిక్షణ ఇప్పించనున్నారు. ఇందిరమ్మ ఇళ్లే కాకుండా.. భవిష్యత్తులో ఇతర ప్రైవేటు భవన నిర్మాణాల్లోనూ వీరికి ఉపాధి లభించేలా చేస్తామని అధికారులు భరోసా ఇస్తున్నారు.కొరత లేకుండా చేసేందుకు మహిళా తాపీమేస్త్రీలను కూడా ప్రభుత్వం రంగంలోకి దించుతోంది.

తొలిసారిగా మహబూబ్ నగర్ జిల్లాలో 40 మంది మహిళలు తాపీ మేస్త్రీలుగా శిక్షణ తీసుకున్నారు. వీరికి కూడా న్యాక్ ఆధ్వర్యంలోనే శిక్షణ ఇచ్చారు. గతంలో భవన నిర్మాణ కూలీలుగా పనిచేసిన అనుభవం ఉన్న మహిళలను ఎంపిక చేశారు. వీరికి తక్కువ బడ్జెట్‌లో ఇంటిని ఎలా నిర్మించాలో శిక్షణలో వివరించారు.తెలంగాణతో పోలిస్తే.. ఆంధ్రాలో తాపీ మేస్త్రీలు ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఎక్కువ మంది ఉంటారు. ఇప్పటికే హైదరాబాద్ సహా.. తెలంగాణలోని పలు జిల్లాల్లో వీరు పని చేస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లకు తాపీ మేస్త్రీల కొరత రావడంతో.. ప్రస్తుతం వీరికి డిమాండ్ పెరిగింది. ఆంధ్రా సరిహద్దు జిల్లాల్లో కొందరు లబ్ధిదారులు ఇప్పటికే వీరిని సంప్రదించారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఆంధ్రా ప్రాంతానికి తాపీ మేస్త్రీలు పనులు చేస్తున్నారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »