భారత్‌లో పాకిస్థాన్ ‘ఎక్స్’ ఖాతాను నిలిపివేస్తూ కేంద్రం నిర్ణయం
నిర్దేశం, న్యూ డిల్లీ :
మంగళవారం మధ్యాహ్నం ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పెహల్‌గామ్ లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ నరమేధంలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిని కేంద్రం తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలో దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌పై చర్యలకు దిగింది. సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం, పాకిస్థానీ జాతీయులకు భారత్‌లో ప్రవేశంపై నిషేధం విధించడం వంటి ఐదు అంశాలతో కూడిన చర్యలను భారత్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా భారత్‌లో పాకిస్థాన్ ‘ఎక్స్’ ఖాతాను నిలిపివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పెహల్‌గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వ అధికారిక ఎక్స్ అకౌంట్‌ను యాక్సెస్ చేయకుండా నిలిపివేసింది.
పాకిస్థాన్‌పై భారత్ చర్యలు..
1960లో పాక్‌తో కుదుర్చుకున్న సింధూ నదీ జలాల ఒప్పందాన్ని తక్షణమే నిలుపుదల చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. సీమాంతర ఉగ్రవాదానికి అందచేస్తున్న మద్దతును నిలిపివేస్తున్నట్లు పాక్ నుంచి స్పష్టమైన, విశ్వసనీయమైన ప్రకటన వెలువడే వరకు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అటారీ-వాఘా సరిహద్దు చెక్‌పోస్టును వెంటనే మూసివేస్తున్నట్లు తెలిపింది. చట్టబద్ధమైన పత్రాలతో భారత్‌లోకి ప్రవేశించిన పాకిస్థానీ పౌరులు మే 1వ తేదీలోగా ఈ మార్గంలో తిరిగి వెళ్లిపోవచ్చని భారత్ ప్రకటించింది.సార్క్ వీసా మినహాయింపు పథకం కింద పాకిస్థానీ జాతీయులు భారత్‌లో ప్రయాణించడానికి అనుమతించబోమని ప్రభుత్వం ప్రకటించింది. పథకం కింద గతంలో పాకిస్థానీ జాతీయులకు జారీ చేసిన వీసాలు రద్దయినట్లేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పథకం కింద వీసా తీసుకుని ప్రస్తుతం భారత్‌లో ఉన్న పాకిస్థానీ జాతీయులు 48 గంటల్లోగా భారత్‌ను వీడాలని ప్రభుత్వం ఆదేశించింది.ఇస్లామాబాద్‌లోని భారతీయ హై కమిషన్ నుంచి తన రక్షణ, నౌకాదళ, వైమానిక సలహాదారులను ఉపసంహరిస్తున్నట్లు భారత్ ప్రకటించింది. అదే విధంగా ఢిల్లీలోని పాకిస్థానీ హై కమిషన్‌లో ఉన్న ఆ దేశ సైనిక, నౌకాదళ, వైమానిక సలహాదారులు వారం రోజుల్లోగా భారత్‌ను వీడాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.భారత్‌లోని పాక్ హై కమిషన్లలోని దౌత్యాధికారుల సంఖ్యను ప్రస్తుతమున్న 55 నుంచి 30కి తగ్గించాలని పాకిస్థాన్‌ను ఆదేశించినట్టు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు.