– సీఆర్పీసీ సెక్షన్ ప్రకారం 125 కోరవచ్చంటున్న సుప్రీంకోర్టు
– తాజా తీర్పులో ఒక ముస్లిం మహిళకు ఇదే తీర్పు
– పెళ్లైన వారితో పాటు కాని మహిళలకు కూడా వర్తింపు
నిర్దేశం, న్యూఢిల్లీ: ముస్లిం మహిళ తన భర్త నుంచి భరణం డిమాండ్ చేయవచ్చని కోర్టు మరోసారి స్పష్టం చేసింది. తన భార్యకు భరణం చెల్లించాలన్న తెలంగాణ హైకోర్టు ఆదేశాలను మహ్మద్ అబ్దుల్ సమద్ అనే ముస్లిం వ్యక్తి సుప్రీంకోర్టులో సవాలు చేశాడు. ఈ పిటిషన్‌ను బుధవారం విచారించిన కోర్టు మెయింటెనెన్స్ అలవెన్స్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. క్రిమినల్ ప్రొసెడ్యూర్ కోడ్ లోని సెక్షన్ 125 ప్రకారం సుప్రీంకోర్టు బుధవారం ఈ తీర్పు చెప్పింది. ‘ముస్లిం మహిళలు (విడాకుల హక్కుల పరిరక్షణ) చట్టం 1986’ సెక్యులర్ చట్టాన్ని అతిక్రమించదని కోర్టు పేర్కొంది. రూ.10,000 భరణం చెల్లించాలని మహ్మద్ సమద్‌ను హైకోర్టు ఆదేశించింది.
మహిళలందరికీ వరిస్తుంది
సెక్షన్ 125 అనేది పెళ్లయిన మహిళలకు మాత్రమే కాకుండా మహిళలందరికీ వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసింది. సీఆర్పీసీ సెక్షన్ 125 కింద దరఖాస్తు పెండింగ్‌లో ఉన్న సమయంలో సంబంధిత ముస్లిం మహిళ విడాకులు తీసుకుంటే, ఆమె ‘ముస్లిం మహిళల (విడాకుల హక్కుల రక్షణ) చట్టం 2019’ సహాయం తీసుకోవచ్చని కోర్టు పేర్కొంది.
సీఆర్పీసీ సెక్షన్ 125 అంటే ఏమిటి?
షా బానో కేసులో తీర్పు ఇస్తూ సీఆర్పీసీ సెక్షన్ 125 సెక్యులర్ నిబంధన అని, ఇది ముస్లిం మహిళలకు కూడా వర్తిస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే, అది ‘ముస్లిం మహిళల (విడాకుల హక్కుల రక్షణ) చట్టం, 1986’ ద్వారా రద్దు చేయబడింది. ఆ తర్వాత, చట్టం చెల్లుబాటుపై 2001లో మరోసారి పున:సమీక్షించి.. భార్య, పిల్లలు, తల్లిదండ్రుల నిర్వహణకు సంరక్షణకు హక్కులు కల్పిస్తుంది. దీని ప్రకారం.. ఒక వ్యక్తి తన భార్య, బిడ్డ లేదా తల్లిదండ్రులను చూసుకోవడానికి నిరాకరిస్తే వారి మెయింటెనెన్స్ కోసం నెలవారీ భత్యం ఇవ్వాలని కోర్టు ఆదేశిస్తుంది.