– బర్త్ డే సందర్బంగా ప్రకటించిన తెలంగాణ బీఎస్పీ
– లోకల్ బాడీల్లో 500 మంది ప్రతినిధులను గెలిపిస్తాం
– బీఎస్పీ రాష్ట్ర కోర్డినేటర్ ఇబ్రాం శేఖర్
నిర్దేశం, హైదరాబాద్ః బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మాయావతి పుట్టినరోజు సందర్బంగా తెలంగాణలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 500 మంది ప్రజాప్రతినిధుల్ని గెలిపించి బహుమతిగా ఇస్తామని తెలంగాణ రాష్ట్ర బీఎస్పీ కోర్డినేటర్ ఇబ్రాం శేఖర్ అన్నారు. బుధవారం హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ చౌరస్తాలో శేఖర్ నాయకత్వంలో మాయావతి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ.. సామాజిక పరివర్తన మహానాయకురాలు, దేశంలో అతిపెద్ద రాష్ట్రానికి నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన బహుజన సమాజినికి పెద్దదిక్కు అక్కా మాయావతి జన్మదినం సందర్భంగా తెలంగాణ ప్రజల నుంచి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.
“ఇకపోతే, దేశంలో రాజ్యాంగం అమలు సరిగా జరగడం లేదు. రాజ్యాంగ వ్యతిరేక పాలన సాగుతోంది. గతంలో కాంగ్రెస్ పాలన అయినా, నేటి భారతీయ జనతా పార్టీ పాలన అయినా.. ప్రజలకు ఏమాత్రం అనుకూలంగా లేదు. ప్రజల్ని అణచివేసి, మోసం చేసి, కుట్రచేసే పాలనే ఇదంతా. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచిపోయినా బహుజనుల మీద దాడి జరుగుతోంది. రెడ్ల మీద దాడులు జరగట్లేదు, కమ్మల మీద దాడులు జరగట్లేదు, వెలమల మీద దాడులు జరగట్లేదు. కారణం ఆ కులాలు అధికారంలో ఉన్నాయి. బహుజనుల మీద దాడులు జరగొద్దంటే బహుజనులు అధికారంలో ఉండాలని మాన్యవర్ కాన్షీరాం చెప్పారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మాయావతి ముఖ్యమంత్రి అయిన తర్వాత దళిత సమాజం మీద దాడులు తగ్గాయి, ఒకానొక సమయంలో మొత్తంగా పడిపోయాయి. తెలంగాణలో ఉన్న బహుజనులు ఇది గమనించాలి. బీఎస్పీ గెలిచినప్పుడే బహుజనులకు అధికారం లభించినట్టు. బీఎస్పీ అధికారంలో ఉంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలు సంపూర్ణ రక్షణతో ఉంటారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఆ సమయంలో టీఆర్ఎస్ పార్టీకి ఇద్దరు మాత్రమే ఎంపీలు ఉన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాల్ని గుర్తించిన బీఎస్పీ సుప్రెమో మాయావతి.. తన 37 మంది ఎంపీలతో తెలంగాణకు మద్దతు ఇచ్చి పార్లమెంట్ లో బిల్లు పెట్టేలా చేశారు. బీఎస్పీ మద్దతు లేకుంటే తెలంగాణ అంశం రాజకీయంగా బలపడి శాసనం అయిందంటే దానికి కారణం మాయావతి అన్న విషయాన్ని తెలంగాణ ప్రజలు మర్చిపోవద్దు. తెలంగాణ ఈరోజు సగర్వంగా స్వతంత్రంగా తన పాలన తాను చేసుకుంటోందంటే అందుకు ప్రధాన కారణం బీఎస్పీ. కానీ, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు వంచించాయి. ఉద్యమ పార్టీగా అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పదేళ్ల పాలన గురించి కొద్ది రోజుల క్రితమే ప్రజలు తమ తీర్పును ఇచ్చారు. ఇక, బీఆర్ఎస్ కు ప్రత్యమ్నాయంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కేవలం ఏడాదిలోనే గులాబీ పార్టీ పాలనకు తేడా ఏమి లేదని నిరూపించుకుంది. బీజేపీ ఎలాగూ ఏమీ చేయదు. ఇక తెలంగాణ ప్రజలకు ముందున్న ఏకైక ప్రత్యామ్నాయం బహుజన్ సమాజ్ పార్టీ.
బహుజన సమాజాన్ని మోసం చేస్తున్నటువంటి అగ్రవర్ణాల ఆధిపత్యం నుంచి బహుజన రాజ్యం తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణలోని 90% పైగా ఉన్న బహుజనులందరికీ బీఎస్పీ వేదిక ద్వారా ఏకమవుదామని బహుజన సుప్రెమో మాయావతి జన్మదినం సందర్బంగా ప్రతిజ్ణ చేద్దాం. అలాగే, జన్మదినం సందర్బంగా మాయావతి గారికి తెలంగాణ నుంచి ఒక బహుమతి ఇవ్వబోతున్నాం. తొందరలో రాష్ట్రంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రం నుంచి సుమారు 500 మంది ప్రజాప్రతినిధులను గెలిపించి మాయావతికి గిఫ్ట్ గా ఇస్తాం” అని ఇబ్రాం శేఖర్ అన్నారు. ఈ కార్యక్రమంలో గుండెల ధర్మేందర్ (స్టేట్ జనరల్ సెక్రెటరీ), గ్యార జగన్ (స్టేట్ సెక్రెటరీ), దొడ్డి శ్రీనివాస్ (జిల్లా ఇంచార్జీ), పల్నాటి రాములు (జిల్లా అధ్యక్షుడు), నితిన్ కిశోర్ (జిల్లా సెక్రెటరీ).. వీరితో పాటు నియోజకవర్గ అధ్యక్షులు, ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.