నిర్దేశం: కొద్ది రోజుల క్రితం విడుదలైన తంగలాన్ అనే సినిమాలో ‘మినిక్కి.. మినిక్కి’ అనే పాట చూసే ఉంటారు. హీరో తెగకు చెందిన ప్రజలు మొదటిసారి రైకలు కట్టుకున్న ఆనందంలో ఊరు ఊరంతా పండగ చేసుకుంటారు. మన దేశంలోని సామాజిక వ్యవస్థ, చరిత్ర గురించి ఏమాత్రం అవగాహన ఉన్నా.. ఆ పాటలోని లోతు సులభంగా అర్థం అవుతుంది. అవును.. ఒకప్పుడు రైక వేసుకుంటే పన్ను కట్టాల్సి వచ్చేది. అది కూడా కేవలం దళిత స్త్రీలపై మాత్రమే విధించిన దుర్మార్గపు ఆచారం ఇది. బహుశా.. ఈ విషయం చాలా మందికి తెలియదు.
రొమ్ము పన్ను ఏమిటి ?
భారతదేశ చరిత్రలో మహిళలు తమ శరీరంలోని కొన్ని భాగాలను కవర్ చేయడానికి పన్ను చెల్లించాల్సిన సమయం అది. దళిత స్త్రీలు తమ రొమ్ములను కప్పుకోవడానికి కొంత మొత్తాన్ని చెల్లించే ఈ పద్ధతినే రొమ్ము పన్ను అంటారు. ఈ పన్ను దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో, ముఖ్యంగా కేరళ, తమిళనాడులో ప్రబలంగా ఉండేది. ఈ పన్ను చెల్లించలేని మహిళలు అనేక రకాల హింసలకు గురయ్యేవారు.
రొమ్ము పన్ను ఎందుకు విధించారు ?
ఈ పన్ను విధించడం వెనుక అనేక కారణాలున్నాయి .
కుల వ్యవస్థ : భారతదేశంలో ఉన్న కుల వ్యవస్థ దీనికి ప్రధాన కారణం. దళితులు సమాజంలోని అట్టడుగు వర్గంగా పరిగణించబడతారు. అందుకే వారిపై ఇష్టారీతిన ఆంక్షలు, నిబంధనలు పెట్టేవారు. వారిపై జరిగే హింసల్లో రొమ్ము పన్ను ఒకటి.
అధికార దుర్వినియోగం : దళితులను అణిచివేసేందుకు పాలకవర్గం ఇలాంటి పన్నులు విధించేది.
శారీరక దుర్వినియోగం : దళిత మహిళలపై శారీరక వేధింపులను ప్రోత్సహించేందుకు ఈ పన్ను విధించారు.
ఇది ఎలా ముగిసింది ?
నంగేలి అనే దళిత మహిళ ఈ పన్నుపై తిరుగుబాటు చేసింది. ఈ పన్నుకు వ్యతిరేకంగా ఆమె తన రొమ్ములను కోసుకుని నిరసన వ్యక్తం చేసింది. నంగేలి ఈ త్యాగం దళిత మహిళలకు స్ఫూర్తిదాయకంగా మారింది. దీని తరువాత, 19 వ శతాబ్దంలో బ్రిటిష్ పాలనలో దీనిని చట్టవిరుద్ధంగా ప్రకటించారు.