లిఫ్ట్ లో ఇరుక్కుని బాలుడు మృతి
హైదరాబాద్, నిర్దేశం :
అసిఫ్ నగర్ ఠాణా పరిధి సంతోష్‌నగర్ కాలోనీ ముస్తఫా అపార్ట్మెంట్ లిఫ్ట్ లో ఇరుక్కుని ఐదేళ్ల చిన్నారుడు మరణించాడు. బుధవారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటన వివరాలు.. అపార్ట్మెంట్లో తల్లిదండ్రులు, సోదరితో చిన్నారి సురేందర్ ఉంటున్నాడు. తండ్రి శామ్ బహదూర్ ఇక్కడే కాపలాదారుగా చేస్తున్నాడు. ఆరు అంతస్తులున్న భవనంలో వసతిగృహం నిర్వహిస్తున్నారు. శామ్ బహదూర్ లిఫ్ట్ పక్కలో ఉన్న చిన్నగదిలో ఉంటున్నారు. బుధవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో సురేందర్ ఆడుకుంటూ లిఫ్ట్ తలుపు మధ్యకు వెళ్లగా.. ఎవరూ గుర్తించలేదు. 10 నిముషాల తర్వాత సురేందర్ ఎక్కడున్నాడని వెతకగా.. లిఫ్ట్ మధ్యలో ఇరుక్కుని రక్తపుమడుగులో అపస్మారకస్థితిలో ఉన్నాడు.
తల్లిదండ్రులు రోదిస్తుండగానే.. అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు లిఫ్ట్లో ఇరుక్కున్న బాలుడిని హుటాహుటిన ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. ఒక్కగానొక్క కొడుకు మరణించాడన్న సమాచారంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. వీరు నేపాల్ నుంచి జీవనోపాధి నిమిత్తం 7నెలల క్రితం నగరానికి వచ్చారు. తొలుత గుడిమల్కాపూర్లో నిర్మాణంలో ఉన్న భవనానికి కాపలాదారుగా పనిచేశాడు. 3 నెలల క్రితం ఈ అపార్ట్మెంట్కు కాపలాదారుగా వచ్చాడు. నిర్వాహకులు గది ఇస్తామని చెప్పడంతో భార్య, కుమార్తె, కుమారుడిని నేపాల్ నుంచి తీసుకువచ్చారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మాని ఆసుపత్రికి తరలించారు.