మోదీ.. కేసీఆర్ ఇద్దరూ నిరుద్యోగులను మోసం చేసినోళ్లే

మోదీ.. కేసీఆర్ ఇద్దరూ నిరుద్యోగులను మోసం చేసినోళ్లే

: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 18 : టీఎస్పీఎస్సీ కేసు విచారణ రాష్ట్ర అధికారులు చేపడితే కేసులో నిజానిజాలు నిగ్గు తేలవన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. గాంధీ భవన్ లో మీడియాలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వంలో పెద్దలను కాపాడుకునేందుకే ప్రభుత్వం సిట్ ను ఉపయోగించుకుందని ఆరోపించారు ఆయన. ప్రతీ ఏటా 2కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోదీ నిరుద్యోగులను మోసం చేశారన్నారు రేవంత్ రెడ్డి.

22 కోట్ల 6 లక్షల దరఖాస్తులు వస్తే 7,22,311ఉద్యోగాలు ఇచ్చామని పార్లమెంట్ లో ప్రధాని సమాధానం ఇచ్చారు. పార్లమెంటు సాక్షిగా నిరుద్యోగులను మోసం చేసినట్లు ప్రధాని అంగీకరించారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే ఒకే రోజులో 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని బండి సంజయ్ చెబుతున్నాడు. బండి మాటలు వింటే నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదన్నారు రేవంత్ రెడ్డి.

హైదరాబాద్ వరదల సమయంలో బండి పోతే బండి ఇస్తామన్నారు… ఆ తరువాత ఇన్సూరెన్స్ ఉంది కదా అన్నారు. అసలు ఏ శాఖలో ఎన్ని ఉద్యోగ ఖాళీలు ఉన్నాయో బండికి తెలుసా? ఇంటికో ఉద్యోగం అని కేసీఆర్, ఒకే రోజు 2లక్షల ఉద్యోగాలని బండి ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రజాక్షేత్రం నుంచి పార్లమెంట్ వరకు నిరుద్యోగుల కోసం కొట్లాడింది కాంగ్రెస్. బండి సంజయ్ నిరుద్యోగ మార్చ్  మోడీ ఇంటి దగ్గర చేయాలని సలహా ఇచ్చారు ఆయన.

ఈ నెల 21న నల్గొండలో మాహాత్మా గాంధీ యూనివర్సిటీ లో  నిరుద్యోగ నిరసన ఈ నెల 24న ఖమ్మం జిల్లాలో, 26న ఆదిలాబాద్ లో నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు రేవంత్ రెడ్డి. మే 4 లేదా 5న సరూర్ నగర్ లో నిరుద్యోగుల సమస్యలపై భారీ సభ నిర్వహిస్తామన్నారు ఆయన. ఎల్బీ నగర్ లోని శ్రీకాంతాచారి విగ్రహానికి నివాళులు అర్పించి  సభా ప్రాంగణానికి ర్యాలీగా వెళతాం. ఈ సభకు ప్రియాంక గాంధీ గారు ముఖ్య అతిధిగా పాల్గొంటారని వివరించారు.

ఇది కాంగ్రెస్ పార్టీ కోసం  కాదు.. నిరుద్యోగుల కోసం చేస్తున్న పోరాటమన్నారు రేవంత్ రెడ్డి. అన్ని నిరుద్యోగ సంఘాలు మద్దతు తెలపాల్సిందిగా కోరుతున్నాం. మే 9 నుంచి హాత్ సే హాత్ జోడో యాత్ర రెండో విడత కార్యక్రమం ఉంటుంది. జోగులాంబ జిల్లా నుంచి యాత్ర ప్రారంభమవుతుందని వివరించారు రేవంత్ రెడ్డి.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!