కామాంధులతో జాగ్రత్త..
కర్మభూమిలో పూసిన ఓ పువ్వా
విరిసీ విరియని ఓ చిరునవ్వా
కన్నుల ఆశలు నీరై కారగ
కామాంధులకే బలియై పోయావా..
పారాణింకా ఆరనే లేదు
తోరణాల కల వాడనే లేదు
పెళ్లి పందిరి తియనే లేదు
అప్పగింతలూ అవ్వనే లేదు
గళగళా పారే ఓ సెలయేరా
పెళ్ళి కూతురుగా ముస్తాబయ్యి
శ్మశానానికే కాపురమెళ్ళావా…
రాక్షస విలువలూ రాజ్యమేలెటి
నరక ప్రాయపూ సంఘం లోనా
మానవత్వమే మంటగలిసెనా
మమతలకర్థం లేకపోయనా
వేధ మంత్రమెగతాలి చేసేనా
ప్రమాణాలు పరిహాసమాడెనా
ప్రేమ బందముగా కట్టిన తాళి
ఉరితాడయ్యి కాటువేశనా
గళగళ పారే ఓ సెలయేరా
పెళ్లి కూతురుగ ముస్తాబయ్యి
శ్మశానానికే కాపురమెల్లేవా…
– కలేకూరి ప్రసాద్