హాట్ హాట్ సీజన్ లో అందాల పోటీలు
హైదరాబాద్, నిర్దేశం:
మిస్ వరల్డ్ పోటీలు అంటే ప్రపంచంలోనే ఓ అరుదైన , అద్వితీయమైన వేడుక. వివిధ దేశాల నుంచి సుందరీమణులు పాల్గొనే ఈ వేడుకలకు ఈసారి తెలంగాణలోని హైదరాబాద్ వేదిక కానుంది. ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూసే ప్రపంచ అందాల పోటీలకు హైదరాబాద్ ఆతిథ్యమివ్వడం అనే మాట వింటుంటేనే హైదరాబాద్ జోష్ పెంచుతుంది. ఒక్కసారి ప్రపంచం దేశాలన్ని హైదాబాద్ వైపు చూపుతిప్పుకునే ఆ రోజు అతి చేరువలోనే ఉంది. ఈ ఏడాది ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్‌లో చెయ్యాలని నిర్వాహకులు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. దీంతో 72వ మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనున్నది. చారిత్రక, వారసత్వ సంపదను ప్రపంచానికి చాటడానికి తెలంగాణకు ఇదొక గొప్ప అవకాశం కానుంది. తెలంగాణ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటేందుకు అరుదైన ఘట్టం కానుంది.
ఈ ఏడాది అందాల పోటీలకు అనువైన ప్రదేశంగా తెలంగాణను ఎంచుకోవడం, అందులోనూ హైదరాబాద్ వంటి మహానగరం ఈ వేడుకులకు సిద్దమవ్వడం ఈ ప్రభుత్వంలో జరిగే ఓ అద్వితీయం వేడుకగా చెప్పవచ్చు.
ఈ ఏడాది మేనెలలో నాలుగు వారాల పాటు జరిగే ఈ పోటీల ప్రారంభ, ముగింపు వేడుకలతోపాటు గ్రాండ్ ఫినాలేను సైతం హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ ఫెస్టివల్‌లో 120కి పైగా దేశాలు పాల్గొంటాయి. బ్యూటీ విత్ ఎ పర్పస్ అనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ మిస్ వరల్డ్ అందాల పోటీల్లో పాల్గొనే దేశ విదేశాల ప్రతినిధులకు తెలంగాణ స్వాగతం పలకబోతుంది. మే 7 నుంచి ఈ అందాల పోటీలు ప్రారంభం కానున్నాయి.
మే 31న గ్రాండ్ ఫినాలే ఉంటుంది. ప్రస్తుత మిస్ వరల్డ్ తర్వాత అందాల సుందరి కిరీటాన్ని ఎవరు ధరిస్తారో గ్రాండ్ ఫినాలే రోజు తేలనుంది.గతంలో న్యూఢిల్లీ, ముంబైలో ప్రపంచ సుందరి పోటీలు నిర్వహించారు. 71వ ఎడిషన్ ముంబైలోనే జరిగింది. ప్రపంచంలోనే అత్యుత్తమ మౌలిక సదుపాయాలున్న హైదరాబాద్ ఇప్పటికే పలు అంతర్జాతీయ వేడుకలకు వేదికైంది. ఐటీ, ఫార్మాసూటికల్, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో దూసుకెళ్తున్న తెలంగాణకు ఈ అవకాశం దక్కడం నిజంగా గర్వించదగ్గ విషయమే. తెలంగాణను పర్యాటకంగా ప్రపంచ పటంలో నిలబెట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు ఇప్పటికే సిద్దం చేసినట్లు సమాచారం. తెలంగాణ జరూర్ ఆనా నినాదంతో టూరిజం శాఖ దేశ విదేశీ పర్యాటకులను ఇప్పటికే ఆహ్వానాలు పంపుతోంది. గొప్ప చేనేత వారసత్వం, అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు, అరుదైన వంటకాలు, విభిన్నమైన కళా వారతస్వమున్న తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలను స్వాగతిస్తున్నామని.. మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్మెన్, సీఈఓ జూలియా మోర్లీ, తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ తాజాగా ఓ అధికారిక ప్రకటన విడుదల చేసారు.మిస్ ఇండియా పోటీలు అంటేనే సుందరీమణుల అలరిస్తారు. అందులోనూ మిస్ వరల్డ్ పోటీలు అంటే ఇంక మాటల్లో చెప్పక్కర్లేదు. ఎంత ఆహ్లదంగా ఉంటుంతో, అంతే స్థాయిలో వివిధ దేశాల యువతుల మధ్య గట్టిపోటీ కూడా సర్వసాధారణం. ఈ పోటీల వేదికగా హైదరాబాద్ బ్రాండ్ వాల్యూని మరింత పెంచడంతోపాటు, ప్రపందేశాల ప్రతినిధులను ఆకట్టుకునేందుకు పక్కా ప్రణాళికలు సిద్దం చేసింది తెలంగాణ ప్రభుత్వం.