తెలంగాణ మదర్సాల్లో బంగ్లాదేశీయులు – ఎంపీ రఘునందన్ రావు
నిర్దేశం, హైదరాబాద్ః
తెలంగాణలో విచ్చలవిడిగా కొత్త మదర్సాలు పుట్టుకువస్తున్నాయని, వాటిలో ఎన్నింటికి అనుమతులు ఉన్నాయో వివరాలు చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాస్తున్నానని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఇవాళ బీజేపీ స్టేట్ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడిన ఆయన మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్న వాటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మదర్సాల్లో జరుగుతున్న చట్టవ్యతిరేక కార్యక్రమాలపైన నియంత్రణ ఎవరికి ఉందో అధికారులు ఎవరూ చెప్పడం లేదని అందుకే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తున్నామన్నారు. త్వరలోనే గవర్నర్ ను ఆ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్తామన్నారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం, సంగారెడ్డి-సదాశివపేట మధ్య హైవైపై ఉన్న మదర్సా విషయంలో తమకు అనుమానాలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
మదర్సాల్లో బంగ్లాదేశీయులు: జిన్నారంలో మదర్సా విషయంలో కామన్ సిటిజన్ గా తాను చేసిన దర్యాప్తులో తెలంగాణే కాదు యావత్ దేశం ఆశ్చర్యపడే విషయాలు బయటపడ్డాయని రఘునందన్ రావు అన్నారు. జిన్నారం మదర్సాలో మొత్తం 70 మంది విద్యార్థులు చదువుతుంటే అందులో 65 మంది విద్యార్థులు బిహార్ రాష్ట్రంలోని కిషన్ గంజ్ జిల్లాకు చెందిన వారు ఉన్నారని, వీరికి చదువు చెప్పే ఉపాధ్యాయులు సైతం కిషన్ గంజ్ కు చెందిన వారేనని అన్నారు. జిన్నారం కేవలం చిన్న మండల కేంద్రం అని అలాంటి చోటకు ఎక్కడో బిహార్ కు చెందిన విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకోవాల్సి అవసరం ఏంటనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. కిషన్ గంజ్ బంగ్లాదేశ్ కు బార్డర్ అని బంగ్లాదేశ్ కు చెందిన విద్యార్థులే అక్కడి నుంచి వచ్చి జిన్నారంలో శిక్షణ పొందుతున్నారనే అనుమానం తమకు ఉందన్నారు.
బంగ్లాదేశ్ నుంచి కిషన్ గంజ్ లోకి అక్రమంగా వలసవచ్చిన వారు అక్కడున్న హిందువులను బెదిరిస్తూ బలవంతంగా వారి భూములు కొనుగోలు చేస్తూ ల్యాండ్ జిహాద్ కు పాల్పడుతున్నారని ఈ విషయం జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయన్నారు. జిన్నారంలో కోదండరామస్వామి దేవాలయానికి సంబంధించిన భూముల్లో మదర్సా ఎలా వచ్చిందో అధికారులు చెప్పాలన్నారు. జిన్నారం మదర్సా ఎపిసోడ్ లో తాను ఓ కామన్ సిటిజన్ గా ఎంక్వయిరీ చేస్తే అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయని ఇక పోలీసులు దర్యాప్తు చేస్తే ఎలాంటి విషయాలు వెలుగు చూస్తాయోనన్నారు.
247 మంది నేపాలీలకు ఆధార్ కార్డులు : తన పార్లమెంట్ పరిధిలోని ఇస్నాపూర్ లోనే 247 మంది నేపాలీలకు ఆధార్ కార్డులు ఇచ్చారని కేంద్ర ప్రభుత్వం విదేశీయులను వెనక్కి పంపాలని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో అక్రమంగా ఉంటున్న వారిని గుర్తించి పంపించి వేయాలన్నారు. రాష్ట్ర ప్రజలంతా ఎక్కడికక్కడ మీ చుట్టుపక్కల్లో ఉన్న మదర్సాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.