నిర్దేశం, ఢాకా: నిరసనకారులు కోరుకున్నట్లే రిజర్వేషన్లను కోర్టు రద్దు చేసింది. హసీనా రాజీనామా చేసి ఏకంగా దేశం వదిలి పారిపోయింది. అయినా బంగ్లాదేశ్‌లో హింస ఆగడం లేదు. ఇప్పటికే సుమారు 600 మంది చనిపోయారు. అనేక మంది గాయపడ్డారు. ఒక నినాదం నుంచి మరొక నినాదానికి హింస బదిలీ అవుతోంది. అధికార పార్టీతో మొదలై హింస దేశంలోని మైనారిటీల వైపుకు మళ్లింది. నిరసనకారులు హిందువులను టార్గెట్ చేస్తున్నారు. చాలా చోట్ల మైనార్టీలపై దాడులు జరిగాయి.
అయితే, మైనారిటీలపై దాడుల పట్ల బంగ్లాదేశ్ లో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం క్షమాపణలు చెప్పింది. హిందువులు సహా మైనారిటీలై దాడులను ఆపడంలో తాము విఫలమయ్యామని పశ్చాతాపం వ్యక్తం చేసింది. పరిస్థితిని తొందరలోనే చక్కదిద్దుతామని, అందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని ప్రభుత్వం పేర్కొంది. మైనారిటీలకు భద్రత కల్పించడంలో విఫలమైనందుకు బంగ్లాదేశ్ హోం మంత్రిత్వ శాఖల సలహాదారు బ్రిగేడియర్ జనరల్ (రిటైర్డ్) ఎం సఖావత్ హుస్సేన్ హిందువులకు క్షమాపణలు చెప్పారు. మైనార్టీ సోదరులను కాపాడుకోవడం తమ ప్రభుత్వ బాధ్యత, అంతిమ కర్తవ్యమని అన్నారు.
మైనారిటీలను రక్షించడం తన మతంలో భాగమని సఖావత్ హుస్సేన్ అన్నారు. హిందూ సోదరులకు క్షమాపణలు చెప్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో అరాచక కాలం నడుస్తోంది. పోలీసుల పరిస్థితి బాగాలేదని, మైనార్టీలు తమకు సోదరులని, ప్రజలంతా కలిసిమెలిసి పెరిగారని సమాజ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో వారిని కాపాడుకోవడం మన బాధ్యతని ఆయన అన్నారు.