రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ
నిర్దేశం, హైదరాబాద్ః
సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ లేఖ రాసారు. ఫీజురీయంబర్స్ మెంట్ బకాయిలపై అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాట ఏమైందని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంవల్ల రూ.8 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించక పోవడంతో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి. అధ్యాపకులకు, సిబ్బందికి జీతభత్యాలు, మెయింటెనెన్స్ ఛార్జీలు కూడా చెల్లించలేక అవస్థలు పడుతున్నా పట్టించుకోరా? ఇప్పటికే అనేక డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలలు మూత పడ్డాయి. ప్రభుత్వం రీయంబర్స్ మెంట్ బకాయిలు ఇవ్వకపోవడంతో ఫీజులు చెల్లించనిదే విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. విద్యార్థులకు, కాలేజీ యాజమాన్యాల మధ్య గొడవలై పోలీస్ స్టేషన్ల దాకా కేసులు వెళుతున్నా పట్టించుకోరా, ఫీజు బకాయిలన్నీ వన్ టైం సెటిల్ మెంట్ చేస్తామని ఒకసారి, 12 వాయిదాల్లో చెల్లిస్తామని మీరు మాట ఇచ్చిన సంగతి మర్చిపోయారా?
ఈ విద్యా సంవత్సరం నుండే విద్యార్థులకు చెల్లించే ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలను ఆన్ టైంలోనే నిర్ణీత వ్యవధిలో చెల్లిస్తామని ఇచ్చిన హామీని విస్మరించారా, పవిత్రమైన శాసనసభ సాక్షిగా ఇచ్చిన హామీలను కూడా అమలు చేయక పోతే ప్రజల్లో మీపై నమ్మకం సన్న గిల్లుతోంది. ప్రభుత్వ నిర్లక్ష్యం లక్షలాది మంది విద్యార్థులను, కాలేజీ యాజమాన్యాలను, అందులో పనిచేస్తున్న సిబ్బందిని తీవ్రమైన మానసిక క్షోభకు గురి చేస్తున్నాయి. డిగ్రీ కళాశాలలకు నాలుగేళ్లుగా ఫీజు రీయంబర్స్ మెంట్ చెల్లించక పోవడంతో కాలేజీలు నడపలేక చేతులెత్తేశాయి.ఒక్క శాతవాహన వర్శిటీ పరిధిలోనే పదుల సంఖ్యలో డిగ్రీ కాలేజీలు మూతపడ్డాయి. విద్యార్థుల భవిష్యత్తు, యాజమాన్యాల మనుగడను ద్రుష్టిలో ఉంచుకుని తక్షణమే ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించండని లేఖలో పేర్కోన్నారు.