అరుణోదయ రామారావు అమరత్వ స్ఫూర్తితో
శ్రామిక రాజ్య గొంతులవుదాం..
పెద్దపల్లి, మే 5 : అరుణోదయ సాంస్కృతిక సేనాని రామారావు అమరత్వ స్ఫూర్తితో శ్రామిక వర్గ రాజ్యం స్థాపనకు గొంతుకలవుదామని అరుణోదయ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి నాగన్న, దాసు లు అన్నారు.
పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో 2023 మే 5 తేదీన 4వ స్మారక సభ రాష్ట్ర నాయకులు బతుకుల రాజన్న అధ్యక్షతన నిర్వహించారు. ఈ సభలో కామ్రేడ్ నాగన్న & దాసు లు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ రామన్నపాట పోరుతూట, దోపిడి నిర్మూలన కోసం సాగే వేట అని వారు అన్నారు. మునివేళ్ళతో డప్పుల మీద నిప్పుల దరువులేచిన, రామారావు రాగాలు రాజ్యాన్ని ప్రశ్నించిందనీ వారు తెలిపారు.
రామన్న రాగాల ఆలాపన అనునిత్యం మనల్ని మేలుకొలుపుతనే ఉన్నాయని వారు అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఆర్థిక పునాది అయితే కళలు సంస్కృతి ఉపరి కట్టడం గా ఉంటాయని ఆయన తెలిపారు. కళ కల కోసం కాదని, కాసుల కోసం కాదని,జనం కోసమని రామన్నభావించి, విప్లవ వీరుల త్యాగాలు కీర్తిస్తూ పాడిన పద్యాలు, పాటలు ప్రజా కళాకారుల కర్తవ్యాన్ని బోధించి వెన్ను తట్టారని వారు పేర్కొన్నారు. శ్రామిక జన సిద్ధాంతాన్ని పాట,మాట లతో రామన్న ఆలపించి, ఆకట్టుకునే వాడిని వారు తెలిపారు.
సమాజ మార్పు ఆకాంక్షించే కళాకారులు తన, పాట, కళా రూపాలతో సమ్మెట దెబ్బ వేయాలని వారు పిలుపునిచ్చారు.సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి కే రాజన్న పాల్గొని ప్రసంగిస్తూ
దేశంలోని ఐదు శాతం మంది చేతుల్లో 60 శాతం సంపద కేంద్రీకరించబడి ఉందని, దేశ జనాభాలో జనుల చేతలో కేవలం మూడు శాతం సంపద మాత్రమే ఉందని ఆయన తెలిపారు. దేశంలో ఆకలి, అవస్థ, అసమానతలు,కుల,మతం, వివక్షతలు హద్దుమీరుతున్నాయని ఆయన అన్నారు. ప్రశ్నించే గొంతులను నిర్బంధిస్తున్నాయని ఆయన అన్నారు. ధిక్కార స్వరాలతో సమర శంఖం పూరించడమే నిజమైన నివాళి అని అన్నారు.
ఈ సభలో అరుణోదయ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉదయగిరి, ఎస్.కె అబ్దుల్, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఐ కృష్ణ రాష్ట్ర నాయకులు ఈ నరేష్, ఎండి కాజా మొయినుద్దీన్, అశోక్ అరుణోదయ రాష్ట్ర కోశాధికారి మల్లన్న, నాయకులు జ్యోతి, మల్లేష్,లు పాల్గొని ప్రసంగించారు. అరుణోదయ కళాకారులు అరుణ ,శ్రీకాంత్, బానేష్, మల్లేష్ , జ్యోతి, ప్రజానాట్యమండలి కళాకారులు రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.