రివర్స్ గేర్ లో ఆర్మూర్ కారు
నిజామాబాద్, నిర్దేశం:
ఆ జిల్లా బీఆర్ఎస్‌కి కంచుకోట. కానీ ఇప్పుడు ఆ జిల్లాలో పార్టీ క్యాడర్‌కి ధైర్యం చెప్పే బాస్ కరువయ్యాడట. గత 10 ఏళ్లలో 8 నుంచి 9 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకున్న గులాబీ పార్టీ పరిస్థితి అక్కడ అంత దయనీయంగా ఎందుకు తయారైంది? ఆ జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు ఎందుకు ముఖం చాటేస్తున్నారు?. పార్టీ అధినేత ఆదేశాలను సైతం ఎందుకు పట్టించుకోవడం లేదునిజామాబాద్ జిల్లాలో తాజా మాజీ ఎమ్మెల్యేల తీరు పై.. గులాబీ క్యాడర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కష్ట కాలంలో ఉంటే.. నేతలు నియోజకవర్గానికి ముఖం చాటేస్తుండటం కార్యకర్తలకు మింగుడు పడటం లేదంట. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నిరసనలకు పిలుపునిస్తే జిల్లాలో సగానికి పైగా నియోజకవర్గాల్లో అసలు ఉలుకు పలుకే ఉండటం లేదంట. బాల్కొండ లో మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అడపాదడపా నియోజకవర్గంలో పర్యటిస్తూ క్యాడర్‌ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.కామారెడ్డిలో బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అయినట్లే అంటున్నారట. బాన్సువాలో మాజీ మంత్రి, మాజీ స్పీకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అధికార పార్టీలో చేరి కారు టైర్లను పంచర్ చేశారు. దాంతో అక్కడ గులాబీ పార్టీకి లీడర్ లేకుండా పోయాడు. ఆర్మూర్‌లో మొక్కుబడిగా కనిపిస్తున్న మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కేసీఆర్ ఫామౌస్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారంట. బోధన్‌లో మాజీ ఎమ్మెల్యే షకీల్ అయితే ఓడినప్పటి నుంచి ఇప్పటి వరకు నియోజకవర్గం ముఖం చూడలేదు. షకీల్ దుబాయ్‌కి పరిమితం అవ్వడంతో ఆయన భార్య భార్య అయేషా ఫాతిమా ఇన్చార్జ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే రాజకీయాలకు పూర్తిగా కొత్త అయిన ఆమె క్యాడర్‌ని కపడుకోలేక పోతున్నారు.ఇక నిజామాబాద్ అర్బన్, రూరల్, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గ నేతలు కేటీఆర్ ఆదేశాలను కూడా లైట్ తీసుకున్నారట. ముందుండి నడిపించే నాయకుడు లేక పోవడంతో ఆ నియోజకవర్గాల్లో పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను కూడా నిర్వహించే దిక్కు లేకుండా పోయిందంట. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో పార్టీ దాదాపుగా ఖాళీ అయ్యిందట. మొన్నటి వరకు మేయర్‌గా బీఆర్ఎస్ నాయకుడు కొనసాగినప్పుడు అంతో ఇంతో హడావుడి కనిపించేది. అయితే కౌన్సిల్ కాలం చెల్లి మేయర్ పదవీ కాలం అయిపోవడంతో అర్బన్‌లో పార్టీకి లీడర్ లేకుండా పోయాడంట.
మాజీ ఎమ్మెల్యే బీగాల గణేష్‌గుప్తా పార్టీని వీడే వారిని బుజ్జగించే ప్రయత్నం కూడా చేయడం లేదంట.నిజామాబాద్ రూరల్ లో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి అనంతరం. నియోజకవర్గం లోనే ఉన్నప్పటికీ.. ఆయన యాక్టివ్‌గా లేకపోవడంతో గులాబీ క్యాడర్ మొత్తం హస్తం గూటికి క్యూ కట్టారట. అధిష్టానం ఇప్పుడు రూరల్ నుంచి కాకుండా గతంలో బాన్సువాడ ఎమ్మెల్యే గా అనుభవం ఉన్న బాజిరెడ్డిని మళ్ళీ వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచే పోటీ చేయాలని చెపుతున్నా.. ఆయన సుముఖంగా లేరన్న ప్రచారం జరుగుతోంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పార్టీ క్యాడర్ని ఉత్సాహపరచడానికి జిల్లాలో పర్యటిస్తున్నా.. నేతలు, వారి సహకారం కరువవ్వడంతో పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్నట్లు తయారైందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.. ఓవరాల్‌గా చూస్తే జిల్లాలో కారు .. రివర్స్ గేర్లో .. ఫుల్ స్పీడ్‌తో.. పరుగులు పెడుతున్నట్లు కనిపిస్తోందిప్పుడు.