పీహెచ్‌డీ అడ్మిషన్ల అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి

పీహెచ్‌డీ అడ్మిషన్ల అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి

: బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్

నిర్దేశం, హైదరాబాద్ : రాష్ట్రంలో విద్యను వ్యాపారంగా చేసుకుని కోట్ల రూపాయలకు ఇంజనీరింగ్, మెడిసిన్ సీట్లు అమ్ముకున్నోళ్లకే ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి పదవులు కట్టబెట్టారని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. కాకతీయ వర్సిటీలో పీహెచ్‌డీ అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయని గత 29 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న వర్సిటీ విద్యార్థులకు సంఘీభావం తెలిపిన అనంతరం ఆయన మాట్లాడారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో వర్సిటీలన్నీ పోలీసు నిర్బంధంలో కొనసాగుతున్నాయన్నారు. కేసీఆర్, కేటీఆర్ ల కనుసన్నల్లోనే రాష్ట్రంలో నకిలీ వర్సిటీల ఏర్పడ్డాయని అన్నారు. గురునానాక్, శ్రీనిధి, కావేరీ వంటి ఇంజనీరింగ్ కాలేజీలు నకిలీ యూనివర్సిటీల పేరుతో వేలాది మంది విద్యార్థులకు అడ్మీషన్లు ఇచ్చి, ఘోరంగా మోసం చేశాయన్నారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి తెలియకుండ రాష్ట్రంలో నకిలీ యూనివర్సిటీలు వెలిశాయా అని ప్రశ్నించారు.

కాకతీయ వర్సిటీ నిర్వహించిన పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష మార్కుల వివరాలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి సబితకు, మంత్రి మల్లారెడ్డికి పీహెచ్‌డీ విలువలు తెలియదన్నారు. వర్సిటీ పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షలో జరిగిన అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వర్సిటీలో అక్రమాలు జరిగితే ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఏం చేస్తున్నట్లని ప్రశ్నించిన ఆయన తక్షణమే విద్యాశాఖ మంత్రిని మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

మూడు లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్ లో వర్సిటీలకు ఎంత బడ్జెట్ కేటాయించారో వాటి వివరాలు బయటపెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.విద్యార్థులు రాజకీయ నాయకులు కాకూడదనే కుట్రతో కేసీఆర్ వర్సిటీలపై పోలీసు నిర్బంధం కొనసాగిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ఎన్నడూ వర్సిటీలను సందర్శించలేదని విమర్శించారు. వర్సిటీ తరగతి గదుల్లో, ప్రయోగశాలల్లో ఉండాల్సిన పీహెచ్డీ విద్యార్థులు రోడ్లపై ధర్నాలు చేస్తున్నారని అన్నారు. పిరికి పందల్లా ప్రగతి భవన్ లో  కూర్చొని పాలన కొనసాగిస్తూ, పోలీసుల రక్షణ లేకుండా కేసీఆర్, కేటీఆర్ ఇంట్లో నుంచి బయటకు వెళ్లే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు.

ఈ కార్యక్రమంలో కె.యూ. జాక్ చైర్మన్ తిరుపతి యాదవ్ నాయకులు గుగులోత్ రాజు నాయక్,గుజ్జుల శ్రీనివాస్ రెడ్డి, నిమ్మల రాజేష్, మాచర్ల రాంబాబు, అరెగంటి నాగరాజు, మట్టెడ కుమార్ ఎండి పాషా మంద నరేష్ బొట్ల మనోహర్ కేతపాక ప్రసాద్ జగదీశ్వర్ ప్రశాంత్ శివాజీ విజయ్ రమేష్ జగన్, తెల్లూరి సురేష్ పార్టీ నాయకులు రాష్ట్ర కార్యదర్శి గుండాల మదన్ కుమార్ బీఎస్పీ రీజియన్ సెక్రటరీ కన్నం సునిల్, వరంగల్,హన్మకొండ జిల్లా అధ్యక్షులు మంద శ్యామ్, శనిగరపు రాజు, వర్దన్నపేట నియోజకవర్గం ఇంచార్జి మాదారపు రవికుమార్, వడ్డేపల్లి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!