రైతు దిగుబడి పెంచే దిశగా వ్యవసాయ శాఖ చర్యలు
రైతు మహోత్సవంలో మంత్రుల పిలుపు.
నిజామాబాద్, నిర్దేశం:
రాష్ట్రవ్యాప్తంగా రైతు సంక్షేమాన్ని లక్ష్యంగా ఏర్పాటు చేసిన రైతు మహోత్సవంలో పలువురు రాష్ట్ర మంత్రులు, సలహాదారులు వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలన్న పిలుపు నిచ్చారు. రైతులు అప్పుల్లో నుంచి బయటపడేలా సహకార సంస్థలు, మార్కెట్ కమిటీలు, వ్యవసాయ శాఖ కృషి చేయాలన్నారు.
పోచారం శ్రీనివాసరెడ్డి ( ప్రభుత్వ సలహా దారు) మాట్లాడుతూ, రైతుకు ఎకరానికి లక్ష రూపాయల ఆదాయం వచ్చేలా విధానాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.
మహమ్మద్ అలీ షబ్బీర్ (రాష్ట్ర సలహాదారు) మాట్లాడుతూ, గత ప్రభుత్వం లో వడగండ్ల వానల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదని గుర్తు చేశారు. ప్రాణహిత-చేవెళ్ల ప్యాకేజీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రులను కోరారు.
డా. భూపతిరెడ్డి (రూరల్ ఎమ్మెల్యే) మాట్లాడుతూ, ధాన్యం కొనుగోళ్ల విషయంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఆయిల్ ఫాం, జొన్న, మక్కల వంటివాటిని ప్రోత్సహించాలని సూచించారు. వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేయాలని మంత్రులను కోరారు.
బొమ్మా మహేష్ కుమార్ గౌడ్ (టీ పీసీసీ అధ్యక్షుడు) మాట్లాడుతూ, “రైతుల ఓట్లతోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇది రైతు ప్రభుత్వమే” అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల్లో ముంచినప్పటికీ, కాంగ్రెస్ ఆరు హామీలతో పాటు సన్న బియ్యం పథకం కొనసాగిస్తోంది అన్నారు.
జూపల్లి కృష్ణారావు (జిల్లా ఇంచార్జి మంత్రి) పసుపు బోర్డును జిల్లాలో ఏర్పాటు చేసినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు ఉపయుక్త కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. వడగండ్ల వానల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం త్వరలోనే అందిస్తామని హామీ ఇచ్చారు.
తుమ్మల నాగేశ్వరరావు (వ్యవసాయ శాఖ మంత్రి) మాట్లాడుతూ, రైతుల్లో చైతన్యం, అవగాహన పెంచేందుకే రైతు మహోత్సవాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును త్వరలో ప్రారంభించి, నిర్ణీత సమయంలో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి కొరత ఉండదని, లోపాలుంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి (నీటి పారుదల, సివిల్ సప్లయిస్ మంత్రి) మాట్లాడుతూ, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన కాలేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగమైపోయిందని విమర్శించారు. అయినా రైతులు పెద్దఎత్తున పంటలు పండించి 281 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో దేశంలో రికార్డు సృష్టించారని కొనియాడారు. సన్న బియ్యం ద్వారా రాష్ట్రంలో 3.1 కోట్ల మందికి నిత్యావసరాలు అందిస్తున్నామని తెలిపారు.