ఓయూ సర్య్కులర్ కు వ్యతిరేకంగా ఏబీవీపీ వినూత్న నిరసన
హైదరాబాద్, నిర్దేశం:
ఉస్మానియా యూనివర్సిటీ లో ఓయూ అధికారులు అప్రజాస్వామికంగా ఇచ్చిన సర్క్యులర్ ను ఏబీవీపీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ మేరకు ఆర్ట్స్ కళాశాల అవరణలో పత్రిక సమావేశం నిర్వహించి మాట్లాడారు. 2025 మార్చ్ 13 వ తేదీని ఉస్మానియా యూనివర్సిటీ లో బ్లాక్ డే గా ప్రకటిస్తున్నాం అని అన్నారు. వందేమాతరం ఉద్యమం నుండి తెలంగాణ ఉద్యమం వరకు రాష్ట్రంలో ఏ సమస్యా ఉన్న కానీ తీర్చి దిద్దే గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ అని అన్నారు. వర్సిటీలో ధర్నాలు, నిరసనలు చేయొద్దు అంటూ అధికారులు ఇచ్చిన సర్క్యులర్ ను విడుదల చేయడం సిగ్గు చేటు అని మండిపడ్డారు. ఇప్పటికే సర్క్యులర్ ఇచ్చి పది రోజులు అయినప్పటికి వర్సిటీ అధికారులు స్పందించకపోవడం గమనార్హం అని అన్నారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు ఓయూ అధికారులు ఇచ్చిన సర్క్యులర్ కు వత్తాసు పలుకుతూ ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడ్డం సిగ్గుచేటు అన్నారు. ఈస్ట్ జోన్ డిసిపి బాలస్వామి ఓయూ లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగడానికి అవకాశం ఉందని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. మనమేమైనా ఛత్తీస్ ఘడ్ అడవులలో ఉన్నామా లేదా విశ్వవిద్యాలయంలో ఉన్నామా అని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ఓయూ అధికారులు స్పందించి సర్క్యులర్ ను వెనక్కి తీసుకోకపోతే రానున్న రోజుల్లో విసి బిల్డింగ్ ను అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.