ఎర్రబెల్లికి బిగుస్తున్న ఉచ్చు
– వెంటాడుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు
– మాజీ మంత్రి లక్ష్యంగా కేసు విచారణ
నిర్దేశం, హైదరాబాద్:
మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉచ్చు బిగుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో మాజీడీఎస్పీ ప్రణీత్ రావు, దయాకర్ రావు పేరు వెల్లడించినట్లు తెలిసింది. దయాకర్ రావు కొన్ని నెంబర్లు ఇవ్వగా వాటిని ట్యాప్ చేసి సమాచారం అందజేసినట్లు తెలిసింది. ఈ విషయమై దర్యాప్తు అధికారులు మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. మూడు రోజులుగా విచారణలో అప్పటి ప్రభుత్వ పెద్దలే కీలక సూత్రధారులుగా తేలినట్లు తెలుస్తోంది. ప్రణీత్ రావుకు వార్ రూంలో సహకరించిన పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన ఇద్దరు ఇన్ స్పెక్టర్ లను హైదరాబాద్ పిలిపించి వారి వాంగ్మూలం తీసుకున్నారు. దీని ఆధారంగా ప్రణీత్ రావును మూడో రోజు ప్రశ్నల వర్షం కురిపించారు.
ఆందోళనలో దయాకర్ రావు
ఫోన్ ట్యాపింగ్ కేసులో లోతుగా విచారణ జరుగుతుండడంతో ఎర్రబెల్లి దయాకర్ రావు ఆందోళన చెందుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడితే టెలిగ్రాఫ్ చట్టం కింద కేసు నమోదవుతుంది. ఈ కేసు భయంతోనే దయాకర్ రావు బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం జరుగుతోంది. కాగా, ఈ ప్రచారాన్ని దయాకర్ రావు ఖండించారు. పార్టీ మారబోనని, మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుతో సంబంధాలు లేవని స్పష్టం చేశారు.
టార్గెట్ ఎర్రబెల్లి….
ఫోన్ ట్యాపింగ్ కేసు గత ప్రభుత్వ పెద్దలతో పాటు ఎర్రబెల్లి దయాకర్ రావు లక్ష్యంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దయాకర్ రావుకు మధ్య తీవ్ర వైషమ్యాలున్నాయి. వీరిద్దరు గతంలో తెలుగు దేశంలో కొనసాగారు. ఆ పార్టీలో రేవంత్ రెడ్డి దూకుడును ఎర్రబెల్లి సహించేవారుకాదు. 2014 లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే ఓటు కోసం టీడీపీ ప్రయత్నించింది. ఈవిషయం అధికార పార్టీకి తెలియడంతో పక్కా ప్రణాళికతో రేవంత్ రెడ్డిని రెడ్ హ్యండెడ్ గా నగదుతో పట్టుకున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావే సమాచారం ఇచ్చారని రేవంత్ రెడ్డి భావించారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి జైలుకు కూడా వెళ్లారు. అప్పటి నుంచి ఎర్రబెల్లి పై పగతో రగిలిపోతున్నారు. ప్రస్తుతం ట్యాపింగ్ కేసు ఆయుధంగా దొరికింది. వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి కొండా సురేఖతో కూడా దయాకర్ రావుకు అనేక ఏళ్లుగా తీవ్ర విభేదాలున్నాయి. ఈ కేసులో దయాకర్ రావు ఎట్టి పరిస్థితిలో బయట పడే అవకాశాలు లేవని తెలుస్తోంది.