రక్తంతో ‘‘తడిసిన’’ ఉద్యమం – 01

రక్తంతో ‘‘తడిసిన’’ ఉద్యమం

నక్సల్స్ – పోలీసుల హింస ఆగేదేప్పుడు..?
ధారావాహిక – 01
యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

‘గాయపడ్డ సూరీడు’

నిజమే.. సూరీడు గాయ పడుతారా..? కానీ.. ఈ ఉద్యమ త్యాగాల రక్త చరిత్రకు గాయ పడ్డ సూరీడు అనే శీర్శిక సరి పోతుందేమో..? భారత దేశంలో 1925లో ప్రారంభమైన కమ్యూనిష్టు ఉద్యమం ముక్కముక్కలుగా విడి పోయి ఎర్రజెండా రంగు వెలిసి పోతుంది. అయినా.. ఆ కమ్యూనిష్టులు, విప్లవ కారులు, నక్సలైట్లు పేర్లు ఏవైనా వాళ్లు చేసిన పొరాటాల ఫలితంగా అట్టడుగు వర్గీయులలో చైతన్యం వచ్చిందానేది నిజం. అంతకంటే ఘోరం ఏమిటంటే..? ముక్క ముక్కులుగా విడి పోయిన నక్సలైట్లు కావచ్చు.. కమ్యూనిష్టులు కావచ్చు వారు కోరుకునే ‘‘నూతన ప్రజాస్వామిక విప్లవం’’ సాధించడం సాధ్యమా..? అంటే సోషల్ మీడియా డామినేట్ చేస్తున్న నేటి కాలంలో అసాధ్యమనే చెప్పొచ్చు. 2026 మార్చి 31 వరకు మావోయిస్టులను భారత దేశంలో లేకుండా చేస్తానని ప్రకటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాటలు ఆచరణలో సాధ్యమా..? అంటే సాధ్యం కాదానేది చరిత్ర చెబుతున్న సత్యం.


పశ్చిమ బెంగల్‌ రాష్ట్రంలోని డార్జిలింగ్‌ జిల్లా నక్సల్బరీ గ్రామంలో చారు మజుందర్‌ నాయకత్వంలో గిరిజనులు భూస్వాములపై తిరుగుబాటు చేయడంతో ప్రారంభమైన ఈ ఉద్యమం దేశ వ్యాప్తంగా విస్తరించిందానేది నగ్న సత్యం. అందుకే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నక్సల్స్ ను విదేశీ శతృవుల్లా భావిస్తోంది. ఎన్ కౌంటర్ ల పేరిట ఏరి పారేస్తోంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం పార్లమెంట్ లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ‘‘అర్బన్ నక్సలైట్’’ గా ముద్ర వేశారంటే కేంద్రం నక్సలైట్లపై ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో అర్థం చేసుకోవచ్చు.

ఎవరీ అర్బన్ నక్సల్?

అర్బన్ నక్సలైట్ కు నిర్దిష్ట నిర్వచనం ఏమీ లేదు. కేవలం మోదీ ప్రభుత్వాన్ని, పార్టీని విమర్శించేవారిని పిలిచేందుకు ఉపయోగిస్తున్న ఓ పదం ఇది. అప్పుడప్పుడూ అర్బన్ నక్సల్స్, సంఘ వ్యతిరేకులు అని కూడా అంటున్నారు. ఇప్పటికే ప్రత్యేక తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంలో 120 మంది ప్రజా సంఘాల నేతలపై ప్రమాదకరమైన ‘‘ఉపా’’ చట్టం కింద కేసులు పెట్టారు. వీళ్లంతా అర్బన్ నక్సలైట్లుగా పోలీసులు ముద్రలు వేశారు. అందులో ప్రొఫెసరులు ఉన్నారు.. జర్నలిస్టులు ఉన్నారు. విరసం.. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకులున్నారు. నిజమే.. నక్సలైట్ పేరుతో ఎవరినైనా.. ఎప్పుడైనా.. ఎక్కడైనా ‘‘ఉపా’’ చట్టం అంటే దేశ ద్రోహం కింద అరెస్టు చేయవచ్చు. దేశ ద్రోహం కింద ప్రొఫెసర్ హరగోపాల్ పై కేసీఆర్ ప్రభుత్వం కేసు పెట్టి ఆ తరువాత ఎత్తి వేసింది. ఈ సందర్భంగా హరగోపాల్ మాట్లాడుతూ తనపైనే కాకుండా చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక (ఉపా) చట్టం పెట్టిన ప్రతి ఒక్కరిపైన కేసులు ఎత్తివేయాలని అప్పట్లో కేసీఆర్ ను డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇతర ప్రభుత్వాల వలే వ్యవహరించింది కానీ ఉద్యమ పార్టీలా వ్యవహరించలేదన్నారు. ఇటువంటి ప్రభుత్వం తెలంగాణాలో వస్తుందని ఎప్పుడూ అనుకోలేదని అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉపా చట్టం అనేది ఒక దుర్మార్గమయిన చట్టమని.. ఈ చట్టాన్ని రద్దు చేయడం కోసం పోరాడుతామన్నారు హరగోపాల్. ఈ చట్టాల ద్వారా స్వేచ్చగా మాట్లాడే అవకాశం కోల్పోతామన్నారు. నిర్భంద చట్టాలపై ప్రజల్లోకి వెళ్లి ప్రతి ఒక్కరినీ చైతన్య పరుస్తామన్నారు. అన్ని సంఘాలతో కలిసి తమ పోరాటాలను ఉదృతం చేస్తామన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్ పై పెట్టిన దేశద్రోహం కేసు ఎత్తివేయాలని అప్పట్లో డీజీపీకి సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.
ప్రొఫెసర్ హరగోపాల్ చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద కేసు నమోదయ్యింది. దీని ములుగు జిల్లా తాడ్వాయి పోలీసులు ఏడాది క్రితమే పెట్టినా ఆలస్యంగా వెలుగులోకి వచ్చచింది. దీనిపై ఉద్యమకారులు,మేధావులు, ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కేసును ఎత్తేవేయాలంటూ కేసీఆర్ ఆదేశమిచ్చారు. పశ్చిమ బెంగాల్ లో నక్సల్బరీ ఉద్యమం ప్రారంభమైన తరువాత దాని గమ్యం ఎటు వెళ్లిందో ఒకసారి పరిశీలిద్దాం..

నక్సల్స్‌ ఉద్యమ ప్రస్థానంలో..

‘‘నక్సల్స్‌ ఉద్యమ ప్రస్థానంలో అస్తమయాలు, ఉదయాలు, గాయాలు కొత్త కాదు. నక్సల్‌ బరిలో మొదలైన తుపాన్‌ కొంత కాలంలోనే శ్రీకాకుళం కొండలను ముద్దాడింది.. ఆ తరువాత తెలంగాణ ప్రాంత తీరాన్ని తాకింది. విప్లవ కెరటాలు ఎగిసి పడ్డాయి..! విరిగి పడ్డాయి…!! అయినా అల్లకల్లోలమైన సాగరం ఇంకా కుదురుకోలేదు. పాత అలలు పడిపోగానే కొత్త అలలు ఎగిసిపడుతునే ఉన్నాయి. శరీరాలు నేల రాలుతున్నా.. తుపాకులు లేచి నిలుచుంటూనే ఉన్నాయి.
శవాలను లెక్కించే మీసాలకు సవాలు విసురుతూనే ఉన్నాయి. సమస్యల కవర్‌లో రహాస్య పోరాటాల ఎజెండా నుంచి గ్రామ కమిటీల బహిరంగ నిర్మాణం దాకా తెలంగాణ ఉద్యమంలోని అన్ని దశలనూ చూసింది. పోరుబాటలో విజయాల రెపరెపలే కాదు, అపజయాల అశ్రుతర్పణలూ ఉన్నాయి. బలహీనతల భంగపాట్లు ఉన్నాయి. శత్రునిర్మూలనే కాదు కోవర్టుల ఎదురుదెబ్బలూ ఉన్నాయి. ఇన్నేళ్ల ఉద్యమం తర్వాతా ఇపుడేంటి…? అనే ప్రశ్నలు ఉన్నాయి.
‘అంతటామేమే’ అన్న నక్సల్స్‌ మాట నుంచి మేమెక్కడ..? అన్న ప్రశ్న మొలకెత్తడం వినడానికి వింతగానే ఉంటుంది. అయితే సుదీర్ఘ ప్రస్థానంలో మజిలీలన్నీ విజయ స్థంభాలు కాలేవు. పరాజయాల గాయాలూ ఉంటాయి. ఈ ఎదురు దెబ్బల నుంచి నేర్చిందేమిటి..?


నక్సల్బరి ఉద్యమ నిర్మాత చారు మజుందర్‌ లేరు.. తెలంగాణలో ఉద్యమాన్ని బలోపేతం చేసిన కొండపల్లి సీతారామయ్య లేరు. కానీ.. ఆ ఉద్యమాన్ని దేశ నలు మూలాల తీసుకెళ్లిన మావోయిస్టు దళపతి గణపతి అలియాస్‌ ముప్పాళ్ల లక్ష్మణ రావు ఇంకా ఉద్యమ బాటలోనే ఉన్నారు. అయినా… మారిన కాలంలో కమ్యూనికేషన్‌ వ్యవస్థ పటిష్టంగా మారడంతో నక్సలైట్‌ ఉద్యమంపై పోలీసులదే పై చెయిగా మారింది. సోషల్‌ మీడియా డామినెట్‌ చేస్తున్న నేటి కాలంలో నక్సలైట్‌ ఉద్యమం కోలుకోలేని దెబ్బలు తింటుంది. నక్సలైట్‌ ` పోలీసుల తుపాకి తూటాల మధ్య గాయపడ్డ పల్లెల సజీవ పరిస్థితి ఉద్యమ ‘‘రక్త’’ చరిత్రలో నమ్మలేని నిజాలు ఎన్నో.. .

(2వ ఎపిసోడ్ లో కలుద్దాం.. )

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »