పాకిస్థాన్, భారత్ మధ్య ఉన్న సింధూ జలాల ఒప్పందం రద్దు
.. నీటి యుద్ధం మొదలైందా?
.. పాకిస్థాన్‌కు జరిగే నష్టం ఏంటి?
నిర్దేశం, న్యూఢిల్లీ:
జమ్మూకశ్మీర్‌లోని పెహల్గామ్లో ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను కాల్చి చంపిన నేపథ్యంలో.. భారత ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకున్నది. పాకిస్థాన్, భారత్ మధ్య ఉన్న సింధూ జలాల ఒప్పందాన్నిరద్దు చేసింది. మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్థాన్‌ను ఏ రకంగా ఇబ్బంది పెడుతుందో. తుపాకులతో చెలరేగిన ఉగ్రవాదుల చర్యలకు నిరసనగా నీటి ఒప్పందాన్ని రద్దు చేయడం ఎంత వరకు సమంజసం అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. భవిష్యత్తులో నీటి కోసం యుద్ధాలు జరుగుతాయన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. నిజానికి వందల.. వేలఏళ్లు సింధూ పరివాహక ప్రాంతం ఎన్నో నాగరికతలకు ప్రాణం పోసింది. కానీ ఇప్పుడు అణ్వాయుధ సామర్థ్యం కలిగిన రెండు దేశాల మధ్య వైరం ఆ నదీ జలాల అంశాన్ని కొత్త దశకు తీసుకెళ్తున్నది.
1960లో కుదిరిన సింధూ జలాల ఒప్పందానికి కట్టుబడి ఉండబోమని భారత్ ప్రకటించిన నేపథ్యంలో పాకిస్థాన్‌కు ఆ నిర్ణయం వల్ల జరిగే నష్టం ఏంటో తెలుసుకుందాం.
గత 60 ఏళ్లుగా రెండు దేశాల మధ్య పలుమార్లు యుద్ధాలు జరిగాయి.
అనేక సందర్భాల్లో దౌత్య సంబంధాలు తెగిపోయాయి. భారత్ తీసుకున్న తాజా నిర్ణయం రెండు దేశాలను ఎలా ముందుకు తీసుకెళ్తుందన్నది ఆసక్తిగా మారింది. అత్యంత విలువైన నీటి వనరుల ఒప్పందాన్ని రద్దు చేయడం అంటే పాకిస్థాన్‌ను మరింత ప్రమాదంలోకి నెట్టివేయడమే అవుతుంది. సింధూ నీటి ఒప్పందం రద్దు వల్ల పాకిస్థాన్ నదులు, పంటలు, ప్రజలు, విధానకర్తలు ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఇప్పుడే అంచనా వేయడం కష్టం.భారత్ ఒక్కసారిగా పాకిస్థాన్‌కు నీటి సరఫరాను ఆపేయగలుగుతుందా. ఈ ప్రశ్నకు తక్షణమే సమాధానం దొరకదు. కానీ క్రమంగా నీటి వ్యవస్థ సన్నగిల్లుతుంటే, అప్పుడు ప్రతి రోజూ ఆ నీటిపై ఆధారపడే లక్షలాది మంది మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
1960 నాటి ఒప్పందంతో సింధూ నదికి చెందిన ఆరు ఉపనదుల్లో మూడు పాకిస్థాన్, మూడు భారత్‌కు దక్కాయి. రావి, బీస్, సట్లజ్ నదుల వాటా ఇండియాకు, ఇండస్, జీలం, చీనాబ్ నదలు వాటా పాకిస్థాన్‌కు వెళ్తుంది.సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం అంటే నీటిని తక్షణమే ఆపేస్తారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ వాస్తవానికి ఇది పరిస్థితి కాదు. రేపటి నుంచే నీటి ప్రవాహం ఆగిపోతుందన్న ఉద్దేశం కాదు. సిందూ, జీలం, చీనాబ్ నది నీరు పాకిస్థాన్‌కు వెన్నుముక వంటిది. పాక్‌లోని వ్యవసాయ రంగానికి, పట్టణాలకు, విద్యుత్తు వ్యవస్థకు ఈ నీరే జీవాధారం. అయితే ఒకవేళ ఆ నీరుకు ఏదైనా సమస్య వస్తే మాత్రం ఇబ్బందే. ఎందుకంటే ఈ నీటికి మరో ప్రత్యామ్నయం లేదు కాబట్టి.పాకిస్థాన్‌లో వ్యవసాయం విస్తీర్ణంగా జరుగుతుంది. ప్రపంచ దేశాల్లో పాక్ ఇరిగేషన్ సిస్టమ్ కూడా ముఖ్యమైందే. అక్కడ వ్యవసాయం దాదాపు పశ్చిమ నదులైన సిందూ, జీలం, చీనాబ్ నీటిపైనే ఆధారపడి ఉంటుంది. ఆ నీటి ప్రవాహ మార్గాల్లోనే రైతులు తమ వ్యవసాయ పనులు చేస్తుంటారు. దశాబ్ధాల క్రితమే కెనాల్ వ్యవస్థను అక్కడ రూపొందించారు. అయితే సిందూ నది ఒప్పందం రద్దు వల్ల నీటి ప్రవాహంలో ఏదైనా చిన్న తేడా వచ్చినా..అప్పుడు నీటి వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యే అవకాశాలు ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు.వాస్తవానికి ఒకేసారి నీటిని ఆపడం కుదరదు. కానీ నీటి ప్రవాహంలో చిన్న మార్పులు చేస్తే సమస్యలు స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. గోధుమ పంట వేసిన సమయంలో ఆలస్యంగా నీరు అందితే అప్పుడు సమస్య ఉత్పన్నం కావొచ్చు.
నీటి ప్రవాహం తగ్గే డ్రై వింటర్ సీజన్లో.. మరింత నీటి కొరత ఏర్పడితే అప్పుడు రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సమయానికి నీరు అందకపోతే పంట దిగుబడి తగ్గుతుంది, దాంతో ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. నిజానికి సింధూ డెల్టాలో తాజానీటి ప్రవాహం తగ్గింది. ఒకవేళ నీరు మరింత తగ్గితే అప్పుడు ఆ నీటి ప్రవాహంపై ఆధారపడే వారు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మత్స్య విధానం కూడా దెబ్బతింటుంది. నీటి ప్రవాహం కొంత తగ్గినా, అప్పుడు ఆ నీటిని ఎలా కేటాయించాలన్న అంశం పెద్ద సమస్యగా మారుతుంది. దీంతో రాష్ట్రాల మధ్య తగాదాలు ముదిరే ఛాన్సు ఉంటుంది. ముఖ్యంగా పంజాబ్, సింధు ప్రావిన్సుల్లో ఈ సమస్య తీవ్రం అయ్యే అవకాశం ఉన్నది.పాకిస్థాన్ జలవిద్యుత్తును కూడా అధికంగా వినియోగిస్తుంది. మూడో వంద విద్యుత్తు ఆ దేశానికి హైడ్రోపవర్ ద్వారా అందుతుంది. తర్బేలా, మంగల రిజర్వాయర్లకు నీరు తగ్గితే అప్పుడు విద్యుత్తు ఉత్పత్తి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. నిజానికి పాకిస్థాన్‌లో ముందు నుంచీ నీటి సమస్య ఉన్నది. ఇప్పుడు ఈ ట్రీటీ రద్దుతో ఆ సమస్య మరింత అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి. సింధూ జలాల ఒప్పందం రద్దు చేయడాన్ని యుద్ధ చర్యగా భావిస్తున్నట్లు పాకిస్తాన్ ప్రధాని అడ్వైజర్ సర్తాజ్ అజీజ్ తెలిపారు.