టోల్ ప్లాజా దోపిడీలకు ఇక చెక్..
వాటిని ఎత్తేసే దిశగా కేంద్రం అడుగులు
ఇటీవల టోల్ ప్లాజాలంటే వాహనదారులకు చిర్రెత్తుకొస్తోంది. వాహనాల క్యూ.. స్కానింగ్ కాకపోవడం.. అంతా భరించి దారి దోపిడీకి గురికావడాన్ని వాహనదారులకు ఇష్టపడలేకపోతున్నారు. ఈ దారి దోపిడీకి చెక్ పెట్టే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. త్వరలోనే కొత్త జీపీఎస్ విధానం తీసుకురానుంది. ఇది అమల్లోకి వస్తే టోల్ ప్లాజా సిస్టం మాయం కానుంది. జీపీఎస్ ద్వారా నేరుగా డబ్బులు చెల్లించే వ్యవస్థ రూపొందుతోంది. మరో 15 రోజుల్లో శాటిలైట్ ఆధారిత టోల్ వసూలు విధానాన్ని తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవలే ప్రకటించారు.
దేశంలోని హైవేలు, ఎక్స్ ప్రెస్ వే ల సమస్యల పరిష్కారం దిశగా.. కొత్త టోల్ పాలసీలో కేంద్రం మార్పులు తీసుకొస్తోంది. దీని వల్ల టోల్ రుసుములు 50 శాతం వరకు తగ్గనున్నాయి. దీనికితోడు రానున్న రోజుల్లో వాహనాల వార్షిక పాసులను రూ.3 వేలకే అందించే ప్రణాళిక రూపొందుతోంది. ఈ పాస్ లు అన్ని జాతీయ రహదారులతోపాటు రాష్ట్రాల అధీనంలో ఉన్న ఎక్స్ ప్రెస్ దారులపైనా చెల్లుబాటు కానుంది. ప్రస్తుతం నెలవారీ పాస్ లు మాత్రమే జారీ అవుతున్నాయి. కొత్త పాలసీ అమల్లోకి వస్తే.. ఏడాది కాలానికి పాస్ లు కూడా ఇస్తారు.
టోల్ పాస్ రుసుమును ఫాస్టాగ్ ద్వారానే చెల్లిస్తారు. కాకపోతే టోల్ ప్లాజాల ద్వారా కాకుండా కిలోమీటరుకు ఫిక్స్డ్ ఛార్జీలు వసూలు చేస్తారు. అంటే ఒక కారు వంద కిలోమీటర్లకు రూ.50 టోల్ ఫీజు చెల్లించాలి.
రానున్న కాలంలో జీపీఎస్ ఆధారిత విధానాన్ని అమలు చేయనున్నారు. దీని ద్వారా టోల్ ప్లాజాల వద్ద రద్దీ సమస్య ఉండదు. ఆలస్యం కావడం ఉండదు. ప్రయాణించిన కిలోమీటర్లకు మాత్రమే నేరుగా బ్యాంకు ఖాతా నుంచి టోల్ కట్ అవుతుంది.