2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినయ్?
-ఏఐసీసీ పెద్దల సమక్షంలో రెచ్చిపోయిన సీఎం రేవంత్
నిర్దేశం, గాంధీనగర్ః
ప్రధాని నరేంద్ర మోదీ నిరుద్యోగ యువత కోసం ఏటా 2 కోట్ల ఉద్యోగాలను ఇస్తామని చెప్పి మాట తప్పడాని సీఎం రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. గుజరాత్, అహ్మదాబాద్ వేదికగా కొనసాగుతున్న ఏఐసీసీ సమావేశాల్లో సీఎం మాట్లాడారు.‘మహాత్మగాంధీ, వల్లబాయి పటేల్ పుట్టిన గడ్డపై ఏఐసీసీ సమావేశాలు నిర్వహించుకుంటున్నాం. గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని మనం చూస్తుంటే.. గాడ్సే ఆలోచనను మోదీ ఎత్తుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సక్సెస్ ఫుల్ గా కులగణన చేశాం. రూ.2లక్షల వరకు రైతు రుణమాఫీ చేశాం. గాంధేయ వాదులు రాహుల్ గాంధీకి అండగా నిలవాలి. తెలంగాణలో బీజేపీకి స్థానమే లేదు’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన బీజేపీ మాట తప్పిందని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు.
10 ఏళ్ల ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో 20 కోట్ల ఉద్యోగాలు వచ్చాయా..? అని సీఎం నిలదీశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు మాత్రం ఉద్యోగాలు వచ్చాయని ఎద్దేవా చేశారు. నిరుద్యోగులకు ఇచ్చిన వాగ్ధానాలను ఇంతవరకు అమలు చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.ప్రధాని నరేంద్ర మోదీ మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ‘దేశాన్ని విభజించాలని మోదీ చూస్తున్నారు. భారతదేశం అంతటా కులగణన చేపట్టాలి. తెలంగాణలో కులగణన పూర్తి చేశాం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌కి ఇచ్చిన హామీని నెరవేర్చాం. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేసి చూపించాం. గాడ్సే సిద్ధాంతాన్ని మోదీ ప్రోత్సహిస్తున్నారు. గాంధీ విధానాలకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు పనిచేస్తున్నారు. బ్రిటిష్ వాళ్లను తరిమికొట్టినట్టే బీజేపీని కూడా ఓడించాలి. తెలంగాణలో బీజేపీని అడుగుపెట్టనివ్వం’ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. గుజరాత్ రాష్ట్రం, అహ్మదాబాద్ లో నిర్వహించిన ఈ ఏఐసీసీ సమావేశంలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, సీతక్క, పొన్నం ప్రభాకర్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, తదితరులు ఉన్నారు.