భారత్ కు భారంగా ఒబేసిటీ…
ముంబై, నిర్దేశం:
ఊబకాయం ప్రస్తుతం అతిపెద్ద సమస్యగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా ఊబకాయుల సంఖ్య పెరుగుతోంది. దీంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇందుకు వైద్యులు ఆనేక కారణాలు చెబుతున్నారు. భారత దేశంలో 2050 నాటికి భారతదేశంలో అధిక బరువుగల వారి సంఖ్య ఏకంగా 45 కోట్లకు చేరే అవకాశం ఉంది. ఈ సమస్య 15–24 ఏళ్ల యువతలోనూ, 5–14 ఏళ్ల పిల్లల్లోనూ వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం చైనా, అమెరికా తర్వాత భారత్ ఊబకాయ సమస్యలో మూడో స్థానంలో ఉంది. 2021 గణాంకాల ప్రకారం దేశంలో 17.6 కోట్ల మంది అధిక బరువుతో ఉన్నారు. రాబోయే కొన్నేళ్లలో అమెరికాను అధిగమించి, ప్రపంచంలో ఊబకాయుల సంఖ్యలో భారత్ రెండో స్థానంలో నిలిచే అవకాశం ఉందని లాన్సెట్ జర్నల్ తెలిపింది.తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సమస్య వేగంగా విస్తరిస్తోంది. హైదరాబాద్ లోని ఐటీ ఉద్యోగుల్లో ఎక్కువ మంది స్థూలకాయంతో బాధపడుతున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ పరిస్థితి మన దగ్గర ప్రమాద సంకేతాలు మోగిస్తోందని అర్థం చేసుకోవాలి. జీవన శైలి, వ్యాయామం లేకపోవడం, వేళాపాల లేకుండా తినడం వంటి కారణాలు ఊబకాయానికి కారణం అంటున్నారు.
ఆహారంలో జాగ్రత్తలు – మైండ్‌ఫుల్ ఈటింగ్ కీలకం నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఊబకాయానికి ప్రధాన పరిష్కారం ’మైండ్‌ఫుల్ ఈటింగ్’. దీని కోసం కొన్ని సూత్రాలు పాటించాలి. ఆకలి వేసినప్పుడు మాత్రమే తినాలి. సమయం అయిందని అనవసరంగా ఆహారం తీసుకోవడం బరువు పెరగడానికి దారితీస్తుంది. ఒంటరితనం, బాధ లేదా కాలక్షేపం కోసం అతిగా తినడం మానాలి. భోజన సమయంలో టీవీ, మొబైల్ వంటి పరధ్యానాలు లేకుండా, ఏం తింటున్నామో, ఎంత తింటున్నామో శ్రద్ధగా గమనించాలి. ఆహారం రుచిని ఆస్వాదిస్తూ నెమ్మదిగా తినాలి. క్యాలరీలపై అవగాహన ఉంచాలి. ఒక పూట ఎక్కువ తీసుకుంటే, తర్వాతి పూట తగ్గించాలి. సమతుల ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, శారీరక శ్రమ, ఆరోగ్యకరమైన జీవనశైలి, తగిన నిద్ర, ఒత్తిడి నియంత్రణ వంటివి ఊబకాయాన్ని అరికట్టడంలో సహాయపడతాయి.
యువత, పిల్లల్లో ఊబకాయం..
’వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్’ ప్రకారం, ప్రాసెస్డ్ మరియు ప్యాక్ చేసిన ఆహారాలు యువత, పిల్లల్లో ఊబకాయానికి ప్రధాన కారణం. అదనంగా, మొబైల్ ఫోన్లు, టీవీలకు అతిగా అలవాటు పడడం, ఆటస్థలాల్లో శారీరక ఆటలు తగ్గిపోవడం కూడా ఈ సమస్యను తీవ్రతరం చేస్తున్నాయి.
ఊబకాయం అంటే ఏమిటి?
శరీరంలో కొవ్వు అధికంగా పేరుకుపోతే దాన్ని ఊబకాయం అంటారు. దీన్ని బాడీ మాస్ ఇండెక్స్ (ఆMఐ) ద్వారా కొలుస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం..
18.5 కన్నా తక్కువ: తక్కువ బరువు
18.5–24.9: సాధారణ బరువు
25–29.9: అధిక బరువు
30 కన్నా ఎక్కువ: ఊబకాయం
ఊబకాయానికి కారణాలు
జన్యుపరమైన అంశాలు
అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు
శారీరక శ్రమ లేకపోవడం
వాతావరణ కారణాలు
కొన్ని ఔషధాల వాడకం
ఊబకాయం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు
అధిక బరువు ఉన్నవారికి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉంది:
టైప్–2 మధుమేహం
అధిక రక్తపోటు
గుండె జబ్బులు
ఫ్యాటీ లివర్
మానసిక ఆరోగ్య సమస్యలు
మహిళల్లో గర్భధారణ సమస్యలు