సిటీలో ఆగని డ్రగ్స్ దందా
హైదరాబాద్, నిర్దేశం:
హైదరాబాద్ నగరంలో డ్రగ్స్‌కు ఏమాత్రం అడ్డుకట్ట పడడంలేదు. దాంతో.. డ్రగ్స్ చైన్ లింకులకు బ్రేకులు వేసే పనిలో పడ్డారు తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు, పోలీసులు.. డ్రగ్స్ సప్లయ్ చైన్‌లో నైజీరియన్లు కీలకంగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించి.. వారికి చెక్ పెట్టారు. డ్రగ్స్ విక్రయం ద్వారా వచ్చిన డబ్బును విదేశాలకు హవాలా మార్గంలో పంపిస్తున్న గ్యాంగ్‌కు చెందిన ముగ్గురు నైజీరియన్లను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.12.5 లక్షల విలువైన ఎండీఎంఏ డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య వెల్లడించారు.. ఈ ముఠాపై గత మూడు నెలలకుపైగా నిఘా పెట్టినట్లు వెల్లడించారు. డ్రగ్స్ తీసుకున్నాక చెల్లింపులు జరుపుతున్నట్లు గుర్తించామని, వీటిని డెలివరీ చేసేందుకు అమ్మాయిలను ఉపయోగిస్తున్నట్లు దర్యాప్తులో తెలిసిందన్నారు.
టోలీచౌకి ప్రాంతంలో డ్రగ్స్ డెలివరీ చేసిన యువతిని అదుపులోకి తీసుకొని విచారణ చేయగా.. సంచలన విషయాలు వెలుగు చూశాయన్నారు.. డ్రగ్స్ ముఠా సభ్యులు ఆ యువతికి రూ.50,000 ఇచ్చినట్లు వెల్లడించారు. వారితోనే డైరక్ట్ డీల్ చేసి.. డ్రగ్స్ సరఫరా చేస్తున్నారన్నారు. ఈ డ్రగ్స్ మొత్తం విదేశాల్లోనే తయారు అవుతున్నాయన్నారు. గత 5 సంవత్సరాలుగా డ్రగ్స్ ద్వారా నైజీరియాకు వెళ్లిన డబ్బుల వివరాలు సేకరించామని, భారత్‌తో పాటు అమెరికాలోనూ నైజీరియన్లు డ్రగ్స్ సప్లై చేస్తున్నారని తెలిపారు.డ్రగ్స్ కావాలని కస్టమర్లు డబ్బులు చెల్లించే లావాదేవీల ద్వారా నిందితులను పట్టుకున్నామన్నారు. కస్టమర్లు డబ్బులు చెల్లించేందుకు 15 మంది యువతుల బ్యాంక్ ఖాతాలు ఇచ్చారని, అమెరికా యువతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు గుర్తించామని శాండిల్య తెలిపారు. 5 సంవత్సరాల్లో డ్రగ్స్ కోసం భారత్, అమెరికా, నైజీరియన్ల మధ్య కోట్ల రూపాయలు లావాదేవీలు జరిగినట్లు తెలిపారు. అమెరికా నుంచి డబ్బులు నేరుగా నైజీరియాకు వెళ్లకుండా మొదట భారత్‌కు పంపిస్తారని, ఇక్కడి నుంచి హవాలా మార్గంలో నైజీరియాకు తీసుకెళ్తారని తెలిపారు. డ్రగ్స్ మొత్తం విదేశాల్లోనే తయారు అవుతున్నాయని, మన దేశంలో చాలా తక్కువ తయారవుతున్నట్లు సందీప్ శాండిల్య వివరించారు.దేశంలోనే తొలిసారి డ్రగ్స్ విక్రయాలు, డబ్బుల పంపిణీపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఎస్పీ రూపేష్ తెలిపారు. ఇండియాతో పాటు అమెరికాలోనూ నైజీరియన్లు డ్రగ్స్ సప్లయ్ చేస్తున్నారన్నారు. అయితే.. అమెరికా అధికారులకు చిక్కకుండా భారత్‌లోని అకౌంట్లకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నారని వెల్లడించారు. హవాలా మార్గంలో డబ్బులు ఇండియాకు డబ్బులు పంపి.. ఇక్కడి నుంచి నైజీరియాకి పేమెంట్లు చేస్తున్నట్లు గుర్తించామన్నారు