శక్తివంతమైన నాయకుడిగా సీఎం రేవంత్ రెడ్డి
* 2025 విడుదల చేసిన ది ఇండియన్ ఎక్స్ప్రెస్
* వంద మంది అత్యంత శక్తిమంతుల్లో రేవంత్ కు 28వ స్థానం
* గతేడాదితో పోల్చితే 11స్థానాలు మెరుగైన సీఎం స్థానం
న్యూఢిల్లీ, నిర్దేశం:
అతి తక్కువ కాలంలో ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన రేవంత్ రెడ్డి.. మరోవైపు అత్యంత శక్తివంతమైన నాయకుడిగా కూడా ఎదుగుతున్నారు. ది ఇండియన్ ఎక్స్ప్రెస్ 2025 సంవత్సరానికి సంబంధించి దేశంలోని వివిధ రంగాల్లో అత్యధిక శక్తిమంతులైన 100 మంది ప్రముఖులతో జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 28వ స్థానం దక్కించుకోవడం గమనార్హం. కాగా, గతేడాది విడుదల చేసిన ఇదే జాబితాలో ఆయన 39 స్థానంలో ఉన్నారు. ఏడాది తిరిగేలోపే ఏకంగా 11 స్థానాలు ఎగబాకి 28వ స్థానానికి చేరుకోవడం విశేషం. దేశంలో రాజకీయ, వ్యాపార, క్రీడా, వినోద రంగాల్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల నుంచి ఈ జాబితాను రూపొందిస్తారు.
కాగా, రేవంత్ శక్తివంతమైన వ్యక్తిగా ఎదగడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర పాలనలో తీసుకువచ్చిన మార్పులు, వ్యూహాత్మక రాజకీయ కార్యకలాపాలు, దేశవ్యాప్తంగా ఇండియా కూటమిలో పోషిస్తున్న ప్రముఖమైన పాత్రతో సీఎం రేవంత్ రెడ్డికి ఈ గుర్తింపు లభించింది. తనదైన దూకుడుతో భారత రాజకీయాల్లో ఆయన చూపుతున్న ప్రభావం, నాయకత్వ లక్షణాలతో ఆయన ర్యాంకు మెరుగుపడింది. ఒక ప్రాంతీయ నాయకుడినే కాకుండా దేశంలోనే అత్యంత శక్తిమంతమైన, చురుకైన ముఖ్యమంత్రుల్లో ఒకరిగా రేవంత్ ఆవిర్భవించారు. ఈ జాబితాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇండియా కూటమిలోని ఇతర ప్రముఖులైన సీఎంల సరసన నిలిపింది. శక్తిమంతులై వంద మంది జాబితాలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మొదటి 10 స్థానాల్లో ఉన్నారు.