నీతి మాలినోళ్లు పొలిటికల్ లీడర్లు
– దేవుడి మీద ప్రమాణం చేస్తారు..
– నీతి, నిజాయితీ తప్పుతారు..
– అబద్దాలతో ఆస్తులు సంపాదిస్తారు..
– స్పీకర్ మౌనవ్రతాన్ని ప్రశ్నించలేరు..
– కుళ్లిన పొలిటికల్ వ్యవస్థ..
(యాటకర్ల మల్లేష్)
పొలిటికల్ లీడర్లు… పార్టీలు ఏవైనా వాళ్లే మన పాలకులు.. ప్రతిపక్ష నేతలు కావచ్చు.. అధికారంలో ఉన్నవారు కావచ్చు.. వీళ్లంతా ప్రజాప్రతినిధులుగా ప్రమాణం చేసేటప్పుడు నిష్పాక్షపాతంగా, నిజాయితీగా ప్రజాస్వామ్య పద్దతిలో ప్రజలకు సేవలు చేస్తామని ‘‘దేవుడి’’ మీద ప్రమాణం చేసిన వారే..
కానీ.. ప్రమాణం చేసిన తరువాత ప్రజాప్రతినిధులు చేసే పనులన్నీ బూటకమే అనేది నిజం.. పొలిటికల్ లో నీతి లేదు.. నిజాయితీ లేదు.. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఓట్లను నోట్లతో కొని ప్రజలకు సేవ చేస్తున్నామనే పేరుతో దేవుడి మీద ప్రమాణం చేసి అక్రమంగా ఆస్తులు సంపాదించే వారు కొందరైతే… పవిత్రమైన అసెంబ్లీ సాక్షిగా అబద్దాలతో ప్రజలను మభ్య పెడుతూ రాజకీయాలు చేసే వారు మరి కొందరు.
అధికారంలో ఉన్నోళ్లు కావచ్చు.. ప్రతిపక్ష పాత్ర పోషించే వాళ్లు కూడా కావచ్చు. ఎవరైనా నీతి తప్పే వారే. మనలను పాలించే వారు ఎంతటి మహానీయులో చెప్పడానికి వారి క్రిమినల్ చరిత్ర చూస్తే తెలుస్తోంది.
స్పీకర్ మౌనవ్రతాన్ని ప్రశ్నించలేరు..
ఇకపోతే.. అసెంబ్లీ స్పీకర్ కు ప్రత్యేక అధికారాలుంటాయి. ఆ పెద్దాయనను ప్రశ్నించే దమ్ము మీడియాకు, న్యాయవ్యవస్థకు లేదు. కానీ.. అధికారంలో ఉన్నోళ్ల పార్టీకి చెందిన ఆ స్పీకర్ నిజాయితీని ప్రతిపక్షంలో ఉన్నోళ్లు ప్రశ్నిస్తుంటారు. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి చెందిన స్పీకర్ కావడంతో పార్టీకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం అరుదే.
ఇగో.. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మీడియా సాక్షిగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. వాళ్లు పార్టీ ఫిరాయించారనేది నిజం.. ఆ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు బీఆర్ఎస్ పెద్దలు చాలా సార్లు విన్నవించారు. అయినా.. స్పీకర్ మౌనవ్రతం పట్టడంతో సుప్రీం కోర్టుకు వెళ్లారు బీఆర్ ఎస్ పెద్దలు. సుప్రీం కోర్టులో నేడో.. రేపో.. ఎల్లుండో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు అనర్హత వేటు తీర్పు ఖాయం.. ఉప ఎన్నికలు వస్తున్నాయని ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పెద్దలు చంకలు గుద్దుకుంటున్నారు.
కేసీఆర్ చేసిన ఘన కార్యం ఇదే..
నిజానికి గతంలో కేసీఆర్ ముఖ్యమత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. ‘‘బంగారు తెలంగాణ’’ కోసం బీఆర్ఎస్ లో చేరారని కేసీఆర్ గర్వంగా చెప్పారు. అప్పట్లో కూడా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు విన్నవించినా.. నేటి పరిస్థితిలానే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోలేరు.
వైఎస్ ఆధ్యుడు..
ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకున్న ఘన చరిత్ర వైఎస్ రాజశేఖర్ రెడ్డికే దక్కుతుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవానికి ముందు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉగ్రరూపం దాల్చింది. ఆ సమయంలోనే బీఆర్ ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యేలు గెలిచారు. కానీ.. తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బ తీసే వ్యూహంలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు వైఎస్. ఆ తరువాత కేసీఆర్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్పించుకుని గర్వంగా చెప్పుకున్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న రేవంత్ సర్కార్ కూడా ఆ ఇద్దరు సీఎంలను ఆధర్శంగా తీసుకుని అదే బాటలో ప్రయాణం చేస్తున్నారు.
అప్పటి నుంచి స్పీకర్ లు అంతే..
ఒక పార్టీ బీ ఫాంతో పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యేలు మరో పార్టీలో చేరితే స్పీకర్ కు ఫిర్యాదు అందిన వెంటనే తనదైన శైలిలో వాస్తవాలను తెలుసుకుని ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించవచ్చు.. కానీ.. అధికార పార్టీ ఎమ్మెల్యేల బలంతో ఎంపికయ్యే స్పీకర్ తనకున్న అధికారాలను ఉపయోగించలేరు. వైఎస్ ప్రభుత్వం నుంచి రేవంత్ సర్కార్ వరకు కూడా స్పీకర్ లు విచారణ పేరిట జాప్యం చేస్తుంటారు. అయినా.. స్పీకర్ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చే దమ్ము న్యాయ స్థానాలకు లేవనే వాదనతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ధైర్యంగా ఉంటున్నారు.
రేవంత్ వ్యాఖ్యలు హల్ చల్..
అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హల్ చల్ చేస్తున్నాయి. సిద్దిపేట్ ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరినా ఉప ఎన్నికలు రావని ప్రకటించడం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవల సుప్రీం కోర్టులో ఎమ్మెల్యేల ఫిరాయింపులపై విచారణ జరుగుతున్నందున వెంటనే ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ పెద్దలు మీడియాతో చెప్పడంతోనే సీఎం రేవంత్ రెడ్డి అలా మాట్లాడి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.