మహిళా రైతులకు ట్రాక్టర్లు…. డ్రోన్లు…
వరంగల్, నిర్దేశం:
వసాయ రంగంలోనూ యంత్రాల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. సాగు విస్తీర్ణం పెరగడంతో కూలీల కొరత ఏర్పడుతున్న నేపథ్యంలో.. విత్తు నాటే సమయం నుంచి పంట ఇంటికొచ్చే సమయం వరకు పలు సందర్భాల్లో వివిధ రకాల యంత్రాలను రైతులు వినియోగిస్తున్నారు. దీంతో రైతులకు అవసరమైన యంత్రాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీపై అందిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో నిలిచిపోయిన వ్యవసాయ యాంత్రీకరణ పథకంను రేవంత్ సర్కార్ మళ్లీ అమలు చేసేందుకు నిర్ణయించింది. అయితే, ఈసారి మహిళలకే వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.తెలంగాణ ప్రభుత్వం మహిళా రైతులకు శుభవార్త చెప్పింది. వ్యవసాయ యాంత్రీకరణలో తొలిసారిగా మహిళా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. 2018లో అప్పటి ప్రభుత్వం సబ్సిడీపై రైతులకు యాంత్రీకరణ పనిముట్లను అందజేసే కార్యక్రమాన్ని నిలిపివేసింది.
గతంలో ఎస్సీ, ఎస్టీలకు 90శాతం, ఇతరులకు 50శాతం సబ్సిడీ ఉండేది. ప్రస్తుతం అందరికీ 50శాతం సబ్సిడీతో ఈ యాంత్రీకరణ పరికరాలను అందజేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వ్యవసాయ యాంత్రీకరణలో తొలిసారిగా మహిళా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 10,812 యూనిట్లు అందజేసేందుకు జిల్లా వ్యవసాయశాఖ అధికారులకు మార్గదర్శకాలతో కూడిన ఆదేశాలు జారీ చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను రూ. 24.90 కోట్ల సబ్సిడీని రైతులకు అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే.. ఈనెల 31వ తేదీలోగా పథకాన్ని అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే, ప్రస్తుతం సమయం తక్కువగా ఉండటంతో లబ్ధిదారుల ఎంపికలో అధికారులు తలమునకలయ్యారు.వ్యవసాయ పనుల్లో రైతులకు దోహదపడే 14 రకాల యంత్ర పరికరాలను 50శాతం సబ్సిడీతో మహిళా రైతులకు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా చేతిపంపులు, పవర్ స్ర్పేయర్లు, డ్రోన్లు, రోటోవేటర్లు, విత్తనాలు/ఎరువులువేసే పరికరాలు, ట్రాక్టర్లతో దమ్ముచేసే పరికరాలు, పవర్ టిల్లర్లు, ఎద్దులతో బోదలు పోసే పరికరాలు, ట్రాక్టర్లతో బోదలుపోసే పరికరాలు, పవర్ వీడర్స్, బ్రష్ కట్టర్స్, ట్రాక్టర్లు, మొక్కజొన్న కోత పరికరాలు, గడ్డిచుట్టే పరికరాలను ప్రభుత్వం సబ్సిడీపై అందించనుంది.ఈ నెలాఖరులోగా మహిళా రైతుల నుంచి దరఖాస్తులను అధికారులు స్వీకరించనున్నారు. జిల్లాలకు కేటాయింపుల ఆధారంగా ఆయా మండలాలకు నిధులు, లబ్ధిదారుల సంఖ్య కేటాయింపులు చేయనున్నారు. లక్ష రూపాయల లోపు యూనిట్ ఉంటే మండల వ్యవసాయ శాఖ అధికారి కన్వీనర్ గా ఉన్న కమిటీ, లక్షకు మించితే కలెక్టర్ చైర్మన్ గా ఉన్న కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేయనుంది. ఎంపికయిన వారికి సబ్సిడీపై వారు కోరుకున్న యంత్రాలను అందిస్తారు.