రోజుకు రూ.32 సంపాదిస్తే ధనవంతులేనట
– పేదరికానికి కొత్త నిర్వచనం చెప్పిన కేంద్ర ప్రభుత్వం
– దీని ప్రకారం దేశంలో పేదరికం మొత్తం తగ్గిందని కొత్త లెక్కలు
– తాజా లెక్కల ప్రకారం దేశంలో 4 శాతానికి తగ్గిన పేదరికం
– బీజేపీ రాష్ట్రాల్లో అయితే పేదరికమే లేదట
– విస్మయం కలిగిస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరు
నిర్దేశం, స్పెషల్ డెస్క్ః
ధనవంతులు అంటే ఎవరు? కోట్ల ఆస్తి ఉన్నవారని ఎవరైనా గుక్క తిప్పుకోకుండా చెప్తారు. మీరు కూడా ఇదే సమాధానం చెప్తె.. తప్పులో కాలేసినట్లే. ధనికులు అనేదానికి డిఫినేషన్ మార్చేసింది కేంద్ర ప్రభుత్వం. మరి ధనికులు ఎవరంటా అంటే.. రోజుకు రూ.32 అంటే నెలకు రూ.960 సంపాదించేవారు ధనికులేనని తేల్చి పారేసింది. మన దేశంలో పేదరికం ప్రధాన సమస్య. అయితే పేదరికాన్ని నిర్మూలించే ప్రయత్నాలు చేయడంలో మన ప్రభుత్వాలు ఎప్పుడూ విఫలమవుతూనే ఉన్నాయి. గత ప్రభుత్వాల్లాగే మోదీ ప్రభుత్వమూ విఫలమైంది. అందుకే పేదరికానికి తీసేయడం కష్టమని పేదల్ని తీసేశారు. ఇంత మంది ధనికులు ఉన్నా కూడా దేశంలో 80 కోట్ల మందికి రేషన్ ఇవ్వడం మోదీ ప్రభుత్వం విశాలమైన హృదయానికి ఉదాహరణ.
ప్రభుత్వ లెక్కల ప్రకారం.. ప్రస్తుతం దేశంలో కేవలం 4% మంది మాత్రమే పేదరికంలో ఉన్నారట. అంటే, 142 కోట్ల జనాభాలో కేవలం.. 5 నుంచి 6 కోట్ల మంది మాత్రమే దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు. 12 సంవత్సరాల క్రితం అంటే, 2011-12లో పేదరికం 29.3% ఉంది. ఈ పదేళ్లలో ఏకంగా 25 శాతానికి పైగా పేదల్ని ధనవంతుల్ని చేసినట్లు మోదీ ప్రభుత్వం చెప్పుకుంటోంది. ధనికులు అంటే మామూలు ధనికులు కాదు. ఆ డబ్బులు దాచుకోవాలంటే స్విస్ బ్యాంక్ కూడా సరిపోవడం లేదు.
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ అనే సంస్థ ఈ డేటాను విడుదల చేసింది. అంతకుముందు జనవరి 2025లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా పేదరికంపై ఒక నివేదికను విడుదల చేసింది. దేశంలోని నగరాలు, గ్రామాలలో నివసించే ప్రజలలో పేదరికం తగ్గుతోందని ఎస్బీఐ తన నివేదికలో పేర్కొంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని ప్రాంతాలలో పేదరికం రేటు తగ్గిందని ఎస్బీఐ నివేదిక పేర్కొంది. కానీ ఎన్ఎస్ఓ తాజా డేటా ఈ గణాంకాలు సరైనవా లేక కాకమ్మ లెక్కలా అనే చర్చ దేశంలో తలెత్తుతోంది.
పేదరికానికి కొత్త నిర్వచనం
మోదీ ప్రభుత్వం లెక్కల ప్రకారం.. రోజుకు రూ.32 రూపాయలు (నెలకు రూ.960) సంపాదిస్తే పేదవారు కాదు. నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ సభ్యురాలు, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యురాలు డాక్టర్ షమికా రవి స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నివేదిక ప్రకారం, నగరంలో ఒక వ్యక్తి రోజుకు రూ.47 (నెలకు రూ.1,410) కంటే ఎక్కువ సంపాదించినా, గ్రామంలో ఉండేవారు రోజుకు రూ.32 (నెలకు రూ.960)గా సంపాదించినా పేదవారు కాదు. ఒక నగరంలో రూ.47 రూపాయలతో ఒక రోజు జీవించగలరా? హైదరాబాద్ లో లోకల్ బస్ టికెట్ కూడా ఇంత కంటే ఎక్కువే ఉంటుంది. పటాన్ చెరులో ఉన్న వ్యక్తి ఈ డబ్బులతో ఎల్బీనగర్ వరకు రాలేడు. ఇక గ్రామ ఆదాయం రూ.32 కూడా అంతే హాస్యంగా ఉంది.
రాష్ట్రాల్లో పేదరికం తగ్గింది: సర్వే
సర్వే ప్రకారం, అనేక రాష్ట్రాల్లో పేదరికం గణనీయంగా తగ్గింది. డేటా ప్రకారం, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అయితే పేదరికమే లేదట. హర్యానాలో ఒక శాతం కంటే తక్కువ మంది దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు. ఇక దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ అయిన బీహార్ లో కూడా కేవలం 4 శాతమే పేదలు ఉన్నారట. ఇంత తక్కువ పేదరికం ఉండి కూడా వేరే రాష్ట్రాలకు బిహారీలు పనికి వెళ్లడం బిహారీల తప్పే కాబోలు. బీహార్లో పేదరిక గణాంకాలలో అద్భుతమైన మెరుగుదల ఉందని ఎస్బీఐ కూడా చెప్పింది. ఇదిలా ఉంటే.. మొన్ననే బిహార్ లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చేపట్టిన కులగణనలో సర్వేలో 50% కంటే ఎక్కువ మంది పేదలు ఉన్నట్లు వెల్లడైంది. బహుశా.. రూ.32 సంపాదిస్తే ధనికులేనన్న విషయం నితీశ్ కు తెలియకపోవచ్చు.
ఈ రాష్ట్రాల్లో పేదరికం చాలా తగ్గింది
2011-12 నుంచి ఇప్పటికి తగ్గిన లెక్కలు
జార్ఖండ్: 42% నుండి 12.5% కి తగ్గింది
ఛత్తీస్గఢ్: 47% నుండి 11.3%కి తగ్గింది
మధ్యప్రదేశ్: 44% నుండి 6% కి తగ్గింది
మహారాష్ట్ర: 20% నుండి 5.9%కి తగ్గింది
రాజస్థాన్: 22% నుండి 5%కి తగ్గింది
బీహార్: 41.3% నుండి 4.4%కి తగ్గింది
ఉత్తరప్రదేశ్: 40% నుండి 3.5%కి తగ్గింది
గుజరాత్: 27% నుండి 2.7% కి తగ్గింది
పంజాబ్: 11% నుండి 2% కి తగ్గింది
హర్యానా: 12.5% నుండి 0.9% కి తగ్గింది