సీఎం సాబ్ కో గుస్సా ఆగయ..
ఇంతకు జర్నలిస్టులు ఎవరు..?
– వాళ్ల రాజకీయ లబ్ది కోసం జర్నలిస్టులు బిజీ బిజీ..
– ప్రెస్ అకాడమీ అగ్నిపరీక్షలో నెగ్గే జర్నలిస్టులెవరు..?
(యాటకర్ల మల్లేష్)
ఇంతకు జర్నలిస్టులు ఎవరు..? ప్రజాస్వామ్యంలో నాలుగవ స్థంబంగా గుర్తించిన జర్నలిస్టు వ్యవస్థను నాశనం చేస్తోంది ఎవరు..? కుళ్లి పోతున్న ఈ సమాజానికి సరియైన శస్త్ర చికిత్స చేసే అసలైన జర్నలిస్టులెవరు..? ఇప్పటికే పొలిటికల్ రంగు వేసుకుని ఎర్నలిజమే ధ్యేయంగా కాలం వెళ్ల తీస్తున్న నకిలీ జర్నలిస్టుల ఏరి వేత సాధ్యామా..? సోషల్ మీడియా డామినేట్ చేస్తున్న నేటి కాలంలో జర్నలిజంలోని నైతిక విలువలను పట్టపగలు హత్య చేస్తున్న ఆ పొలిటికల్ లీడరులు ఎవరనేది తాజాగా తెరపైకి వచ్చింది చర్చా..
సీఎం సాబ్ కో గుస్సా ఆగయ..
ఔను.. సీఎం సారుకు కోపం వచ్చింది.. జర్నలిజంలోని నైతిక విలువలకు తిలోదకాలిచ్చిన కొందరు యూట్యూబర్ లు పాలకుల వ్యక్తి జీవితాల్లోకి తొంగి చూస్తున్నారు. డైలీ పేపరులపై విశ్లేషణ పేరుతో ప్రతి పక్షంలోని బీఆర్ఎస్ ను కొందరు, అధికారంలో ఉన్న పాలకుల వ్యక్తిగత జీవితాల్లోకి మరి కొందరు జర్నలిజం ముసుగులో తొంగి చూస్తున్నారు. అయితే.. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా జర్నలిస్టు వ్యవస్థను ప్రశ్నించిన తీరుపై జర్నలిస్టు సంఘాలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ‘‘నన్ను తిడుతూ వీడియోలు పెట్టినోళ్లను తోడికల్ తీస్తా, యూట్యూబర్లను బట్టలిప్పదీసి రోడ్డు మీద తిప్పిస్తా.. జర్నలిజం పేరిట కుటుంబ సభ్యులను, ఆడవాళ్లను తిడతారా? వాళ్ల ఇంట్లో కూడా తల్లి, చెల్లి, భార్య ఉంటారు కదా? ’’ అంటూ సీఎం యూట్యూబర్ జర్నలిస్టులపై విరుచక పడటం తప్పు కాదేమో..?
తీన్మార్ మల్లన్న స్పూర్తిగా…
కేసీఆర్ ప్రభుత్వంలో యూ ట్యూబ్ లో న్యూస్ విశ్లేషిస్తూ బీఆర్ ఎస్ ను టార్గెట్ చేసిన తీన్మార్ మల్లన్న లాంటొళ్లు కాంగ్రెస్ ప్రభుత్వంలో పదుల సంఖ్యలో పుట్టుకొచ్చారు. కేసీఆర్ ఫ్యామిలీని జర్నలిజం పేరుతో వ్యక్తిగత విమర్శలు చేసి సుమారు వంద కేసులను ఎదుర్కొన్న తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ.. బీసీ ఎజెండాను పట్టుకుని రెడ్డి సామాజికి వర్గాన్ని విమర్శించారని ఆ పార్టీ సస్పెండ్ చేసినా.. ఆయన స్పూర్తిగానే రాజకీయ పార్టీల ఆర్థిక అండ దండాలతో యూట్యూబ్ లు కొనసాగుతున్నాయి. జర్నలిజం పేరుతో పబ్బం గడుపుకుంటూ రాజకీయ పార్టీలకు అనుకూలంగా పని చేసే వాళ్లతోనే సమస్య. సోషల్ మీడియాలో ఆబద్దాన్ని నిజాలుగా.. నిజాలను ఆబద్దాలుగా ప్రజల మధ్యకు పంపుతున్నది కూడా పొలిటికల్ లీడర్ లే.. ఒకప్పుడు కేసీఆర్ ప్యామిలీని టార్గెట్ చేసినప్పుడు కాంగ్రెస్, బీజేపీ, బీఎస్ పీ లతో పాటు అందరూ అధికార పక్షాన్ని దూషించిన వారే. అయితే.. మారిన రాజకీయ పరిస్థితులలో ప్రతిపక్షం.. అధికార పక్షం ఎజెండాలను మోస్తున్న జర్నలిస్టులను గుర్తించాల్సిన అవసరం ఉంది.
జర్నలిస్టులు అంటే ఎవరు ?
జర్నలిస్టులు అంటే ఎవరు అని రేవంత్ ప్రశ్నించినప్పుడు.. గుర్తింపు పొందిన సంస్థల్లో పని చేసేవారే జర్నలిస్టులు అనే మాట చెప్పే ప్రయత్నం చేశారు. యూట్యూబర్లు జర్నలిస్టులు కాదని ఆయన ఉద్దేశం. నిజంగానే యూట్యూబర్లకు ఎవరూ జర్నలిస్టు అనే ట్యాగ్ ఇవ్వలేదు. వారికి వారే ఇచ్చుకున్నారు. ఎందుకంటే వారికి ఆ హక్కు ఉంది. నేను జర్నలిస్టును అని చెప్పుకునేందుకు ఎలాంటి అర్హత అవసరం లేదు. కానీ ఆ పేరుతో తప్పుడు పనులు చేస్తే అది రక్షణ కాదు.
ప్రశ్నించే జర్నలిస్టులు వేరు.. తిట్టించేవారు వేరు !
జర్నలిజాన్ని అధికార, ప్రతిపక్షాలు రాజకీయంగా వాడుకుంటున్నాయి. తమకు అనుకూలంగా ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ప్రచారం చేయించుకోవడం కామన్ గా మారింది. తొండ ముదిరి ఉసరవెల్లి అయినట్లు ఈ వ్యతిరేక ప్రచారం కాస్తా అసహనంగా మారి తిట్ల దశకు.. చేరుకుంది. పుట్టుకల్ని ప్రశ్నించడం దగ్గర నుంచి చంపేస్తామని అనడం వరకూ వెళ్లింది. వీళ్లు తమకు తాము జర్నలిస్టులమని పేరు పెట్టుకున్నా వీరిని చట్టప్రకారం నియంత్రించాల్సిందే. వీరిని అడ్డం పెట్టుకుని వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని అందర్నీ నియంత్రించే ప్రయత్నం చేయడం మాత్రం ప్రజాస్వామ్యంలో నేతలకు ప్రమాదకరం.
ప్రెస్ అకాడమీకి అగ్ని పరీక్ష..?
సీఎం రేవంత్ రెడ్డి జర్నలిస్టులపై చేసిన వ్యాఖ్యలతో ఇంతకు అసలైన జర్నలిస్టులు ఎవరనే చర్చ జర్నలిస్టు వర్గాలలో కొనసాగుతుంది. యూట్యూబర్ లు.. డిజిటల్ డైలీ పేపర్ ల పేరుతో కొందరు ఇష్టానుచారంగా వ్యక్తిగతంగా విమర్శలకు దిగడంతో జర్నలిజంలోని నైతిక విలువలు తెరపైకి వచ్చాయి. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఏర్పడిన తెలంగాణ ప్రెస్ అకాడమీకి అసలైన జర్నలిస్టులను గుర్తించడం పెద్ద సవాలే.. అయినా.. జర్నలిజాన్ని అసహించుకుంటున్న నేటి కాలంలో అభ్యుదయ భావాలు గల నిజాయితీ పరులుగా పేరున్న సీనియర్ జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలతో కమిటీని ఏర్పాటు చేసి అసలైన జర్నలిస్టులకు నిర్వహచనం చెప్పాల్సిన అవసరం ఉందెమో..?