ఆమెకు ఆరు సర్కార్ కొలువులు
– బాల్యంలోనే పెళ్లి.. ఇద్దరు పిల్లలు..
నిర్దేశం, జనగామః
ఒక సర్కార్ కొలువు కొట్టాలంటే రాత్రింబగళ్లు చదువాల్సిందే.. సోషల్ మీడియా డామినేట్ చేస్తున్న నేటి కాలంలో ఆమె ఆరు సర్కార్ కొలువులు సాధించి ఆణి మూత్యంలా నిలిచారు. ఇగో.. కృషి పట్టుదల అంకితభావం ఉంటే ఏదైనా సాధించవచ్చాని జనగామ జిల్లా నర్మేట మండలం వెల్దండ గ్రామానికి చెందిన బైరగోని పల్లవి నిరూపించింది.
బైరగోని పల్లవి… ఏకంగా ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి యువతకు ఆదర్శంగా నిలిచింది. ఆమెకు 13 ఏళ్లకే పెళ్లి కాగా వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. భర్త, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో జూనియర్ లెక్చరర్ సాధించిన పల్లవి జీవితంలోకి తొంగి చూద్దాం..
పల్లవిది ఆర్థికంగా వెనుక బడిన కుటుంబం. పదవ తరగతి వరకు మల్కాపూర్ ఉన్నత పాఠశాలలో చదువుకుంది. ఇంటర్, డిగ్రీ స్టేషన్ ఘన్ పూర్ లో పూర్తి చేసింది. ఆ తర్వాత ఎంట్రన్స్ రాసి కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ కాలేజీలో ఎంఎస్సీ కెమిస్ట్రీ సీటు సాధించింది. చిన్నప్పట్నుంచి చదివే లక్ష్యంగా ముందుకు అడుగులు వేసింది. తన భర్త, కుటుంబ సభ్యులు చాలా కష్టపడి చదివించారని ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని పల్లవి ఆనందం వ్యక్తం చేసింది. వివిధ జిల్లాల నుండి విద్యార్థులు, స్నేహితులు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ఉద్యోగాలు ఇవే..
2009 నుండి 2018 వరకు బాసర లోని త్రిబుల్ ఐటీ కళాశాలలో కెమిస్ట్రీ ఫ్యాకల్టీగా పని చేసింది. 2018లో వరంగల్ వెస్ట్ స్కూల్లో గురుకుల పోస్ట్ గ్రాడ్ (పీజీటీ)టీచర్ గా పని చేసింది. అదే సమయంలో గురుకుల టీజీటీ, జేఎల్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అనె లిస్ట్ గ్రేడ్ 2 గా ఉద్యోగాలు సాధించింది. 2019 సంవత్సరంలో గురుకుల కళాశాలలో డిగ్రీలెక్చరర్ (డిఎల్)గా ఉద్యోగం, ఇటీవల ప్రకటించిన జూనియర్ కళాశాల లెక్చరర్ గా ఎంపికై ప్రస్తుతం సొంత జిల్లా జనగామ గర్ల్స్ జూనియర్ కళాశాలలో ఉద్యోగం సాధించింది. ‘‘నిర్దేశం’’ పల్లవికి ఆల్ ది బెస్ట్ చెబుదాం..