మద్యం మత్తులో ముగ్గురిని చంపి.. ఓం నమః శివాయ అంటూ నినాదాలు చేశాడు
నిర్దేశం, వడోదరః
గుజరాత్‌లోని వడోదరలో ఒక హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో ఒక యువకుడు అతివేగంగా వస్తున్న కారుతో ముగ్గురిని చితక్కొట్టాడు. ఈ ఘటనలో స్కూటర్ నడుపుతున్న ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు కాసేపటికి చనిపోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. కరేలిబాగ్ ప్రాంతంలోని ముక్తానంద స్క్వేర్ సమీపంలో తెల్లవారుజామున 12:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని, ఆ తర్వాత డ్రైవర్ రక్షిత్ చౌరాసియా (20) ను అరెస్టు చేసినట్లు డీసీపీ పన్నా మోమయ తెలిపారు.
చౌరాసియా మద్యం మత్తులో ఉన్నాడు. యాక్సిడెంట్ చేసిన అనంతరం కారు దిగి ‘ఓం నమః శివాయ’ అంటూ అరవడం వీడియోలో చూడొచ్చు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నిందితుడు చౌరాసియా ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి వాసి. వడోదరలో ఎల్‌ఎల్‌బి చదువుకుంటున్నాడు. ఆ కారు తన స్నేహితుడు మీట్ చౌహాన్ కు చెందింది. అతను డ్రైవర్ పక్కన సీట్లో కూర్చున్నాడు. ముక్తానంద స్క్వేర్ వైపు వెళుతుండగా చౌరాసియా కారును పూర్తి వేగంతో నడిపి కొన్ని ద్విచక్ర వాహనాలను ఢీకొట్టాడు.
కారు బానెట్ ముక్కలైపోయింది
చిత్రంగా.. ఘటన జరిగిన అనంతరం.. అక్కడే పచార్లు చేసిన చౌహాన్, ఆ వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. ఘటన అనంతరం.. అతడిని పలువురు వీడియోలు తీసి, వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆచూకీ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారి తెలిపారు. ప్రత్యక్ష సాక్షి తీసిన వీడియోలో, కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది. వీడియోలో, చౌహాన్ కారు నుంచి బయటకు వచ్చి ప్రమాదానికి చౌరాసియాను నిందించడం కనిపిస్తుంది.