నిజామాబాద్ పోలీస్ కస్టడీలో యువకుడు అనుమానాస్పద
మృతిపోలీసుల చిత్రహింసలతోనే చనిపోయాడని బాధితుల ఆరోపణ
నిజామాబాద్, నిర్దేశం:
నిజామాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసుల కస్టడీలో ఉన్న ఓ నిందితుడు మరణించడం కలకలం సృష్టించింది. విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకున్న నిందితుడు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందినట్లుగా పోలీసులు వర్గాలు తెలిపాయి. అయితే పోలీసులు చిత్రహింసలు పెట్టడంతోనే మరణించాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లాకు చెందిన సంపత్ అనే యువకుడు శ్రీరామ ఇంటర్నేషనల్ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. అతని ద్వారా గల్ఫ్ దేశాలకు వెళ్లి మోసపోయిన ఇద్దరు బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో నిజామాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సంపత్‌తోపాటు మరో ఏజెంట్‌పై పది రోజుల క్రితం కేసు నమోదు చేశారు. వారిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. అయితే బాధితుల డబ్బులు రికవరీ కోసం సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ నిమిత్తం రెండు రోజుల క్రితం కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకున్నారు.
విచారణలో భాగంగా గురువారం మధ్యాహ్నం సంపత్‌ను తన స్వస్థలమైన జగిత్యాలకు తీసుకువెళ్లారు. గురువారం రాత్రి 9.45 నిమిషాలకు తిరిగి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. కొద్ది సేపటికే తన చెయ్యి నొప్పిగా ఉందని నిందితుడు చెప్పడంతో చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడికి వెళ్లిన కొద్ది సమయానికి సంపత్ మరణించాడు. దీంతో పోలీసులు విషయాన్ని అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. శుక్రవారం ఉదయం నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్న మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు హాస్పిటల్ ముందు ధర్నా నిర్వహించారు. పోలీసుల టార్చర్ వల్లే సంపత్ చనిపోయాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు. సంపత్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈనేపథ్యంలో హాస్పిటల్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఈ ఘటనపై విచారణ నిర్వహించేందుకు మేజిస్ట్రేట్ నిజామాబాద్ జిల్లా ప్రభుత్వాసుపత్రికి రానున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.