నరేంద్ర మోడీ, అమిత్ షాల దుర్మార్గాలు

నరేంద్ర మోడీ, అమిత్ షాల దుర్మార్గాల చిట్టాలో ఒక పేజీ

నరేంద్ర మోడీ, అమిత్ షా ల దుర్మార్గాలను దగ్గరి నుంచి చూసి ఎదిరించడానికి, ప్రపంచానికి నిజాలు చెప్పడానికి సాహసించినందుకు అంతులేని వేధింపులను, శిక్షలను ఎదుర్కొన్న పోలీసు అధికారి సంజీవ్ భట్ సహచరి శ్వేత మనందరికీ రాసిన లేఖ

నా పేరు శ్వేతా సంజీవ్ భట్.

గుజరాత్ మారణహోమానికి ఇరవై ఏళ్లు నిండబోతున్న సందర్భంగా, గడిచిన సంవత్సరాల వైపు వెనక్కి తిరిగి చూడకుండా ఉండలేకపోతున్నాను. ఆ సంవత్సరాలలో సంజీవ్ భట్, ఆయన లాంటి మరికొందరు సాహసికులు నిరంకుశ సామ్రాజ్యం మీద సర్వశక్తులతో పోరాడారు. గడిచిన రెండు దశాబ్దాలను అవలోకించేటప్పుడు, ఈ తలపుల తోవలో నాతోపాటు నడవమని మిమ్మల్ని కోరుతున్నాను. అందువల్ల సంజీవ్ ఎటువంటి మనిషో, ఈ ఫాసిస్టు రాజ్యం మీద ఆయన చేసిన పోరాటం ఏమిటో మీరు తెలుసుకోగలరు. ఆ రాజ్యం నా కన్న మీ కన్న చాల పెద్దది.

సంజీవ్, నేను, నా పిల్లలు ఈ ఇరవై సంవత్సరాలుగా, ఇవాళ్టికి కూడ ఈ పాలకుల చేతిలో, ఎదుర్కొంటున్న బెదిరింపుల జుగుప్సాకరమైన వివరాలు చెప్పి మిమ్మల్ని విసిగించను. సంజీవ్ మీద, ఆయన కుటుంబ సభ్యులమైన మామీద ఈ ఇరవై ఏళ్లలో ఈ పాలకులు జరిపిన హత్యాయత్నాల, కక్షపూరిత బీభత్సపు వివరాలు చెప్పి మీ సమయం వృథా చెయ్యను. హృదయం బలహీనంగా ఉన్నవారు ఆ వివరాలు విని తట్టుకోలేరు.

ఆ బీభత్సం జరుగుతున్నప్పుడు సంజీవ్ ఉద్యోగానికి రాజీనామా చేయడమో, లేదా గుజరాత్ కు బైట మరో రాష్ట్రానికి బదిలీ చేయించుకోవడమో సులభమైన పనిగా ఉండేది. అంటే న్యాయం కోసం జరిపే పోరాటం తనది కాదనుకుని దాన్ని వదిలేయడం అన్నమాట. ఈ ఫాసిస్టు ప్రభుత్వాన్ని సంతృప్తి పరచడానికి, ఈ దుర్మార్గ పాలకుల ఇష్టాయిష్టాలకు తలొగ్గి, వెన్నెముక లేని ఇతరులందరిలాగనే మతిమరపు నటించడమో, చట్టం ఎదుట సత్యప్రమాణకంగా వాస్తవాలు చెప్పడానికి నిరాకరించడమో చేసి ఉంటే సౌకర్యంగా ఉండేది.

సంజీవ్ ఆ సులభమైన పనినో, సౌకర్యవంతమైన పనినో ఎంచుకున్నాడా? లేదు. ఆయన ఆ పని ఎంతమాత్రమూ చెయ్యలేదు!

అందుకు బదులుగా సంజీవ్ ఈ దుర్మార్గ, కక్షపూరిత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలనే తన నిర్ణయానికి ఎటువంటి ఊగిసలాట లేకుండా కట్టుబడి ఉన్నాడు. 2002 నుంచి ఇవాళ్టిదాకా సాహసికంగా పోరాటం కొనసాగించాడు. అదంతా గుజరాత్ మారణకాండ బాధితులకు న్యాయం సాధించడం కోసం. ఆ కాలమంతా ఆయన ఈ ఫాసిస్టు పాలకుల ప్రతీకార చర్యలకు బలి అవుతూ వచ్చాడు. ఏ ఒక్కరోజూ తన నిర్ణయాన్ని సందేహించలేదు, వెనక్కి తగ్గలేదు, తల వంచలేదు.

యుద్ధం వాస్తవికంగా, భయానకంగా మారినప్పుడు యుద్ధరంగం నుంచి పారిపోయి, స్వగృహంలో, సురక్షితమైన స్థలంలో కూచుని వ్యాఖ్యలు చేయడం చాల సులభం. కాని, యుద్ధరంగం లోనే నిలబడి, ఒక అసమాన, దీర్ఘకాలిక యుద్ధాన్ని సాహసంతో, చిత్తశుద్ధితో కొనసాగించడానికి పూర్తిగా భిన్నమైన వ్యక్తిత్వం కావాలి.

నా తలపుల తోవలో నాతో పాటు నడవండి…2002 నుంచి సంజీవ్ జీవిత దృశ్యాన్ని పైపైన అయినా చూడండి…

2002: ఆ సంవత్సరమే సంజీవ్ ను గుజరాత్ రాష్ట్ర ఇంటిలిజెన్స్ బ్యూరోలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఇంటిలిజెన్స్ గా నియమించారు. ప్రభుత్వం రచించిన ప్రణాళిక మేరకు ఊచకోత జరిగిన ఆ సంవత్సరంలోనే సెప్టెంబర్ లో ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గౌరవయాత్ర పేరుతో ఒక విజయ యాత్ర నడిపాడు. వెళ్లినచోటల్లా ముస్లిం మైనారిటీ సమూహం మీద విషపూరితమైన, ఉద్రేకాలకు దారితీసే ఉపన్యాసాలు చేశాడు.
రాష్ట్రంలో అప్పటికే ఉన్న మత ఉద్రిక్తతలను మరింత ఎగసన దోశాడు. ఆ అంశాల మీద దర్యాప్తు జరుపుతున్న జాతీయ మైనారిటీల కమిషన్ ఆ ఉపన్యాసాల రికార్డింగ్ లు కావాలని అడిగింది. ఇంటిలిజెన్స్ బ్యూరో సాధారణ కార్యకలాపాల్లో భాగంగానే ఆ ఉపన్యాసాలన్నీ రికార్డ్ అయి ఉన్నాయి. అసలు ఆ రికార్డింగ్ లను ఇంటిలిజెన్స్ బ్యూరో దగ్గర నిల్వ ఉండే రికార్డులలో భద్రపరచవద్దని తీవ్రమైన రాజకీయ ఒత్తిడి వచ్చింది.

అధికారులలో అత్యధికులు ఆ ఒత్తిళ్లకు లొంగిపోగా, సంజీవ్, మరికొందరు ఐబి అధికారులు ఆ ఒత్తిడిని ఎదుర్కొని జాతీయ మైనారిటీ కమిషన్ అడిగిన రికార్డింగ్ లను అందజేశారు.

మోడీ ప్రభుత్వం చెప్పిన మాట విననందుకు సంజీవ్ నూ మరొక ఇద్దరు ఐబి ఉన్నతాధికారులనూ రాత్రికి రాత్రి బదిలీ చేశారు. బదిలీ చేయడం మాత్రమే కాదు, “శిక్ష”గా భావించే పదవుల్లో నియమించారు.

ఇదిగో ఇతను పద్ధతి ప్రకారం తన బాధ్యతలు నిర్వర్తించే అధికారి, మోడీ, షాలు ఏమి చెపితే అది గుడ్డిగా అనుసరించి, రాజకీయ ఒత్తిళ్లకు లొంగే అధికారి కాదు అని ఒక ఉదాహరణను సృష్టించారు.

2002 చివరిరోజుల్లో, గుజరాత్ మాజీ హోం మంత్రి హరేన్ పాండ్యా హత్య జరిగింది. జస్టిస్ కృష్ణ అయ్యర్ నాయకత్వంలోని స్వతంత్ర కమిషన్ ఎదుట హరేన్ పాండ్యా గుజరాత్ మారణకాండకు రూపకల్పన చేయడంలో మోడీ పాత్ర గురించి రహస్యంగా వాంగ్మూలం ఇచ్చిన కొన్ని నెలల్లోనే ఆ హత్య జరిగింది.

2003: ఆ సంవత్సరం సంజీవ్ ను సాబర్మతి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ గా నియమించారు. హరేన్ పాండ్యా హత్య కేసులో ముద్దాయి అయిన అస్గర్ అలీ అనే ఖైదీ అప్పుడు ఆ జైలులోనే ఉన్నాడు. హరేన్ పాండ్యాను చంపినది తుల్సీరాం ప్రజాపతి అనే వ్యక్తి అని అస్గర్ అలీ స్వచ్ఛందంగా ముందుకువచ్చి సమాచారం ఇచ్చాడు. ఆ తుల్సీరాం ప్రజాపతిని 2006లో ఒక బూటకపు ఎన్ కౌంటర్ లో కాల్చి చంపారని గుర్తుంచుకోవడం ముఖ్యం.

పద్ధతి ప్రకారం తనకు అందిన సమాచారాన్ని సంజీవ్ వెంటనే అప్పటి గుజరాత్ హోం మంత్రికి (అంటే ఇప్పుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు) తెలియజేశాడు. అస్గర్ అలీ ఇస్తున్న సమాచారం మీద ఆధారపడి కేసును మళ్లీ తెరవాలనీ, హరేన్ పాండ్యా హత్య కేసును మళ్లీ దర్యాప్తు చేయాలనీ రాశాడు. ఈ వ్యవహారానికి సంబంధించిన ఆధారపత్రాలన్నిటినీ ధ్వంసం చేయమని సంజీవ్ కు పైనుంచి ఆదేశాలు వచ్చాయి.

ఆ పని చేయడానికి సంజీవ్ నిరాకరించాడు. అంత మాత్రమే కాదు, అస్గర్ అలీ చెప్పిన కీలక సమాచారాన్ని, చెప్పిన విషయాలనూ, వాటితో పాటు తనకూ అమిత్ షాకూ మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలనూ కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పంపించాడు.

తన విధ్యుక్త ధర్మాన్ని కచ్చితంగా, నిజాయితీతో నిర్వర్తించినందుకు శిక్షగా సంజీవ్ ను రాత్రికి రాత్రే సాబర్మతి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ పదవి నుంచి బదిలీ చేశారు.

సంజీవ్ ను అలా బదిలీ చేయడం తప్పుడు పద్ధతి అనీ, రాజకీయ దురుద్దేశపూరితమైనదనీ హైకోర్టులో అఫిడవిట్లు దాఖలు చేయడంతోపాటు ఆ జైలులోని వేలాది మంది ఖైదీలు ఆ బదిలీకి నిరసనగా నిరాహార దీక్ష చేశారు. అటువంటి ఘట్టం ఆధునిక భారత చరిత్రలో మొట్టమొదటిసారిగా జరిగింది. ఆ జైలు సూపరింటెండెంట్ గా సంజీవ్ అనేక జైలు సంస్కరణలు చేపట్టాడు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాడు. శిక్ష పడిన ఖైదీలతో, విచారణలో ఉన్న ఖైదీలతో మానవీయంగా ప్రవర్తించాలనీ, వారి మానవ హక్కులను కాపాడాలనీ చర్యలు తీసుకున్నాడు.

ఇద్దరు దుష్ట రాజకీయ నాయకుల దుర్మార్గమైన కోరికలను తిరస్కరించినందుకు, సంజీవ్ ను వరుసగా ప్రతి అడుగులోనూ “శిక్షా పదవుల”కు బదిలీ చేయడం, పదోన్నతులను అవమానకరంగా ఆలస్యం చేయడం కొనసాగింది.

మోడీ, షాల రాజకీయ ప్రాబల్యం బలపడిన కొద్దీ, తమ దుర్మార్గ కోరికలకు తలఒగ్గని వారిమీద విధించే శిక్షల పద్ధతులూ, సాధనాలూ మరింత ప్రమాదకరమైన కక్ష సాధింపుగా మారాయి.

ఈ పాలకులు గుజరాత్ రాష్ట్ర అధికారులలో భయ భీతావహాన్ని, పద్ధతుల ఉల్లంఘననూ పెంచడానికి ప్రయత్నిస్తున్నకొద్దీ, సంజీవ్ 2002 బాధితులు న్యాయం కోసం చేస్తున్న పోరాటానికి సహాయం అందించడం కొనసాగించాడు. ఆ బాధితులు గుజరాత్ మారణ కాండ మీద సక్రమమైన న్యాయవిచారణ జరుగుతుందని 2002 నుంచి 2009 వరకూ వేచి చూస్తూ వచ్చారు.

పదవీ బాధ్యతలలో ఉన్న ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారిగా సంజీవ్ కు చాల సున్నితమైన, అధికారిక సమాచారం చాల తెలుస్తూ ఉండేది. ఆ సమాచారాన్ని బైట పెట్టబోనని ప్రమాణం తీసుకున్నందువల్ల, తనకు తెలిసిన ప్రభుత్వ, రాజ్య సమాచారాన్ని ఆయన తగిన అధికారవేదికలు అడిగితే తప్ప మరెక్కడా బైట పెట్టలేదు. తగిన అధికార వేదిక అంటే ఏదైనా న్యాయస్థానం లేదా న్యాయస్థానం నియమించే కమిటీ.

2009 లో గుజరాత్ మారణకాండలో రాజ్యాంగ యంత్రపు పాత్ర గురించి దర్యాప్తు చేయమని న్యాయస్థానం ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (ఎస్ ఐ టి) ని నియమించింది.

రాష్ట్ర అధికారులలో చాల మంది ఎస్ ఐ టి ముందు మాట్లాడుతూ, అప్పుడు జరిగిన సంగతులు తమకు గుర్తు లేవని చెప్పారు. లేదా ఎస్ ఐ టి ముందు తమ వాంగ్మూలం ఇవ్వడానికి నిరాకరించారు. కాగా, సంజీవ్ భట్ ఒక్కడే ధైర్యంగా ముందుకు వచ్చి, తన ప్రాణానికీ, ఉద్యోగ జీవితానికి ప్రమాదం వచ్చినా సరే అని, ఎస్ ఐ టి ముందు, నానావతి – మెహతా కమిషన్ ముందు ప్రమాణపూర్వకంగా వాంగ్మూలం ఇచ్చాడు.

2009: గుజరాత్ మారణకాండలో రాజ్యాంగయంత్రపు సానుకూల పాత్ర గురించీ, పనితీరు గురించీ దర్యాప్తు చేస్తున్న ఎస్ ఐ టి ముందు, నానావతి – మెహతా కమిషన్ ముందు సంజీవ్ వాంగ్మూలం ఇవ్వడం ప్రారంభించాడు.

ఆ వాంగ్మూలాలు 2009 నుంచి 2011 దాకా సాగాయి. ఆయన ఇచ్చిన ప్రకటనలు, ఆయన సమర్పించిన సాక్ష్యాధారాలు వెంటవెంటనే బైటికి పొక్కడం మొదలయింది. ఎస్ ఐ టి, కమిషన్ ముందు వాంగ్మూలం ఇస్తున్న వ్యక్తుల ప్రకటనలను పూర్తిగా అధికారిక, రహస్య సమాచారంగా చూడాలని, దర్యాప్తు సంస్థకు తప్ప మరెవరికీ అవి అందగూడదని చట్టం చెపుతున్నప్పటికీ, ఏ గుజరాత్ ప్రభుత్వ పాత్ర గురించి విచారణ సాగుతున్నదో, ఆ గుజరాత్ ప్రభుత్వానికే ఆ సమాచారం ఎప్పటికప్పుడు అందుతూ వచ్చింది. అంటే ఆ సమాచారం బైటికి పొక్కేలా చేసిన ఎస్ ఐ టి కీ గుజరాత్ ప్రభుత్వానికీ మిలాఖత్తు ఉందని తేటతెల్లమయింది.

ఈ కమిషన్ ల ముందు సంజీవ్ మాట్లాడగూడదని నిరుత్సాహపరచడానికి, బెదిరించడానికి రాష్ట్ర ప్రభుత్వం లోని ఉన్నతాధికారులు లెక్కలేనన్ని ప్రయత్నాలు చేశారు. రాజకీయ యజమానుల కోరిక మేరకే ఆ ఉన్నతాధికారులు ఆ పని చేసి ఉంటారు. కాని సంజీవ్ మాత్రం క్రమం తప్పకుండా, ధైర్యంగా తన వాంగ్మూలాలు ఇస్తూ వెళ్లాడు. తన వ్యక్తిగత, ఉద్యోగపర మూల్యం చెల్లించడానికైనా సిద్ధపడి 2002 హింసాకారకుల మీద న్యాయపరమైన శిక్షలు పడాలని కోరుకున్నాడు.

2011: అప్పటికే కొనసాగుతున్న వాంగ్మూలాలలో భాగంగా, సంజీవ్ సుప్రీం కోర్టులోనూ, జాతీయ మైనారిటీల కమిషన్ ముందూ. ఒక సమగ్రమైన, ప్రమాణపూర్వకమైన వాంగ్మూలం సమర్పించాడు. ఆ వాంగ్మూలంలో గుజరాత్ మారణకాండలో రాష్ట్రప్రభుత్వం లోని అత్యున్నత అధికారుల పాత్ర, పనితీరు గురించీ, అప్పటికి గుజరాత్ రాష్ట్ర హోం మంత్రి అయిన హరేన్ పాండ్యా హత్య గురించీ, అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిని “పరిరక్షించడం” కోసం అనే పేరుతో రాష్ట్రంలో జరిగిన ఎన్నో చట్టాతీత హత్యల గురించీ, బూటకపు ఎన్ కౌంటర్ల గురించీ సవివరంగా రాశాడు.
నరేంద్ర మోడీ పాత్ర గురించి వివరిస్తూ సుప్రీం కోర్టులో ఆ అఫిడవిట్ దాఖలు చేసిన వెంటనే సంజీవ్ ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు.

2002 నుంచీ సంజీవ్ మీద కక్ష సాధింపు చర్యలు సాగుతున్నప్పటికీ, 2011 తర్వాత అవి మరింతగా పెచ్చుమీరాయి.

సంజీవ్ తో పాటు, మా కుటుంబం కూడ ప్రస్తుత పాలకుల నుంచీ, మతవాద శక్తుల నుంచీ లెక్కలేనన్ని బెదిరింపులను ఎదుర్కొన్నాం. సంజీవ్ నోరు నొక్కడానికీ, ఆయన నిశ్చయాన్ని భంగపరచడానికీ చేసే ప్రయత్నాల్లో భాగంగా ప్రస్తుత పాలకులు ఉపయోగిస్తున్న ప్రధాన సాధనం న్యాయవ్యవస్థ నుంచి వేధింపులు.

ఆ వేధింపులు క్రమక్రమంగా పెరిగిపోతూ వచ్చాయి. మోడీ అధికార ప్రాబల్యం పెరుగుతున్న కొద్దీ అవి మరింత దూకుడుగా, ప్రమాదకరంగా మారాయి.

సత్యం మాట్లాడడానికి సాహసిస్తే, తక్షణ ఫలితమేమంటే సంజీవ్ మీద ముప్పై ఏళ్ల కిందటి రెండు పాత కేసులను దురుద్దేశాలతో తవ్వి తీయడం. వాటితో పాటే సంజీవ్ పై అక్రమంగా సస్పెన్షన్ విధించడం. ఆ రెండు పాత కేసుల గురించి తెలుసుకోవడం ముఖ్యం. వాటిలో ఒకటి 1990 నాటిది, రెండోది 1996 నాటిది. ఆ రెండు కేసులనూ ప్రస్తుత ప్రభుత్వం సంజీవ్ ను వేటాడడానికి, తప్పుడు పద్ధతుల్లో ఇరికించడానికి, జైలుకు పంపడానికి వాడుకుంటున్నది. అయితే ఆ రెండు కేసుల మీదా అప్పుడే సంపూర్ణమైన దర్యాప్తు జరిగింది. ఇరవై ఏళ్ల కిందనే వాటి మీద అత్యున్నత న్యాయస్థానం స్టే ఇచ్చింది. తన అధికారులను కాపాడుతూ 1996లోనే గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం రివిజన్ పిటిషన్ వేసింది. కాని హఠాత్తుగా, 2011లో, సంజీవ్ సుప్రీంకోర్టులో మోడీకి వ్యతిరేకంగా ప్రమాణపూర్వకమైన అఫిడవిట్ దాఖలు చేయగానే, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం తన 1996 పిటిషన్ నుంచి తలకిందులుగా వాదించింది. ఆ రివిజన్ పిటిషన్ ను ఉపసంహరించుకుంటున్నానని 16 సంవత్సరాల తర్వాత సుప్రీం కోర్టుకు చెప్పడం పూర్తిగా దురుద్దేశంతో కూడినదే.

రాష్ట్ర ప్రభుత్వానికి సంజీవ్ ను సస్పెండ్ చేయడానికి అధికారం ఉంది గాని, ఆ తర్వాత చర్యలు తీసుకోవడానికి అధికార పరిధి లేదు. ఎందుకంటే ఐపిఎస్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కారు, వారు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి అరువు మీద వచ్చే ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారులు. వారి మీద చర్యలు తీసుకోవడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు మాత్రమే అధికారమూ శక్తీ ఉన్నాయి.

అందువల్ల సంజీవ్ సత్య స్వరాన్ని నొక్కడానికి, తద్వారా ఒక బలమైన ఉదాహరణను చూపడానికి రాష్ట్రప్రభుత్వం ఆ సమయానికి తన చేతిలో ఉన్నదంతా చేసింది. అంటే సస్పెండ్ చేసింది.

2014: భారత ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ అధికారం చేపట్టాడు. ఇప్పుడిక ఆయనకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మీద అధికారం వచ్చింది.

2015: మోడీ ప్రధాన మంత్రి అయిన కొద్ది రోజుల్లోనే సంజీవ్ ను పదవీ బాధ్యతల నుంచి పూర్తిగా తొలగించారు. అందుకు వారు చూపినది “అనుమతి లేకుండా గైరుహాజరు కావడం” అనే హాస్యాస్పదమైన కారణం. ఆయన గైరుహాజరు అయ్యారని చెపుతున్న కాలంలో ఆయన గుజరాత్ మారణకాండలో రాజ్యాంగ యంత్రం పాత్ర, పనితీరుల గురించి దర్యాప్తు చేస్తున్న ఎస్ ఐ టి ముందర, నానావతి – మెహతా కమిషన్ ముందర హాజరై వాంగ్మూలం ఇవ్వడం తన న్యాయపరమైన, నైతికమైన బాధ్యత అనీ, విధ్యుక్త ధర్మమనీ అనుకున్నాడు.

సంజీవ్ ను శిక్షించడం కేవలం 2002 గుజరాత్ మారణకాండలో కొందరు అత్యున్నతాధికారం గలవాళ్ల పాత్ర గురించీ పని తీరు గురించీ భయానకమైన సత్యాన్ని బైటికి తీసుకువచ్చే ధైర్యం చేశాడని మాత్రమే కాదు, ఏ రాష్ట్ర ప్రభుత్వపు చర్యలను దర్యాప్తు చేయడానికి ఎస్ ఐ టి నియామకం జరిగిందో ఆ రాష్ట్ర ప్రభుత్వం తోనే ఆ ఎస్ ఐ టి చేతులు కలిపిందనే వాస్తవాన్ని వెలికి తేవడానికి ప్రయత్నించినందుకు కూడ.

2015-2018: కక్షపూరిత వేధింపు కొనసాగింది.

2018: మోడీకి పాత్రలేదని చెల్లు చీటీ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ శ్రీమతి జకియా జాఫ్రీ సుప్రీం కోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేశారు. 2002 మారణకాండలో మోడీ, ఆయన ప్రభుత్వం నిర్వహించిన పాత్ర గురించి, పని తీరు గురించి మళ్లీ దర్యాప్తు జరిపించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.

2002 మారణకాండలో రాజ్యపు సానుకూల పాత్ర, పనితీరుల గురించి ప్రధాన సాక్షి సంజీవే.

ఒక పక్క శ్రీమతి జాఫ్రీ అభ్యర్థనను వినడానికి సుప్రీం కోర్టు ఆలస్యం చేస్తూ, విచారణను వాయిదా వేస్తూ వచ్చింది. మరొక పక్క, సంజీవ్ కేసులో మాత్రం అత్యంత వేగంగా తప్పుడు ఆరోపణలు తయారు చేశారు, చౌకబారు కారణాలతో ఆయనను అరెస్టు చేశారు. అంటే 2002 గుజరాత్ మారణకాండలో మోడీ పాత్ర గురించి ప్రత్యక్షంగా చెప్పగల ఏకైక ప్రధాన సాక్షి నోరు నొక్కడానికి, ఆయన విశ్వసనీయతను దెబ్బతీయడానికి ప్రయత్నించారు.

2018 జూలై: ఎటువంటి ముందస్తు హెచ్చరిక, వివరణ లేకుండా అకస్మాత్తుగా సంజీవ్ భద్రతా సిబ్బందిని తొలగించారు. నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా సంజీవ్ వాంగ్మూలం ఇచ్చిన తర్వాత సుప్రీం కోర్టు సంజీవ్ కు, మా కుటుంబ సభ్యులకు రాగల ప్రమాదాన్ని అంచనా వేసి ఆయనకు తక్షణమే వై-కాటగరీ భద్రత కల్పించాలని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిందని చెప్పడం ఇక్కడ ముఖ్యం. అయితే సుప్రీం కోర్టు ఆదేశాలను బహిరంగంగా ఉల్లంఘిస్తూ, గుజరాత్ పోలీసులు ఆ భద్రతా వలయం ఏర్పాటు చేయనేలేదు. తమకు అంత మానవ వనరులు లేవని, మౌలిక సౌకర్యాలు లేవని అన్నారు. అందుకు బదులుగా కనీసమైన భద్రత, అంటే ఇద్దరు జవాన్లను మాత్రం, కల్పించారు. ఈ కనీస భద్రతను కూడ ఎటువంటి ముందస్తు హెచ్చరిక, వివరణ లేకుండా అకస్మాత్తుగా 2018 జూలైలో తొలగించారు.

2018 ఆగస్ట్: సంజీవ్ భద్రతా సిబ్బందిని అకస్మాత్తుగా తొలగించిన కొద్ది రోజులకే, మునిసిపల్ కార్పొరేషన్ చట్టవ్యతిరేకంగా మా ఇంట్లోకి జొరబడి, మా ఇంట్లో గణనీయమైన ప్రాంతాన్ని కూల్చివేసింది. అది “అక్రమ” నిర్మాణమని తప్పుడు కారణం చెప్పారు. కాని ఆ ఇంట్లోనే మేం గత 23 సంవత్సరాలుగా ఉంటున్నాం.

2018 సెప్టెంబర్ 5: రెండు దశాబ్దాల వెనుకటి కేసు గురించి ప్రశ్నించడానికనే సాకుతో సంజీవ్ ను తెల్లవారు జామున తీసుకుపోయారు. ఆ కేసులో అంతకు ముందే పూర్తి దర్యాప్తు జరిగింది, న్యాయస్థానాలు ఇరవై ఏళ్ల కిందనే స్టే ఇచ్చి ఉన్నాయి. ఆ కేసులో ప్రశ్నించడానికని తీసుకుపోయి, ఆ తర్వాత కారణమేదీ చూపకుండానే, సరైన పత్రాలు లేకుండానే ఆయనను అరెస్టు చేసినట్టు చూపారు.

సెప్టెంబర్ 2018 తర్వాత: న్యాయస్థానంలో కాలయాపన సాగించడానికి, చట్టబద్ధ విచారణను తలకిందులు చేయడానికి ఈ ప్రభుత్వం చెయ్యని ప్రయత్నం లేదు. అతి తేలికపాటి కారణాలతో సంజీవ్ కు బెయిల్ నిరాకరించారు. అంతేకాదు, మొత్తంగా న్యాయవ్యవస్థనే తలకిందులు చేస్తూ న్యాయమైన విచారణ తిరస్కరించారు. ఆయన ఎన్నడూ చేయని ఒక నేరంలో తప్పుడుగా ఇరికించారు.

2019 జూన్ 20: న్యాయస్థానాల ద్వారా వేధింపు అనే బెదిరింపు సాధనాన్ని వాడుతున్నారు. ప్రభుత్వం సంజీవ్ ను ఇరవై సంవత్సరాల కిందటి కేసులో ఇరికించి ఆయన దాని చుట్టూ తిరిగేలా చేసింది. కాని ఆకేసు కేవలం ఊహాజనితమైనది. ఏ ఒక్క సాక్ష్యాధారమూ లేనిది. న్యాయ భావనను సంపూర్ణంగా ధ్వంసం చేసేది.
ఒకవైపు ఈ పని చేస్తూనే, మరొక వైపు ఒక 30 సంవత్సరాల అక్రమ కేసును తవ్వి తీసి అత్యంత వేగవంతంగా విచారణ జరిపారు. ఆ కేసులో కూడ ఇసుక రేణువంత సాక్ష్యాధారం లేదు. కాని సంజీవ్ కు తన తరఫున సాక్షులను పిలిపించుకునే అవకాశం కూడ ఇవ్వలేదు.

పూర్తిగా తలకిందులుగా సాగిన న్యాయప్రక్రియలో సంజీవ్ ను తప్పుగా ఇరికించి ఆయన ఎన్నడూ చేయని నేరానికి ఆయనకు యావజ్జీవ శిక్ష విధించారు. ఆయన చేసిన నేరం ఒకే ఒక్కటి – రాజకీయ ఒత్తిడికి లొంగకపోవడం. సత్యం కోసం ధైర్యంగా నిలబడడం. ఫాసిస్టు పాలనలో బాధితులైన వేలాది మందికి న్యాయం జరగాలని పోరాడడం.

మత కల్లోలాల సంక్షుభిత వాతావరణంలో కేవలం తన విధ్యుక్త ధర్మానికి ఆదర్శవంతంగా, ఉదాహరణ ప్రాయంగా కట్టుబడిన, సంపూర్ణంగా నిరపరాధి అయిన ఒక వ్యక్తి మీద కక్షసాధింపు విచారణకు ఇంతకన్న కొట్టవచ్చినట్టు చెప్పగల ఉదాహరణ మరొకటి ఉండదు.

తమ గళం విప్పి, ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి సాహసిస్తున్న ఆదర్శవంతులైన స్త్రీలనూ పురుషులనూ ఉదాహరణగా చూపి ప్రజలను భయపెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

సంజీవ్ ప్రాతినిధ్యం వహించిన సత్యం, నిజాయితీ, నిశ్చయం ఈ ఫాసిస్టు పాలకులకు కొరకరాని కొయ్యలుగా మారాయి. దేశంలో అత్యంత శక్తిమంతమైన అధికార స్థానాలు ఆక్రమించి కూడ, వారు నిజాయితీ గల, సత్యశీలత గల ఒక అధికారి నోరు నొక్కడానికి, ఆ గళం ఎప్పటికీ వినిపించకుండా చేయడానికి, ఆయన చెప్పే సత్యం బైటికి రాకుండా ఉండడానికి ఏ ఒక్క ప్రయత్నాన్నీ వదిలిపెట్టడం లేదు.

అసాధారణమైన ఒత్తిడిలో, ప్రమాదంలో కూడ సంజీవ్ ఎన్నడూ వెనుకడుగు వేయలేదు, యుద్ధరంగాన్ని వదిలిపెట్టలేదు.

ఆయన తలచుకుంటే మరొక రాష్ట్రానికి బదిలీ సాధించి ఉండేవాడే, తన ఇంట్లో, మాతో, కుటుంబ సభ్యులతో అన్ని సౌఖ్యాలూ అనుభవిస్తూ సుఖంగా ఉండేవాడే. కాని అందుకు బదులుగా, అత్యంత తీవ్రమైన వ్యక్తిగత, ఉద్యోగ ప్రమాదాలను కూడ కొనితెచ్చుకుని ఆయన స్థిరంగా నిలబడి ఉండడానికే ఎంచుకున్నాడు. ద్వేషకారకులనూ, హింసాకారకులనూ ఎదిరించే పోరాటాన్ని కొనసాగించదలిచాడు. గుజరాత్ మారణకాండలో బాధితులైన వేలాది మంది వేదనకు ముగింపు పలకాలనీ, న్యాయం సాధించాలనీ ప్రయత్నించాడు.

ఇప్పుడు 2022 లో ఉన్నాం. శ్రీమతి జాఫ్రీ కేసు సుప్రీం కోర్టు ముందర ఇంకా ఎదురుచూస్తూనే ఉంది.

ఈ ప్రభుత్వం అక్రమంగా సంజీవ్ ను నిర్బంధించి ఇవాళ్టికి మూడు సంవత్సరాల, ఐదు నెలల, ఇరవై రోజులు, 1269 రోజులు.

న్యాయం కోసం మా అన్వేషణ కొనసాగుతూనే ఉన్నది.

సంజీవ్ చేసిన మహత్తర త్యాగాల మంచుకొండ అంచుల ఛాయలను నాతో పాటు మీరు నడిచిన ఈ తలపుల తోవలో మీ దృష్టికి తేగలిగాననుకుంటున్నాను. సంజీవ్ ఆ త్యాగాలు చేసిన ఆశయం ఏ ఒక్క వ్యక్తి కన్నా మహత్తరమైనది.

సంజీవ్ నాకు తెలిసినవారందరిలోనూ అత్యంత సాహసికుడైన, శక్తిమంతుడైన మనిషి. ఈ ద్వేష, హింసా కారకులను న్యాయం ఎదుటికి తేవాలని ఆయన చేస్తున్న పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఆయన కుటుంబ సభ్యులుగా మేం ఆయనకు సంఘీభావం ప్రకటించే లక్షలాది మంది శ్రేయోభిలాషులతో కలిసి స్థిరంగా ఆయన నిశ్చయంతో నిలిచే ఉంటాం.

మా ఒంటి నిండా నెత్తుటి గాయాలుండవచ్చు. మేం క్షతగాత్రులమై ఉండవచ్చు. మేం దెబ్బలు తిని ఉండవచ్చు. కాని మేమింకా విరిగిపోకుండా, తల వంచకుండా, చెదిరిపోకుండా నిలిచే ఉన్నాం.

(తెలుగు: ఎన్ వేణుగోపాల్)

#FreeSanjivBhatt #JusticeforSanjivBhatt #EnoughIsEnough

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »