మంత్రివర్గ విస్తరణపై ప్లాన్ బీ
హైదరాబాద్, నిర్దేశం:
తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై.. చాలామంది మంది నేతలు ఆశలు పెట్టుకున్నారు. అమాత్య పదవి కోసం ఇప్పుడు వాళ్లంతా సరికొత్త వ్యూహాన్ని ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వంలో ఆరు బెర్తులు ఖాళీగా ఉండగా.. వీటిని దక్కించుకోవడం కోసం నేతలు వ్యూహ ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. నేరుగా మంత్రి పదవి కావాలని అడుగుతూనే.. ప్లాన్ Bలో భాగంగా మరో ఎత్తుగడ వేస్తున్నారు. దీనిపై పార్టీలో ఆసక్తికర చర్చ మొదలైంది. ఇంతకీ మంత్రి పదవి రేసులో ఉన్న నేతలు ఎవరు.. వాళ్లు అనుసరిస్తున్న స్ట్రాటజీ ఏంటి..తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి.. ఏడాదిన్నర కావొస్తోంది. ఇప్పటికీ పూర్తి స్థాయిలో మంత్రివర్గం లేకుండానే.. ప్రభుత్వం రన్ అవుతోంది. ఖాళీగా ఉన్న బెర్తులను భర్తీ చేయాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. దీంతో ఖాళీగా ఉన్న ఆరు స్థానాల కోసం.. భారీ పోటీ కనిపిస్తోంది. ఇప్పటికే ఢిల్లీ వెళ్లి కొంతమంది నేతలు… అధిష్టాన పెద్దల ముందు తమ మనసులో కోరిక బయట పెట్టుకున్నారు. ఇదంతా ఒక వైపు చేస్తూనే.. మరోవైపు ప్లాన్ B ఫాలో అవుతున్నారు. మంత్రి పదవి విషయంలో పార్టీపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇదే ఇప్పుడు పార్టీలో కొత్త చర్చకు దారి తీస్తోంది.ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి.. మంత్రి పదవిపై కన్నేశారు. ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. ఐతే ఇప్పుడు ప్లాన్ B ఫాలో అవుతున్నారు. మంత్రి పదవి విషయంలో రంగారెడ్డి జిల్లాకు అన్యాయం చేయొద్దనే నినాదం అందుకున్నారు. రాష్ట్ర జనాభాలో 42శాతం జనాభా.. ఒక్క ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే ఉందని.. దీంతో తనకు మంత్రిపదవి ఇవ్వాలని కోరుతున్నారు. తనకు మంత్రి పదవి ఇచ్చేందుకు సామాజిక సమీకరణాలు అడ్డుగా మారితే.. తాను రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమంటున్నారు.తన నియోజకవర్గం నుంచి పార్టీ ఎవరిని సూచిస్తే వారిని గెలిపిస్తానని.. వారికైనా మంత్రి పదవి కట్టబెట్టాలని సూచిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు కూడా ఇదే వరుసలో ఉన్నారు. జిల్లాలో పార్టీ కోసం పడిన కష్టాన్ని లెక్కలోకి తీసుకోవాలని.. తనకు కేబినెట్లో ఛాన్స్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. మంత్రి పదవి దక్కకపోతే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని పార్టీ సీనియర్లు, సన్నిహితుల దగ్గర చెప్తున్నారట.ఇక మంత్రి పదవుల విషయంలో.. గతంలో తమకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్ పట్టుబడుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ అగ్రనేతలను కలిసి.. తమకిచ్చిన హామీలను గుర్తు చేశారు. భువనగిరి పార్లమెంట్ గెలిపించుకొని వస్తే మంత్రి పదవి ఛాన్స్ ఉంటుందని.. లోక్‌సభ ఎన్నికల సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌కు పార్టీ పెద్దలు హామీ ఇచ్చారట.ఆ విషయాన్ని పదేపదే గుర్తుచేస్తూ.. పార్టీపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు రాజగోపాల్. ఇక బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చేప్పుడు తనకు మంత్రి పదవి హామీ ఇచ్చారని.. దాన్ని నిలబెట్టుకోవాలని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కూడా పార్టీపై ప్రెషర్ పెంచినట్లు తెలుస్తోంది. ఇక అటు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్‌రావు కూడా.. రాహుల్ కోటరి నుంచి ఒత్తిడి తీసుకొస్తున్నారట.ఇక అటు ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య కూడా.. యాదవ సామాజికవర్గానికి కేబినెట్లో స్థానం కల్పించాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఉమ్మడి ఏపీలో యాదవ సామాజికవర్గానికి ఖచ్చితంగా అవకాశం ఉండేదని.. ఇప్పుడు తనకు అవకాశం కల్పించాలని పట్టినపట్టు వీడడం లేదని టాక్. ఇక ఈ మధ్య సీనియర్ నేత వీహెచ్ ఇంట్లో మున్నురు కాపు సామాజికవర్గ నేతల సమావేశం జరిగింది. మున్నూరుకాపు ఈక్వేషన్లో భాగంగా.. మంత్రి పదవి కోసం ఆది శ్రీనివాస్ కూడా ఒత్తిడి పెంచుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఓవరాల్‌గా అగ్రనేతలను కలవడం, విన్నపాలు వినిపించుకోవడంతో పాటు.. పార్టీ మీద ఒత్తిడి తీసుకువచ్చేలా ప్లాన్ బీతో నేతలు సరికొత్త వ్యూహాల అమలు చేస్తున్నారు. మరి ఇది వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి