సౌత్ హైదరాబాద్ పరుగులు
హైదరాబాద్, నిర్దేశం:
రైజింగ్ తెలంగాణ పేరుతో రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.. మరో భారీ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ప్రస్తుత రింగ్ రోడ్డు నుంచి త్వరలోనే నిర్మించనున్న రీజినల్ రింగ్ రోడ్డుకు అనుసందానంగా దాదాపు.. 41.5 కిమీ మేర నిర్మించనున్నారు. దీనికి దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా పేరును పెట్టాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు కోసం ఏకంగా రూ.4.030 కోట్ల మేర ఖర్చు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అంచనాలు రూపొందించగా.. హైదరాబాద్ నగరాన్ని దక్షిణం వైపు విస్తరించాలన్న రేవంత్ ఆలోచనలకు ఈ ప్రాజెక్టు కీలకంగా పని చేస్తుందని అంటున్నారు.హైదరాబాద్ ను అంతర్జాతీయ నగరంగా రూపొందించాలనే ప్రణాళికల్లో నుంచి పుట్టుకు వచ్చిన ఫూచర్ సిటీ నిర్మాణంతో పాటుగా మహానగరాన్ని అన్ని వైపులా విస్తరించాలన్నది సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళిక. అందుకు తగ్గట్టుగానే.. ఓవైపే నెలకొన్న పరిశ్రమలు, ఐటీ సెక్టార్ వంటి రంగాలను నగరం చుట్టూరా విస్తరించేందుకు.. ప్యూఛర్ సిటీని శంషాబాద్ వైపు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఆలోచనలకు కొనసాగింపుగా.. మరో భారీ గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణానికి రేవంత్ రెడ్డి పచ్చజెండా ఊపారు. ఇందులో భాగంగా.. ప్రస్తుతం నగరం చుట్టూ ఉన్న రీజినల్ రింగ్ రోడ్డు రావిర్యాల ఇంటర్ ఛేంజ్ నుంచి ఆమన్ గల్ దగ్గర ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు వరకు దాదాపు 41.05 కి.మీ మేర నిర్మించనున్నారు. ఓఆర్ఆర్ – ఆర్ఆర్ఆర్ మధ్య అనుసంధానంగా ఈ నూతన హైవే ఉండాలన్నది సర్కార్ ఆలోచనగా కనిపిస్తోందిప్రస్తుత మహానగరానికి ఓఆర్ఆర్ బాటలు వేస్తే.. భవిష్యత్ విశ్వనగర ఆవిష్కరణలో ఆర్ఆర్ఆర్ కీలక పాత్ర పోషిస్తుందన్నది తెలంగాణ ప్రభుత్వ ఆలోచన. అందులో భాగంగానే.. నిర్మించ తలపెట్టిన ఫ్యూచర్ సిటీ, ఆదిభట్ల వంటి కీలక ప్రాంతాల నుంచి ఆమన్ గల్, దాని సమీప ప్రాంతాలకు రవాణాను సులభతరం చేయొచ్చని భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్టు అయిన ప్యూచర్ సీటీకి సకల సౌకర్యాలు, అన్ని వైపుల నుంచి ప్రయాణ మార్గాల్ని అనుసంధానించేందుకు.. ఈ రహదారి నిర్మించాలని ఆలోచిస్తున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతల్ని రేవంత్ సర్కార్.. హైదరాబాదా మెట్రో డెవలప్ మెంట్ అథారిటీ , హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ లకు అప్పగించారు.రేవంత్ సర్కార్ యుద్ధ ప్రాతిపదికన నిర్మించాలని తలపెడుతున్న ఈ ప్రాజెక్టు కోసం ఫిబ్రవరి 28 నుంచి HMDA బిడ్లు ఆహ్వానించనున్నట్లు తెలిపింది. ఈ భారీ ప్రాజెక్టు నిర్మించేందుకు అర్హులైన బిడ్డర్లు, ఏజెన్సీలు కొటేషన్లు సమర్పించాలని కోరారు. కాగా.. ఈ రతన్ టాటా రేడియల్ రహదారిని రెండు ఫేజ్ లలో నిర్మించనున్నారు. ఇందులో మొదటి భాగాన్ని ఓఆర్ఆర్ దగ్గరి రావిర్యాల నుంచి మీర్ ఖాన్ పేట్ వరకు 19.2 కి.మీ నిర్మించనున్నారు. ఇందుకోసం రూ.1,665 కోట్ల అంచనా వ్యయాన్ని ఖర్చు చేయనున్నారు.రెండో దశలో మీర్ ఖాన్ పేట నుంచి ఆమన్ గల్ దగ్గరి ప్రతిపాదిత ఆర్ఆర్ఆర్ రోడ్డు వరకు 22.30 కి.మీ నిర్మించనున్నారు. ఇందుకోసం రూ. 2,365 కోట్లను వెచ్చించనున్నట్లు సమాచారం. రేవంత్ సర్కార్ తలపెట్టిన ఈ ప్రతిపాదత రహదారిని 6 లేన్లతో నిర్మించనుండగా.. ఇది ఇబ్రహీం పట్నం, మహేశ్వరం,కందుకూరర్, యాచారం, కడ్తాల్, అమన్ గల్ మండలాలతో పాటు రంగారెడ్డి జిల్లాలోని 14 గ్రామాల నుంచి వెళ్లనుంది.