ఈసారైనా డీఎస్పీ గంగాధర్ కు న్యాయం జరిగేనా..?
– పట్టభద్రుల ఎన్నికలలో గంగాధర్ కు అన్యాయం..
– గెలిచే అభ్యర్థిని కాదని ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి టికెట్
– ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కోటాలోనైనా మరో చాన్స్ దక్కేనా..?
నిర్దేశం, హైదరాబాద్ః
అవసరం కోసం రాజకీయ పార్టీలు ఏమైనా చేస్తుంటాయి. ఆ సందర్భంలో తప్పిదాలు చేస్తుంటాయి. అయితే వాటికి కూడా అప్పుడో ఇప్పుడో సవరణకు అవకాశం ఉంటుంది. ముందుగా తప్పు జరిగినా, సమయం వచ్చినప్పుడు సరిదిద్దుకోకపోతే ప్రజల విశ్వాసం అగాధంలో పడుతుంది. బహుశా.. దేశంలో కాంగ్రెస్ పార్టీ నేడు ఎదురీదుతోందంటే.. గతంలో చేసిన తప్పులే కారణం. పైగా, వాటికి ఏమాత్రం సవరణ కూడా చేసుకోకపోతే కాంగ్రెస్ పార్టీకే నష్టం.
గంగాధర్ కు అన్యాయం
ఇక విషయంలోకి వస్తే.. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలుపు ధ్యేయంగా ముందుకు వెళ్లిన డీఎస్పీ గంగాధర్ ను బుజ్జగించి.. బుదిరికిచ్చి.. భవిష్యత్ కు హామి ఇచ్చి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు హామిలు ఇచ్చి కాంగ్రెస్ కండువ కప్పారు. కాంగ్రెస్ పెద్దల హామి మేరకు గంగాధర్ తన నామినేషన్ ను విరమించుకున్న తరువాత పట్టించుకున్న దాఖాలాలు లేవు. మొన్నటి కరీంనగర్ గ్రాడ్యూయేట్ ఎన్నికల్లో టికెట్ విషయంలో కూడా ఇదే జరిగింది. డీఎస్పీ గంగాధర్ ను ఊరించి, ఉపసంహరించి, చివరికి నట్టేట వదిలేసింది. వాస్తవానికి కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించిన గంగాధర్ కు చేదు అనుభవం ఎదురైంది. ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చుకుంది. ఎంతమాత్రం అధైర్య పడకుండా ఒంటరిగానే బరిలోకి దిగాడు గంగాధర్. ఐదు నెలలు క్షేత్రస్థాయిలో పని చేసి స్వతంత్ర్య అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగారు. ఐపీఎస్ క్యాడర్ కు వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ.. రాజకీయాల్లో ఏదో చేద్దామనే ఆశతో వచ్చానని గంగాధర్ ఎన్నికల ప్రచారం చేయడంతో గ్రాడ్యువేట్ల నుంచి భారీగా స్పందన వచ్చింది. ఆయనకు ప్రజల్లో ఆదరణ పెరిగింది. దాదాపు అన్ని వర్గాల నుంచి వస్తున్న ఆదరణ వల్ల గెలుపుపై ఆశలు పెంచుకున్నారు గంగాధర్. అయితే గంగాధర్ కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి కాంగ్రెస్ బిత్తర పోయింది. ఇంటలీజెన్స్, ఇండిపెండెంట్ సర్వేలలో గంగాధర్ అగ్రగామిగా ఉండడంతో, నరేందర్ రెడ్డి గెలుపుకోసం గంగాధర్ ను మభ్యపెట్టి కాంగ్రెస్ కండువా కప్పారు. చివరికి ఆయనను పట్టించుకోకుండా వదిలేశారు. గంగాధర్ మేనిఫెస్టోను అమలు చేస్తామని ఇచ్చిన హామీని పూర్తిగా బుట్టదాఖలు చేశారు.
తప్పును సరిదిద్దుకునే అవకాశం
ఇక ఈ అన్యాయాన్ని సరిదిద్దుకునే అవకాశం అత్యంత తొందరగా కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. తొందరలో తెలంగాణలో ఎమ్మెల్యే కోటా కింద 5 ఎమ్మెల్సీలు రాబోతున్నాయి. ఎమ్మెల్యేల సంఖ్యాపరంగా చూసుకుంటే ఇందులో కాంగ్రెస్ పార్టీకి 4 స్థానాలు దక్కే అవకాశం ఉంది. ఇక విపక్ష బీఆర్ఎస్ కు ఒకటి వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ గెలుచుకునే 4 స్థానాల్లో ఒక ఎమ్మెల్సీగా డీఎస్పీ గంగాధర్ ను తీసుకోవచ్చు. అంతే కాకుండా.. చాలా కాలంగా కాంగ్రెస్ భుజాలు ఎగరేసుకుంటున్న సామాజిక న్యాయంపై కూడా అనేక విమర్శలు ఉన్నాయి. అట్టడుగు బుడ్గ జంగం సామాజిక వర్గం నుంచి వచ్చిన గంగాధర్ ను ఎమ్మెల్సీగా ఎన్నుకోవడం వల్ల ఇటు సొంతంగా జరిగిన తప్పుతో పాటు, కాంగ్రెస్ చేసుకుంటున్న ప్రచారానికి కూడా ఒకేసారి న్యాయం చేసినట్లు ఉంటుంది.
గంగాధర్ కోసం ఉద్యమం
డీఎస్పీ గంగాధర్ కు జరిగిన అన్యాయంపై కొంత కాలంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తన తప్పును సరిదిద్దుకోవాలని డిమాండ్లు వస్తున్నాయి. ముఖ్యంగా ఎస్సీ, బీసీ సంఘాలు వరుస ప్రెస్ మీట్లు పెడుతూ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. గ్రాడ్యూయేట్ ఎన్నికల్లో అన్యాయం చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోటాలోనైనా డీఎస్పీ గంగాధర్ కు అవకాశం ఇవ్వాలని డిమాండ్ పెరుగుతుంది.