ఎస్ఎల్బీసీ ఘటన లో ప్రభుత్వం ఘోరంగా విఫలం
మాజీ మంత్రి హరీష్ రావు
హైదరాబాద్, నిర్దేశం:
మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలోని ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన బిఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు గురువారం నాడు ఎస్ఎల్బీసీ ఘటన స్థలానికి వెళ్లారు. అంతకు ముందు కోకాపేట్ లోని తన నివాసం వద్ద హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ఎస్ ఎల్ బి సి ఘటనలో సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైంది.దాదాపు ఐదు రోజులు పూర్తవుతున్నప్పటికీ సహాయక చర్యలు కనీసం ప్రారంభం కాలేదు.వివిధ ఏజెన్సీల మధ్య సమన్వయన్ని సాధించడంలో కూడా ప్రభుత్వం ఫెయిల్ అయింది.
కేంద్ర ప్రభుత్వ బృందాలు, రాష్ట్ర ప్రభుత్వ బృందాలు, ఏజెన్సీ మధ్య సమన్వయం లోపించింది.వీరికి డైరెక్షన్ ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది.మంత్రులు అక్కడికి వెళ్లి హెలికాప్టర్లలో టీవీ ఇంటర్వ్యూలు ఇవ్వడానికి పోటీ పడుతున్నారు తప్ప, సహాయక చర్యలు చేపట్టడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. పైనుంచి హెలికాప్టర్ లో చూస్తే సొరంగం లోపల ఏమన్నా కనిపిస్తాదా, ప్రత్యేకంగా చూడడానికి వీఎక్స్ రే కెమెరాలు ఉన్నాయా? హెలికాప్టర్లలో చెక్కర్లు కొట్టుడు టీవీ ఇంటర్వ్యూలు ఏమిటో నాకు అర్థం కావడం లేదు. వారి ప్రాణాలు కాపాడటానికి ప్రతి నిమిషం కూడా చాలా ముఖ్యమైనటువంటిది. క్షణం కూడా చాలా విలువైనటువంటిది.ఎంత తొందరగా సహాయక చర్యలు ప్రారంభించడం ద్వారా వాళ్ల ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేయాలని అన్నారు.
లోపల ఆహారం లేక తాగునీరు లేక చావు బ్రతుకుల మధ్య కొట్టాడుతున్నారు.
వారి ప్రాణాల మీద రాష్ట్ర ప్రభుత్వానికి శ్రద్ధ కరువైంది ఏమో అనిపిస్తుంది. సహాయక చర్యలు ఇప్పటికీ ప్రారంభం కాకపోవడం దారుణం. ప్రమాదం జరగటం దురదృష్టకరం, ఇలాంటి పరిస్థితుల మధ్య ఘటన జరిగింది ఆ విషయాలన్నీ బయటికి రావాలి. జరిగిన సంఘటన తర్వాత ప్రభుత్వ స్పందన బాధాకరంగా ఉంది. రేవంత్ రెడ్డి హెలికాప్టర్ వేసుకొని ఎన్నికల ప్రచారానికి వెళ్లిండు. ఎనిమిది మంది ప్రాణాలు ముఖ్యమా? ఎన్నికల ప్రచారం ముఖ్యమా రేవంత్ రెడ్డికి? కనీసం అక్కడికి వెళ్లి, ఒక డైరెక్షన్ ఇవ్వడంలో రేవంత్ రెడ్డి, నీటి పారుదల మంత్రి పూర్తిగా ఫెయిలయ్యారని మండిపడ్డారు.