శివా..శివా….
పూజ చేసుకొని వచ్చేసరికి …మాయం
నిజామాబాద్, నిర్దేశం:
మహా శివరాత్రి వేళ భక్తులు ఆలయాల దారి పడితే, దొంగలు మాత్రం భక్తుల ఇంటి దారి పట్టారు. కేవలం రెండు గంటల వ్యవధిలో మూడు గృహాలలో పట్టపగలు చోరీకి పాల్పడడం సంచలనంగా మారింది. శివరాత్రికి శైవక్షేత్రాలలో పూజలు నిర్వహించేందుకు భక్తులు వెళ్లిన సమయంలో అపరిచితులు గృహాలలోకి ప్రవేశించి డ్యూటీ చేశారు. ఈ చోరీలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.లోని ఏకశిలా నగర్ పెద్దమ్మ గుడి, గంగస్థాన్, ఆర్టీసీ కాలనీలలో బుధవారం చోరీ జరిగింది. మొత్తం 3 గృహాలలోకి ప్రవేశించిన అపరిచితులు నగదుతో పాటు, బంగారు నగలను చోరీ చేసినట్లు తెలుస్తోంది. మహా శివరాత్రి కావడంతో 3 గృహాలకు తాళాలు వేసి ఇంటి యజమానులు దగ్గర లోని శివాలయానికి పూజలు నిర్వహించేందుకు వెళ్లారు. ఇదే తగిన సమయం అనుకున్న వారు పట్టపగలు 3 గృహాల తాళాలను పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. ఏకశిలా నగర్ పెద్దమ్మ గుడి సమీపంలో గల ఓ ఇంట్లో చొరబడి రూ. 60 వేల నగదు, గంగస్థాన్ లో గల ఇంటిలో 25 తులాల బంగారు నగలు, ఆర్టీసీ కాలనీలో గల ఓ ఇంటిలోకి ప్రవేశించి 4 తులాల బంగారు ఆభరణాలు చోరీ చేసినట్లు సమాచారం. ఈ మూడు చోరీలు ఒకే తరహాలో జరగడంతో, ఒకే ముఠా చోరీలకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.పూర్తి చేసుకొని తమ ఇళ్లకు వచ్చిన యజమానులు తాళాలు పగలగొట్టి ఉండడాన్ని గమనించి షాక్ కు గురయ్యారు. ఆ తర్వాత దొంగలు పడినట్లు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. అలాగే చోరీకి గురైన సొమ్ము గురించి ఇంటి యజమానుల ద్వారా వివరాలు ఆరా తీశారు. స్థానికంగా గల సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించి ద్విచక్ర వాహనంపై దొంగలు వచ్చి లూటీ చేసినట్లు గుర్తించారు. పట్టపగలు చోరీలు జరగడంతో పోలీసులకు దొంగలు ఛాలెంజ్ విసిరినట్లుగా భావించవచ్చు. సాధ్యమైనంత త్వరగా దొంగలను అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని ఇంటి యజమానులు కోరుతున్నారు.సీసీ కెమెరాలలో గల ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఇప్పటికే దొంగల కోసం వేట మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అయితే శివరాత్రి కావడంతో పోలీసులు ఆలయాల బందోబస్తు విధుల్లో ఉన్న సమయం అనుకూలంగా మార్చుకొని చోరీలు జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు క్లూస్ టీమ్ ద్వారా కూడా ఆధారాలు సేకరించి, సాధ్యమైనంత త్వరగా వారిని పట్టుకొనేందుకు గాలింపు చేపట్టారు. కేవలం రెండే రెండు గంటల వ్యవధిలో చోరీలు జరిగినట్లు గుర్తించిన పోలీసులు కూడా షాక్ కు గురయ్యారు. ఇంత ఫాస్ట్ గా చోరీలకు పాల్పడిన వారు తప్పక చోరీలు చేయడంలో టాలెంట్ ఉన్న వారేనని స్థానికులు భావిస్తున్నారు. మొత్తం మీద నిజామాబాద్ లో పట్టపగలు చోరీ జరగడంతో పోలీసులు నిఘా పెంచారు.