లిఫ్ట్ లో ఇరుక్కున్న చిన్నారి మృతి
హైదరాబాద్, నిర్దేశం:
రెండున్నర గంటల రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి ఆ బాలుడిని లిఫ్ట్ లో నుండి బయటకు తీశారు. కానీ మృతువు మాత్రం బాలుడిని వెంటాడి దరికి చేరింది. అభం శుభం తెలియని ఆ బాలుడు.. చికిత్స పొందుతూ శనివారం తుది శ్వాస విడిచాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని మాసాబ్ ట్యాంక్ శాంతినగర్ లో జరిగింది.హైదరాబాద్ లోని మాసాబ్ ట్యాంక్ శాంతినగర్ లో ఆరేళ్ల బాలుడు లిఫ్ట్ లో ఇరుక్కున్న విషయం తెలిసిందే. ఆ బాలుడిని అగ్నిమాపక సిబ్బంది సుమారు రెండున్నర గంటలకు పైగా శ్రమించి, వైద్యశాలకు తరలించారు. అనంతరం వైద్యుల సలహా మేరకు కుటుంబ సభ్యులు నీలోఫర్ వైద్యశాలకు బాలుడిని తరలించి చికిత్స అందించారు.చికిత్స పొందుతున్న బాలుడు శనివారం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆక్సిజన్ అందక బాలుడి అవయవాలు దెబ్బతినడంతో ఆరోగ్యం మరింతగా క్షీణించి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బాలుడు మృతి పై స్థానిక కార్పొరేటర్ ఖాసిం మాట్లాడుతూ.. బాలుడు లిఫ్ట్ లో చిక్కుకున్నట్లు సమాచారం అందుకున్న వెంటనే జీహెచ్ఎంసీ అధికారులను స్పాట్ కు పిలిపించామన్నారు. ఆ తర్వాత బాబును అతి కష్టం మీద బయటకు తీయడం జరిగిందన్నారు. అనంతరం వైద్యశాలకు తరలించగా, బాబును కాపాడే ప్రయత్నం చేశారని అయినప్పటికీ మృతి చెందడం, దురదృష్టకరమైన ఘటనగా కార్పొరేటర్ విచారం వ్యక్తం చేశారు. కాగా బాలుడు తన తాతతో కలిసి లిఫ్ట్ లో పైకి వస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. బాలుడి మృతి పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా.. అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందా? అయితే తస్మాత్ జాగ్రత్త అంటున్నారు అధికారులు. లిఫ్ట్ సౌకర్యం ఉన్న గృహాలలో చిన్నారుల కదలికలపై పెద్దల దృష్టి ఉండాల్సిన అవసరం ఉంది. చిన్నారులను లిఫ్ట్ లో తీసుకు వెళుతున్న క్రమంలో వారికి లిఫ్ట్ వైపుకు రాకూడదని సూచించాలి. అదే మాటలు అర్థం చేసుకొనే పిల్లలతో లిఫ్ట్ ఉపయోగించే విధానాన్ని వివరించాలి. ఇష్టారీతిన లిఫ్ట్ లో గల బటన్స్ ప్రెస్ చేయరాదని హెచ్చరించాలి. అంతేకాకుండా చిన్నారులు లిఫ్ట్ వైపు వెళ్లిన సమయంలో జరిగే అనర్థాల గురించి వారి మాటల్లోనే వివరించాలి.కొన్ని సార్లు లిఫ్ట్ లో ఉండి బయటకు వచ్చే తీరు తెలియక కూడా చిన్నారులు ఇబ్బంది పడతారు. అందుకు అర్థం చేసుకొనే వయస్సుకు చిన్నారులు వచ్చేంత వరకు వారిని లిఫ్ట్ వైపు పంపించరాదు. మనతో పాటు లిఫ్ట్ లో చిన్నారులు ఉన్నప్పుడు తప్పనిసరిగా ఒక చేతితో వారిని పట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేనియెడల లిఫ్ట్ లో ఏదైనా లోపం తలెత్తితే చిన్నారికి తీవ్ర గాయాలయ్యే అవకాశాలు ఉంటాయి.చాలా వరకు లిఫ్ట్ సౌకర్యం ఉన్న గృహాలలో పదే పదే చిన్నారుల ఆనందం కోసం లిఫ్ట్ లో రాకపోకలు సాగిస్తుంటాం. అలాంటి అలవాటుతో పెద్దల పర్యవేక్షణ లేని సమయంలో చిన్నారులు లిఫ్ట్ లోకి వెళ్లే ప్రమాదం పొంచి ఉంది. ఆటో మేటిక్ లిఫ్ట్ సౌకర్యం ఉన్న సమయంలో చిన్నారులు లిఫ్ట్ లో చిక్కుకున్నా అవి ఎక్కడో ఒక చోట ఆగిపోయే పరిస్థితి ఉంటుంది. కానీ ఆటోమేటిక్ లిఫ్ట్ లేని పరిస్థితుల్లో చిన్నారులపై ఓ కన్ను ఉంచాల్సిందే. శాంతినగర్ లో జరిగిన ఘటనలో ఆరేళ్ల బాలుడు మృతి చెందడం విషాదకరం. మున్ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలని అందరం కోరుకుందాం.