కట్నం కోసం కోడలికి హెచ్ ఐవీ ఇంజక్షన్
లక్నో, నిర్దేశం:
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి కల. పెళ్లి తర్వాత ప్రతి ఒక్కరూ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. వారికో సొంత ప్రపంచం ఏర్పడుతుంది. కానీ వివాహమే ఒకరి మరణానికి కారణమైతే? ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక మహిళ విషయంలో కూడా ఇలాంటిదే జరిగింది. ఆమె అత్తమామలు కట్నం తీసుకురావాలని పెళ్లి అయిన నాటి నుంచే వేధింపులు మొదలు పెట్టారు. వాళ్లు అడిగినంత కట్నం ఇవ్వలేకపోవడంతో.. ఆమెకు హెచ్‌ఐవి సోకిన ఇంజక్షన్ ఇచ్చారు. ఆ తర్వాత పోలీసు శాఖతో సహా మొత్తం జిల్లాలో కలకలం చెలరేగింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ వార్తపై పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు.ఆ మహిళ అత్తమామలపై క్రిమినల్ ఫిర్యాదు నమోదు చేయాలని సహారన్‌పూర్ కోర్టు యుపి పోలీసులను ఆదేశించింది. ఆ మహిళ అత్తమామలు కట్నం డిమాండ్‌ను తీర్చకపోవడంతో ఆమెకు హెచ్‌ఐవి సోకిన ఇంజక్షన్ ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు సహారన్పూర్ నివాసి అని సహరన్పూర్ ఎస్పీ (గ్రామీణ) సాగర్ జైన్ తెలిపారు. ఆమె భర్త, బావమరిది, వదిన, అత్తపై ఐపీసీ సెక్షన్ 307 కింద కేసు నమోదు చేశామని తెలిపారు. ఇది కాకుండా నిందితులపై 498A, 323, 328, 406 సెక్షన్లు కూడా విధించబడ్డాయి.ఆ మహిళ తండ్రి తన కుమార్తెకు ఫిబ్రవరి 2023లో సంప్రదాయబద్ధంగా వివాహం చేసినట్లు తెలిపారు. ఈ పెళ్లికి దాదాపు 45 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినట్లు చెప్పాడు. వరుడికి కట్నంగా సబ్-కాంపాక్ట్ SUV, రూ.15 లక్షల నగదు ఇచ్చారు. కానీ దీని తర్వాత అత్తమామలు రూ. 10 లక్షల నగదు, ఒక పెద్ద SUV కావాలని డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. అందుకోసం తన కూతురును తీవ్ర చిత్ర హింసలకు గురిచేశారని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. 25 మార్చి 2023న, ఆ మహిళను వేధించి, ఇంటి నుండి వెళ్లగొట్టిన తర్వాత, పంచాయతీ నిర్ణయంతో ఆమెను తిరిగి ఆమె అత్తమామల ఇంటికి పంపించారు. కానీ కట్నం మీద ఆశ మాత్రం వాళ్లకు చావలేదు. వారు కోడలి మీద కోపంతో ఎలాగైన చంపాలని నిర్ణయించుకుని ఆమెకు HIV ఇంజెక్షన్ ఇచ్చారు.
ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయిన వెంటనే, నెటిజన్లు తీవ్రంగా రెస్పాండ్ అయ్యారు. విషయం వైరల్ కావడంతో దేశ మంతా చర్చనీయాంశంగా మారింది. నెటిజన్లు అలాంటి వ్యక్తులను అస్సలు వది పెట్టకూడదని.. వారి ఆత్మ వణికిపోయే విధంగా శిక్షించాలని కామెంట్ చేశారు. మరొక యూజర్ …కట్నం గురించి కలలో కూడా ఆలోచించడానికి భయపడే విధంగా శిక్ష విధించాలన్నారు. మరొక నెటిజన్… ఆరోపణలు నిజమైతే శిక్ష మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ కామెంట్ చేశాడు.