హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి
– గాంధీ ఆసుపత్రిలో సర్వం సిద్ధం
నిర్దేశం, సికింద్రాబాద్ :
దేశంలో హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో గాంధీ ఆసుపత్రి యంత్రాంగం అప్రమత్తమైంది. ఆసుపత్రి ప్రధాన భవనంలోని మూడు, నాలుగు అంతస్తుల్లో 40 పడకలతో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేసినట్లు గాంధీ ఆసుపత్రి డిప్యూటీ సూపరిండెంట్ సునీల్ కుమార్ తెలిపారు. వాటిలో పురుషులకు 15, మహిళలకు 5, పిల్లలకు 20 పడకలు కేటాయించింది. హెచ్ఎంపీవీ వైరస్ కరోనా అంత ప్రమాదం కాదని, సాధారణ ఇన్ఫ్లూయెంజా మాత్రమేనని, వెంటనే వ్యాప్తి చెందే ఇటువంటి వైరస్లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆసుపత్రి వైద్యనిపుణులు తెలిపారు. ఈ వైరస్ పట్ల ప్రజలు ఆందోళనకు గురవలసిన అవసరం లేదని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని సూచించారు. నివారణ చర్యలు తీసుకుంటూ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇప్పటివరకు ఈ వైరస్ తో ఒక్క మరణం కూడా సంభవించలేదని అన్నారు.
కొవిడ్ నోడల్ కేంద్రమైన గాంధీ ఆసుపత్రిలో 600 ఆక్సిజన్ పడకలు, 450కి పైగా వెంటిలేటర్లు, 400 మానిటర్లు, సుమారు 40 వేల కిలోలీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులు, వందలాది ఆక్సిజన్ సిలిండర్లు, పీడియాట్రిక్ వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయన్నారు