నిర్దేవం, హైదరాబాద్ః రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం చరిత్రలో బాగుపడిన దాఖలాలు లేదంటారు. దీన్ని శుద్ధ అబద్దమనాలో, శుంట అబద్ధమనాలో అర్థం కావడం లేదు. ఎందుకంటే, ఈ దేశంలో ఇప్పటి వరకు ఏర్పడ్డ ప్రభుత్వాలన్నీ రైతును ఏడ్పించినవే. గట్టిగా మాట్లాడితే ఉరితాడు ఎక్కే వరకు వదిలిపెట్టడం లేదు. విపక్షంలో ఉన్నప్పుడు గదువ పట్టి ఓదార్చినవాడే, అధికారంలోకి రాగానే గొంతు పట్టి నులిమేస్తున్నాడు. ఇతర దేశాల్లో దీన్ని ఏమంటారో తెలియదు కానీ, మన దేశంలో అయితే రాజకీయం అంటారు.
తాజాగా లగచర్లకు చెందిన ఒక రైతుకు పోలీసులు బేడీలు వేసి తీసుకెళ్లడం చర్చనీయాంశం అవుతోంది. లగచర్ల ఘటనలో అరెస్టైన సదరు రైతుకు గుండె నొప్పి రావడంతో హాస్పిటల్ కు తీసుకువచ్చారు. ఆసుపత్రికి తీసుకువచ్చే క్రమంలోనే.. ఏదో ఐసిస్ ఉగ్రవాదిని పట్టుకొచ్చినట్టు బేడీలు వేసి గొలుసుతో బందీగా తీసుకువచ్చారు. ఇంతటి దారుణ పరిస్థితిలో రైతును చూసి తెలంగాణ జనం ఆగ్రహానికి గురయ్యారు. ఒక రైతును ఇలాగేనా బంధించడం అంటూ విమర్శలు గుప్పిస్తారు. సందట్లో సడేమియాలాగ.. ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా స్వరం పెంచి, తీవ్రంగా విరుచుకుపడుతోంది.
దీనికి ముందు 2017 నాటి ఘటన ఒకటి తెలుసుకోవాలి. పండిన పంటలు కొనుగోలు చేయమన్నందుకు అప్పటి గులాబీ పార్టీ ప్రభుత్వం రైతులకు బేడీలు వేసి అరెస్టులు చేయించింది. ఇప్పుడు లగచర్ల ఘటనపై తోడేలు కన్నీరు కారుస్తున్నది ఆ కారు పార్టీవారే. అప్పుడు అన్యాయం, అధర్మం అంటూ ఉదర పంజరంలోని ఎముకలు విరిగేలా గుండెలు బాధుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ నేడు రైతుకు బేడీలు వేసింది.
బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలుగానే కనిపించినా.. చాలా సందర్భాల్లో ఈ రెండు పార్టీలు ఒకేలా కనిపిస్తాయి. ముఖ్యంగా ఎన్నికల హామీలను గోదాట్లో విసిరేయడంలో, అడిగితే అరెస్టులు చేయడంలో, తాము చేసే తప్పులకు ప్రజల్ని నిందించడంలో, ఏమీ చేయకపోయినా ఆడంబరాలకు పోవడంలో దొందూ దొందే. ఇక రేవంత్ రెడ్డి తక్కువ తినలేడు. ప్రతి విషయంలో కేసీఆర్ కంటే ఓ మెట్టు ఎక్కువే ఉండాలని ఆరాటపడుతున్నారు ఆయన. అందుకు బీఆర్ఎస్ హయాంలో జరిగిన రైతుల అరెస్టులను రీకన్ స్ట్రక్ట్ చేస్తున్నారు.
అయినా ప్రజల వెర్రికానీ, కాస్తంత ఓదార్పుగా మాట్లాడితే ఓట్లు కుమ్మరించి అధికారం కట్టబెడుతున్నారు. ఎన్నికల టైంలో గడ్డం పట్టుకున్న నాయకులు.. గద్దెనెక్కాక గుండెలపై తంతున్నాడు. ఇది రిపీటెడ్ గా జరుగుతూనే ఉంది. మోసం చేసే నాయకులు మారుతున్నారు. కానీ, ప్రజలు ఇంకా ఇంకా మోసపోతూనే ఉన్నారు. రైతు ఏడ్చితే రాజ్యం బాగుపడుతుందో లేదో కానీ, రాజకీయ నాయకులైతే హేప్పీగానే ఉంటున్నారు. అది కేసీఆర్ అయినా, రేవంత్ రెడ్డి అయినా.