నిర్దేశం, డమస్కస్ః సిరియాలోని ఓ పాఠశాల గోడపై 14 ఏళ్ల చిన్నారి ఒక లైన్ రాసింది. అరబిక్‌లో వ్రాసిన ఆ లైన్ ఏంటంటే, “ఇప్పుడు మీ వంతు వచ్చింది డాక్టర్” అని. లండన్ లో నేత్ర వైద్యం చదివిన సిరియా అధ్యక్షుడిని ప్రజలు డాక్టర్ అని పిలిచేవారు. 54 ఏళ్ల నియంతృత్వ పాలనను 14 ఏళ్ల పాఠశాల విద్యార్థి ఎలా నాశనం చేశాడు? రష్యా మద్దతు ఉన్నప్పటికీ, సిరియాను బషర్-అల్-అస్సాద్ విడిచిపెట్టి రష్యాలో ఎందుకు ఆశ్రయం పొందవలసి వచ్చింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే, 54 ఏళ్లు వెనక్కి వెళ్లాల్సిందే.
విషయం 13 నవంబర్ 1970 నాటిది. సిరియా వైమానిక దళానికి చీఫ్‌గా హఫీజ్ అల్-అస్సాద్ ఉన్నారు. అతనికి సైన్యంలో మంచి పట్టు ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకున్న హఫీజ్ అసద్ 1970 నవంబర్ 13న అప్పటి ప్రభుత్వాన్ని కూలదోసి తిరుగుబాటు ద్వారా తనను తాను సిరియా అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. అయితే, హఫీజ్ ఎక్కువ కాలం నియంతగా ఉండగలడని అప్పట్లో ప్రజలు ఊహించలేదు. దీనికి కారణం సిరియా మొదటి నుండి సున్నీల జనాభా ఉన్న దేశం. సిరియాలో సున్నీల జనాభా దాదాపు 74 శాతం. కాగా షియాల జనాభా 16 శాతం మాత్రమే. హఫీజ్ అసద్ షియా మతస్థుడు. సున్నీలు ఎప్పుడైనా నిరసన తెలపవచ్చని ఆయనకు తెలియనిది కాదు.
సున్నీలపై తీవ్ర అణచివేత
అందుకే, తిరుగుబాటు అనంతరమే సున్నీలను అణిచివేయడం ప్రారంభించాడు హఫీజ్ అసద్. రాజ్యాంగ పదవుల నుంచి సైన్యం, ఇతర అని విధానాల వరకు ప్రతిదానిలో షియాలు ఆధిపత్యంతో ఉన్నారని మొదటి నుండి ఆరోపణలు వచ్చాయి. కానీ సైన్యంపై అతనికి ఉన్న బలమైన పట్టు కారణంగా, అతని శక్తి చెక్కుచెదరలేదు. దాదాపు 30 ఏళ్ల పాటు సిరియాను పాలించిన హఫీజ్ అల్-అస్సాద్ 2000లో మరణించాడు. అతని తర్వాత, అతని కుమారుడు బషీర్ అల్-అస్సాద్ సిరియా అధ్యక్షుడిగా సింహాసనంపై కూర్చున్నాడు. తరువాతి 10 సంవత్సరాలు, బషర్ అల్-అస్సాద్ కూడా తన తండ్రి విధానాలు, వ్యూహాలను అనురసరించి ప్రతి నిరసనను అణచివేశాడు. ఎట్టకేలకు వ్యతిరేకతను తొలగించుకున్నాడు.
అదే సమయంలో రెండు ప్రధాన సమస్యలు ఏకకాలంలో వచ్చాయి. 2006 నుండి 2010 వరకు తక్కువ వర్షపాతం కారణంగా సిరియాలో తీవ్ర కరువు ఏర్పడింది. వేలాది మంది ప్రజలు ఆకలితో చనిపోయారు. నియంతృత్వం లేకుంటే తమ జీవితం బాగుండేదని వారు భావించారు. మొదటిసారిగా బషర్‌పై ప్రజల హృదయాల్లో అణచివేయబడిన కోపం చెలరేగడం ప్రారంభమవుతుంది. యాదృచ్ఛికంగా, అదే సమయంలో అరేబియాలో కూడా ఒక ఉద్యమం ప్రారంభమైంది. అరబ్ స్ప్రింగ్ అని పిలువబడే ఈ ఉద్యమం చాలా కాలం పాటు నియంతృత్వం ఉన్న దేశాలలో ప్రారంభమైంది. ట్యునీషియా, లిబియా, ఈజిప్ట్, లెబనాన్, జోర్డాన్లలో ప్రజలు వీధుల్లోకి వచ్చారు. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన సందర్భం అది.
14 పిల్లవాడు ఇచ్చిన నినాదం
ట్యునీషియాలో 23 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బెన్ అలీ దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. కల్నల్ గడాఫీని లిబియాలో ప్రజలు చంపారు. 30 ఏళ్ల పాటు ఈజిప్టు నియంతగా ఉన్న హోస్నీ ముబారక్ కూడా దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. సిరియాలో కూడా ప్రజల ఆగ్రహం పెల్లుబికింది. బషర్ అల్-అస్సాద్ కూడా ఈ ప్రమాదాన్ని గ్రహించాడు. సిరియాలో ప్రజలు తిరుగుబాటు చేయకూడదని అనుకున్నాడు. మొత్తం సిరియాపై నిఘా ఉంచాలని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు గొంతు పెంచినా అణిచివేయాలని సైన్యాన్ని ఆదేశించాడు. నిజానికి అప్పటి వరకు సిరియా ప్రశాంతంగా ఉంది.
2010 చివరి నాటికి, అంతా బాగానే ఉందని అస్సద్ భావించాడు. కానీ 14 ఏళ్ల పిల్లవాడు బషర్ అల్-అస్సాద్ 13 సంవత్సరాల తర్వాత సిరియా నుండి పారిపోయేలా చేసింది. ఫిబ్రవరి 26, 2011న ఉత్తర సిరియాలోని దారాలో 14 ఏళ్ల బాలుడు మువావియా సియాసనే తన పాఠశాల గోడపై “ఇప్పుడు మీ వంతు డాక్టర్” అని రాశాడు. ఈ చిన్న లైన్ సిరియాలో పెద్ద ఉద్యమానికి కారణమైంది.
సిరియా నియంతృత్వ ప్రభుత్వం చిన్నారిపై ఇలా దారుణంగా ప్రవర్తించింది
అనేక అరబ్ దేశాల నియంతల ముగింపు అనంతరం.. చిన్నారి రాసిన ఆ లైన్ బషర్ అల్-అస్సాద్ ప్రభుత్వాన్ని పెద్ద మలుపు తిప్పింది. నిజానికి దారా పట్టణంలో గోడమీద ఈ లైన్ చదవగానే అందరూ భయపడిపోయారు. ముయావియాను తండ్రి దాచిపెట్టాడు. కానీ దారా సెక్యూరిటీ చీఫ్‌కి గోడపై రాసిన ఈ లైన్ గురించి సమాచారం వచ్చింది. ఆ మరుసటి రోజు అంటే 2011 ఫిబ్రవరి 27న స్కూల్ నుండి మొత్తం 15 మంది పిల్లలను అస్సాద్ బలగాలు అపహరించుకుపోయాయి. వారిలో ముయావియా కూడా ఉన్నాడు. ఆ తర్వాత ఈ చిన్నారులపై జరిగిన అకృత్యాలకు అంతులేదు. చిన్నారుల గోర్లు తీసి, కరెంట్ వేసిన నీళ్లలో చేతులు పెట్టి హింసించారు. పిల్లలను తలకిందులుగా వేలాడదీశారు.
సిరియాలో నిరసనలు
ఈ చిన్నారులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ దారా ప్రజలు శాంతియుత ప్రదర్శన ప్రారంభించారు. కానీ పిల్లలను విడిచిపెట్టలేదు. దీనికి విరుద్ధంగా, అసద్ సైన్యం తమ పిల్లలను మరచిపోమని పిల్లల తల్లిదండ్రులకు బహిరంగంగా చెప్పింది. “వేరే పిల్లలను కనండి, మీవల్ల కాకపోతే, మీ మహిళలను మాతో పంపండి” అని బహిరంగంగానే అన్నారు. పిల్లలపై అఘాయిత్యాల గురించి సిరియా రగిలిపోయింది. అనతి కాలంలోనే సిరియా అంతటా నిరసనలు మొదలయి, సిరియి అగ్నిగుండంలా మారింది.
బషర్ అల్-అస్సాద్ ఈ నిరసనను ఆపాలని గ్రహించాడు. చివరకు 45 రోజుల తర్వాత ఏప్రిల్ 2011లో పిల్లలందరినీ విడుదల చేశాడు. అయితే ఇక్కడే కథ మరో మలుపు తిరిగింది. పిల్లలు బయటకు రాగానే వారిపై జరిగిన అకృత్యాలు బయటికి రావడంతో, ప్రజల్లో మరింత ఆగ్రహం పెరిగింది. ఉద్యమం ఉధృతమైంది. పిల్లలను విడుదల చేసిన తర్వాత, మరుసటి శుక్రవారం అంటే 22 ఏప్రిల్ 2011న దారాలోని మసీదులో ప్రార్థనల తర్వాత అస్సద్‌కు వ్యతిరేకంగా బహిరంగంగా నినాదాలు చేయడం ప్రారంభించారు. దీని తర్వాత బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని బుల్లెట్ల వర్షం కురిపించింది. ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. అక్కడి నుంచి వ్యవహారం మరింత వేడెక్కింది.
ఐసీస్ ఏర్పడింది అప్పుడే
ఇప్పటి వరకు ISI అంటే ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ గా ఉండేది. అప్పుడే ISIS గా రూపాంతరం చెందింది. అంటే ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియాగా మారింది. సిరియాలో కుర్దిష్ జనాభా పెద్దగానే ఉంది. ముఖ్యంగా ఈశాన్య సిరియాలో ఫ్రీ సిరియన్ ఆర్మీ తరహాలో కుర్దులు కూడా అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముందుకొచ్చారు. నిజానికి కుర్దుల డిమాండ్ కుర్దిస్థాన్ అనే ప్రత్యేక దేశం. అంటే, ఇప్పుడు సిరియా లోపల ఏకకాలంలో నాలుగు ఫ్రంట్లు తెరుచుకునే పరిస్థితి ఏర్పడింది. అసద్ ప్రభుత్వం నుంచి ఒకటి ఏర్పడగా.. బాగ్దాదీకి చెందిన ISIలో ఒకటి, సిరియన్ ఫ్రీ సైన్యం ఒకటి.. వీటితో పాటు కుర్దిష్ దళాలు. ఇప్పుడు సిరియా అంతర్యుద్ధంలో నిలువునా కాలిపోతోంది.
ఈ తిరుగుబాటుకు అధ్యక్షుడు పారిపోయాడు
ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే.. బయటి దేశాలు తమ స్వప్రయోజనాల కోసం సిరియన్ రంగంలోకి దూకొచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఫ్రీ సిరియన్ ఆర్మీకి సహాయం చేయడానికి చాలా అరబ్ దేశాలు ముందుకు వస్తాయి. అందుకు కారణం సిరియాలో సున్నీలకు మద్దతు ఇవ్వడానికి. ఇరాన్ ఇప్పటికే సిరియాలో అడుగు పెట్టింది. అయితే అసద్ ప్రత్యర్థులకు మద్దతు ఇవ్వడానికి కాదు, అసద్ ప్రభుత్వాన్ని రక్షించడానికి. ఎందుకంటే ఇరాన్ అనేది షియాల అతిపెద్ద దేశం. మరోవైపు, సిరియా అధ్యక్షుడితో రష్యా స్నేహం కోరుకుంది. అస్సాద్లో పుతిన్ స్నేహితుడిని చూశాడు కాబట్టి రష్యా కూడా అసద్‌కు రక్షణగా ముందుకు వచ్చింది.
సిరియాలోకి అమెరికా కూడా అడుగు పెట్టింది. రష్యా మద్దతు ఇచ్చింది కబట్టి.. అమెరికా తప్పకుండా వ్యతిరేక దిశలో వస్తుంది. అలాగే చేసింది. అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమెరికా ప్రకటనలు విడుదల చేస్తోంది. ఇప్పటికీ ఏదో విధంగా అసద్ తన ప్రభుత్వాన్ని కాపాడుకుంటూనే ఉన్నాడు. కానీ సిరియా సైన్యంపై పోరాటం ఇంకా కొనసాగుతోంది. అయితే ఇదే సమయంలో అస్సద్ కు పెద్ద కష్టం వచ్చి పడింది. మిత్రులు ఇరాన్, పుతిన్‌ల మీద అస్సద్ ఆధారపడ్డారు. కానీ, ఆ రెండు దేశాల కథ వేరే ఉంది. పుతిన్ దృష్టి అంతా ఉక్రెయిన్ యుద్ధం వైపే ఉంది. చాలా కాలంగా యుద్ధం సాగుతూనే ఉంది. ఇరాన్ కూడా హిజ్బుల్లాకు మద్దతు ఇచ్చి ఇజ్రాయెల్‌తో యుద్ధంలో చిక్కుకుంది.
11 రోజుల క్రితం సిరియాలో తిరుగుబాటు మళ్లీ ఊపందుకుంది. సిరియా సైనికులు అన్ని పోస్టులను వదిలి పారిపోవడం ప్రారంభించారు. ఈ 11 రోజుల్లోనే సిరియా రాజధాని డమాస్కస్ సహా ఈ విప్లవం ప్రారంభమైన అలెప్పో, హమా, హోమ్స్, దారాతో అనే 5 పెద్ద నగరాలను అస్సద్ కోల్పోయాడు. డిసెంబర్ 8న, 20 ఏళ్లపాటు సిరియాను పాలించిన తర్వాత, బషర్-అల్-అస్సాద్ డమాస్కస్ నుండి చడీచప్పుడు కాకుండా విమానం ఎక్కి మాస్కోలో గుట్టు చప్పుడు కాకుండా దిగిపోయాడు. అసద్‌కు తన ఇంట్లో ఆశ్రయం కల్పించాడు పుతిన్. దాదాపు 2 కోట్ల జనాభా ఉన్న సిరియాలో గత 13 ఏళ్లలో 5 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ముందు కాలంలో సిరియాలో ఏం జరుగుతుందో చూడాలి.
– టోనీ బెక్కల్