డిసెంబ‌ర్ 9న తెలంగాణ త‌ల్లి పుట్టిన రోజేంటి?

నిర్దేశం, హైద‌రాబాద్ః ఎడ్డ‌మంటే తెడ్డమ‌నేది రాజ‌కీయాల్లో వెరీ కామ‌న్. తెలుగు రాష్ట్రాల్లో అయితే చాలా పాపుల‌ర్ కూడానూ. గ‌తంలో కేసీఆర్ గుర్తులేమీ ఉండ‌కుండా చెరిపేస్తాన‌ని ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం తీసుకున్న అనంత‌ర‌మే శ‌ప‌థం చేసిన రేవంత్ రెడ్డి.. తెలంగాణ త‌ల్లి రూపురేఖ‌ల్ని మార్చేశారు. రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాల్లో అత్యంత వివాదాస్ప‌దం అయిన నిర్ణ‌యం ఇదే. ఎందుకంటే, గ‌తంలో ఉన్న విగ్ర‌హం ఉద్య‌మ‌కాలంలోనే రూపొందించింది. అప్పుడు కాంగ్రెస్ ఆ విగ్ర‌హాన్ని ఒప్పుకోలేదు. కానీ, దానిపై ఎప్పుడూ రాద్దాంతం చేయ‌లేదు. ఇదిలా ఉంటే.. విగ్ర‌హం మార్పు ఒక వివాద‌మైతే.. ప్ర‌తి ఏటా డిసెంబ‌ర్ 9న అవ‌త‌ర‌ణ చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. నిజానికి, విగ్ర‌హం మార్పు కంటే ఇదే అత్యంత వివాదాస్ప‌ద అంశం. ఎందుకంటే, డిసెంబ‌ర్ 9న కాంగ్రెస్ మాజీ అధినేత సోనియా గాంధీ పుట్టిన‌రోజు.

కాంగ్రెస్ కు గాంధీ కుటుంబం కంటే దేశం చిన్న‌ది

అంటారు కానీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత దిగ‌జారుడు రాజ‌కీయం మ‌రే పార్టీలో ఉండ‌దు. కాంగ్రెస్ నేత‌ల‌కు గాంధీ కుటుంబాన్ని మించింది ఏదీ ఉండ‌దు. గాంధీ కుటుంబం ముందు దేశం కూడా వారికి చిన్న‌దే. ఇందిరా గాంధీ టైంలో అయితే ‘ఇందిరా అంటే ఇండియా.. ఇండియా అంటే ఇందిరా’ అనేవారు కాంగ్రెస్ నేత‌లు. ఇక తెలంగాణ విష‌యంలో కూడా ఇలాగే జ‌రిగాయి. ఏడాది క్రితం కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన స‌భ‌లో తెలంగాణ త‌ల్లి విగ్ర‌హాన్ని సోనియా పోలిక‌ల‌తో ఏర్పాటు చేశారు. అది చాలా వివాదాస్ప‌ద‌మైంది. పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. బ‌హుశా అందుకేనేమో.. తాజాగా రూపొందించిన విగ్ర‌హంలో సోనియా పోలిక‌లు లేకుండా చేశారు కానీ, తెలంగాణ త‌ల్లి పుట్టిన‌రోజుని సోనియా గాంధీ పుట్టిన రోజునే చేయాల‌నే నిర్ణ‌య‌మే వెగ‌టుగా ఉంది.

కొత్త విగ్ర‌హం మార్పు పెద్ద వివాద‌మే

విప‌క్షాలు ఆరోపిస్తున్నట్లు.. తెలంగాణ త‌ల్లి విగ్ర‌హమార్పు వివాదాస్ప‌దంగానే జ‌రుగుతోంది. భ‌త‌ర‌మాత అయినా, తెలుగు త‌ల్లి అయినా కిరిటీలాతో ఉంటాయి. అయితే, తాజా విగ్ర‌హంలో తెలంగాణ త‌ల్లికి కిరీటం లేదు. అయితే, తెలంగాణ త‌ల్లిని శ్రామిక మ‌హిళ‌గా రూపొందించామ‌ని కాంగ్రెస్ నేత‌లు చెప్పారు. క‌రెక్టే.. కానీ, కిరీటం తొల‌గించినా శ్రామిక మ‌హిళ‌గా మాత్రం తెలంగాణ త‌ల్లి లేదు. ఇక తెలంగాణ త‌ల్లి చేతిలో నుంచి బ‌తుక‌మ్మను తొల‌గించ‌డం దుర్మార్గ‌మే. బతుక‌మ్మ తెలంగాణ ప్ర‌తీక‌. ప్రపంచంలోనే అత్యంత భిన్న‌మైన సంస్కృతి. మ‌రి అలాంటి బ‌తుక‌మ్మ లేకుండా రూపొందించ‌డ‌మేంటి? ఇక‌పోతే, తెలంగాణ త‌ల్లి విగ్ర‌హం రేవంత్ రెడ్డి కూతురిలా ఉంద‌ని, ఆమె కుడిచేయి కాంగ్రెస్ కు ఎన్నిక‌ల గుర్తుకు చిహ్న‌మంటూ విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. వాటికి అంత వెయిటేజీ అయితే ఉండ‌దు.

ప్ర‌జ‌ల కంటే ప్ర‌తీకార‌మే ఎక్కువైంది

రేవంత్ రెడ్డికి ప్ర‌జ‌ల అస‌వ‌రాలు, వారి మ‌నోభావాల కంటే కేసీఆర్ మీద ప్ర‌తీకార‌మే ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. కేసీఆర్ నిర్ణ‌యాల‌కు విరుద్ద‌మైన నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో ఉన్న ఆస‌క్తి, ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో లేదు. మెట్రో అలైన్మెంట్ మార్పు, తెలంగాణ త‌ల్లి విగ్ర‌హం మార్పు, గ‌తంలో రాసిన ప‌రీక్ష‌ల‌కు మ‌ళ్లీ నోటిఫికేష‌న్లు ఇవ్వ‌డం, టీఎస్ నుంచి టీజీకి మార్చ‌డం.. ఇలాంటివి చాలానే తీసుకున్నారు. ఇంకా తీసుకుంటూనే ఉన్నారు. నిజానికి.. ఈ వాతావ‌ర‌ణం మామూలుగా త‌మిళ‌నాడులో, ఆంధ్రాలో ఉంటుంది. కానీ, రేవంత్ రెడ్డి కార‌ణంగా తెలంగాణ‌లో కూడా రాజ్య‌మేలుతోంది. రేవంత్ త‌న టైంలో స‌గం కేసీఆర్ మీదే వెచ్చిస్తున్నారు. ఏదో ర‌కంగా కేసీఆర్ పేరు ఉచ్చ‌రించుకుండా రేవంత్ కు రోజు గ‌డ‌వడం లేదు.

విగ్ర‌హ మార్పుపై బీఆర్ఎస్ నిర‌స‌న‌లు

కాంగ్రెస్‌ ఆవిష్కరించబోయే విగ్రహ నమూనాను విడుదల చేసినప్పటి నుంచి ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ విమర్శలు చేస్తోంది. అధికార పార్టీ రూపొందించిన విగ్రహం తెలంగాణ తల్లి కాదని, కాంగ్రెస్‌ తల్లి అంటూ తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇక గత విగ్రహంలో ఉన్నట్లుగా కిరీటం ప్రస్తుత విగ్రహంలో ఎందుకు లేదంటూ ప్రశ్నిస్తున్నారు. కాగా అధికార కాంగ్రెస్‌కు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కౌంటర్ కార్యక్రమం నిర్వ‌హించింది. సోమవారం సచివాలయంలో ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించింది. ప్రభుత్వానికి కౌంటర్‌గా మేడ్చల్‌లో తెలంగాణ తల్లి పాత రూపం విగ్రహాన్ని బీఆర్ఎస్ ప్రతిష్టించింది. సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో ప్రతిష్టించిన‌ సమయంలోనే.‌. మేడ్చల్ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ తల్లి విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »
error: Content is protected !!