వాడు ఎస్సీవాడు కాబట్టి కరెంట్ బిల్లు ఎక్కువొచ్చింది!

నిర్దేశం, హైదరాబాద్: కరెంట్ మీటర్ ఒక్కోసారి గిర్రున తిరిగి గంపెడు బిల్లు పడుతుంది. దీని గురించి అడిగితే.. ‘టెక్నికల్ ప్రాబ్లం అనుకుంట. చూసి చెప్తాం’ అంటారు. మరి నాగర్ కర్నూల్ ఏఈ గోపాల్ రెడ్డి అయితే ‘‘వాడు ఎస్సీవాడు సార్’’ అంటాడు. అంటే.. ఎంత తక్కువ కులమైతే, అంత ఎక్కువ బిల్లు అన్నమాట. ఒక వ్యక్తికి ఏకంగా రూ.23 వేల కరెంట్ బిల్లు వచ్చింది. సదరు వ్యక్తి పై అధికారులకు కంప్లైంట్ చేశాడు. ఇదేంటని, పై అధికారి ఏఈ గోపాల్ రెడ్డిని అడగ్గా.. ‘‘వాడు ఎస్సీవాడు సార్’’ అన్నాడు.

అంతే.. పై అధికారికి కూడా ఓ క్లారిటీ వచ్చింది. ‘ఏమయ్య.. మాకేమన్నా నీమీద కోపముందా? వాడకుండా అంత బిల్లు ఎందుకొస్తుంది? ముందు బిల్లు కట్టు’’ అంటూ దబాయించడం ప్రారంభించాడు. కులం ఎంత బలమైనది కదా. కులం తెలియకుండా ఫిర్యాదు తీసుకున్నవాడు కూడా తర్వాత కులం తెలియగానే దబాయింపు స్టార్ట్ చేశాడు. బహుశా.. ఎస్సీలకు ఎక్కువ కరెంట్ బిల్లు రావడం ఆ పై అధికారికి కూడా ఇష్టమేనేమో. ఎంత బిల్లు వేస్తే అంత కట్టకుండా తక్కువ జాతి వాడు మళ్లీ ఆర్గ్యూమెంట్ చేయడం కూడానా అన్నట్లు మాట్లాడాడు.

నాగర్ కర్నూల్ జిల్లాలోని చందుబట్ల గ్రామానికి చెందినది ఈ ఘటన. ఒక వ్యక్తి తాను ఊరిలో లేకపోయినా 23 వేల కరెంట్ బిల్లు వేశాడని ఫిర్యాదు చేశాడు. బహుశా.. అతడు కింది స్థాయి అధికారులను ముందే అప్రోచ్ అయి ఉంటాడు. అక్కడ పని తేడా కొట్టే పై అధికారి వరకు వెళ్లి ఉంటాడు. ఎంత పైకి వెళ్తే మాత్రం.. కులం ఉండదా ఏంటి? ఆ పై అధికారికి కంప్లైంట్ చేసిన వాడి కులం తెలీకి కింది అధికారికి ఫోన్ చేసి విషయం ఏంటా అని కనుక్కోబోయాడు. బిల్లు ఎందుకు ఎక్కువొచ్చిందనగానే ఫిర్యాదుదారుడి కులం చెప్పేశాడు. అంతే.. పై అధికారి కూడా సర్దుకుని, ఫిర్యాదుదారుడిని దబాయించాడు.

ఏఈ గోపాల్ రెడ్డి ఎంత ముందు చూపు ఉన్న వ్యక్తో కదా.. ముందే కులం చెప్పాడు కాబట్టి సరిపోయింది. లేదంటే, బిల్లు ఎక్కువ వచ్చినందుకు ఆయనకు చీవాట్లు పడేవి. కులం ఎంత పవర్ ఫుల్ కదా. అవినీతి, అక్రమం కూడా దాని కింద దుగదుడుపే. వాడు ఎస్సీ అన్న ఒక్క మాటతో సీన్ మొత్తం మారిపోయింది. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను.. తెలంగాణ విద్యుత్ శాఖ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతిలోనే ఉంది. దీనిపై విద్యుత్ శాఖ ఎంత మేరకు స్పందిస్తుందో చూడాలి.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »