నిర్దేశం: ఒక వ్యక్తి శారీరక నిర్మాణంపై జోకులు వేయడం, తిట్టడం, హేళన చేయడం మామూలే. అయితే ఇలాంటివి చాలా వరకు నేరాలే. ఇందులో కొన్ని లైంగిక వేధింపుల కిందకు కూడా వస్తాయి. తాజాగా మనం తిట్టుకునే, జోకులు వేసుకునే బట్టతల కూడా ఆ జాబితాలో చేరింది. బట్టతల ఉందని దూషించడం, హేళన చేయడం కూడా లైంగిక నేరమేనని బ్రిటన్ కి చెందిన కోర్టు తీర్పునిచ్చింది. ఉద్యోగిని బట్టతల అంటూ దూషించిన సూపర్‌వైజర్‌ను కోర్టు తీవ్రంగా మందలించింది. ఒక ఉద్యోగి కంపెనీపై కోర్టులో కేసు పెట్టగా, సూపర్‌వైజర్ కోపంతో అతడిని బట్టతల, పనికిమాలిన వ్యక్తి అని పిలిచాడు. అందులో భాగంగానే ఈ తీర్పు వచ్చింది.
పురుషుడిని ‘బట్టతల’ అని పిలిస్తే లైంగిక వేధింపులుగా పరిగణిస్తామని బ్రిటన్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఒక వ్యక్తి గురించి ఈ పదాన్ని ఉపయోగించడం సమానత్వ చట్టాన్ని ఉల్లంఘించడమేనని జడ్జ్ అన్నారు. బాధితుడి పేరు టోనీ ఫిన్. అతడు ఎలక్ట్రీషియన్. 2019లో బ్రిటిష్ బ్యాంగ్ కంపెనీ తనను అవమానించిందని, వివాదం తర్వాత ఉద్యోగం నుంచి తొలగించిందని టోనీ పేర్కొన్నాడు.
2021లో కేసు నమోదైంది
కంపెనీలో ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్న ఉద్యోగి, సూపర్‌వైజర్ జేమీ కింగ్ తనను ‘బట్టతల మనిషి’ అని పిలవడంతో వివక్షకు గురయ్యానని పేర్కొన్నాడు. 2021లో అతడి ఉద్యోగం తొలగించిన తర్వాత, టోనీ కోర్టుకు ఆశ్రయించాడు. ఎవరైనా బట్టతల అని పిలవడం అవమానించడమే కాకుండా లైంగిక వేధింపని కోర్టు పేర్కొంది. మగవాడికి వెంట్రుకలు లేవని వ్యాఖ్యానించడం లేదా అపహాస్యం చేయడం స్త్రీ రొమ్ముల పరిమాణంపై వ్యాఖ్యానించడంతో సమానమని న్యాయమూర్తి అన్నారు.
పురుషులకు బట్టతల ఎక్కువగా ఉంటుంది కాబట్టి పురుషులను దృష్టిలో ఉంచుకుని ఈ వ్యాఖ్య చేశారు. దీన్ని బట్టి లింగాన్ని (పురుష లేదా ఆడ) దృష్టిలో ఉంచుకుని చేసిన వ్యాఖ్య అని చెప్పవచ్చని, అటువంటి సందర్భంలో అది లైంగిక వేధింపుగా పరిగణించబడుతుందని కోర్టు పేర్కొంది. చాలా మంది మహిళలకు వెంట్రుకలు ఉండవని, కొంతమందికి చికిత్స సమయంలో బట్టతల వస్తుందని, మరికొందరికి కొన్ని జబ్బుల వల్ల వెంట్రుకలు ఉండవని డిఫెన్స్ లాయర్ చెప్పారు.