నిర్దేశం, న్యూఢిల్లీ: యూపీఎస్సీలో లేటరల్ ఎంట్రీపై లేచిన వివాదంతో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. లేటరల్ ఎంట్రీని రద్దు చేస్తామని కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. దీనిపై ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై ‘యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్’కి డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ మంత్రి జితేంద్ర సింగ్ లేఖ రాశారు. దీనిలో లేటరల్ ఎంట్రీ ద్వారా రిక్రూట్‌మెంట్ ప్రకటనను రద్దు చేయాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడిన తర్వాత జితేంద్ర సింగ్ ఈ లేఖ రాశారు.
వాస్తవానికి, ఆగస్టు 18న, వివిధ మంత్రిత్వ శాఖల్లో జాయింట్ సెక్రటరీ, డైరెక్టర్, డిప్యూటీ సెక్రటరీ పోస్టులకు 45 మంది స్పెషలిస్ట్‌లను నియమించేందుకు యూపీఎస్సీ రిక్రూట్‌మెంట్‌ను నిర్వహించింది. ఈ రిక్రూట్‌మెంట్లు లేటరల్ ఎంట్రీ ద్వారా జరగాలి. అయితే, ప్రతిపక్షాలు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. రిజర్వేషన్‌లను లాక్కునేందుకు కొత్తగా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారని దుమ్మెత్తి పోశాయి. లేటరల్ ఎంట్రీ రిక్రూట్‌మెంట్ ద్వారా ప్రైవేట్ రంగానికి చెందిన వ్యక్తులు కీలక స్థానాల్లో పనిచేసే అవకాశాన్ని పొందుతారని విమర్శించాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం వెనక్కి తగ్గింది.