కామ్రేడ్ ముత్యంకు విప్లవ జోహార్లు

రచయిత డాక్టర్ ముత్యం ఇక లేరు..                         

తెలుగు సాహిత్య పరిశోధనల్లో ఆణిముత్యం మన డా. కె.ముత్యం ఇకలేరు!ఆయన ఈరోజు 20 ఆగష్టు తెల్లవారుజామున 2-30 గంటల ప్రాంతంలో హైదరాబాద్ లోని తన గృహంలో అంతిమ శ్వాస విడిచారు.

                 ఎక్కడో నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం బాచినపల్లిలో పుట్టి మారుమూల శ్రీకాకుళం జిల్లా లో పరిశోధన చేసి నిరంతర విప్లవ సాహిత్య కృషి వలుడుగాచరిత్రలో నిలిచిపోయారు. ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీ లో ఆర్ట్స్ కళాశాల విద్యార్థి సంఘం అద్యక్షుడు గా ఎన్నికయ్యారు. పిడియస్ యు యాక్టివిస్టుగా నాటి యూనివర్సిటీ  ప్రగతిశీల ఉద్యమానికి పునాది వేశారు. ఆయన శాతవాహన యూనివర్సిటీ లో తెలుగు అధ్యాపకులుగా ఉద్యోగం చేసి, పదవీవిరమణ పొందినప్పటికీ ఆయన జీవితకాలం సాహిత్య పరిశోధకుడు అని చెప్పవచ్చును.

నిన్నటి సమస్యనో, నేటికలనో కవిత్వంగా రాసి, ఒకటో రెండో ముందు మాటలతో ఓ పుస్తకం అచ్చేయించి తనకు పరిచయం ఉన్న వారికి పంచుకున్న కవి కాదు? రాజకీయ నేత పుక్కిట పురాణాలు ఓ వెయ్యి పుటలు లిఖించి పదవులను, పైరవీలను పట్టే రాజకీయ పద్మవ్యూహంలో రచయిత కాదు?? ఏదో ఓ ప్రమాణంలో ఓ గ్రంధం రాసి పైరవీలతో అవార్డులు, రివార్డుల కోసం అర్రులు చాచిన మనిషి  కానే కాదు???మరెవరు ఈయన!?

తన నలుబదేళ్ళ విశ్రాంత సమయాన్ని అవిశ్రాంతంగా శ్రమించి , శోధించి, పరిశోధించి, సాధించి తెలుగు పుస్తక పరిశోధనలో తరించిన మహా సాహితీతపస్వీ! ఆయనే తెలుగు సాహిత్యం పరిశోధన’ ఆణి’ముత్యం మన డా.కె.ముత్యం. ఈయన గురించి, ఈయన పరిశోధనల గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే! ఎక్కడో దక్షిణ తెలంగాణా  నిజామాబాదు జిల్లా సిరికొండ మండలం మారుమూల కొండ క్రింద గ్రామం బాచినపల్లిలో పుట్టి మధ్యలో ఉస్మానియా యూనివర్సిటీ లో మెరిసి, తన ఆరోగ్యాన్ని సైతం పణంగా పెట్టి  కొన్ని వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఉత్తరాంధ్ర చివరి జిల్లా శ్రీకాకుళం కొస ‘బారువా ‘వరకు ప్రయాణించి నిరంతర సాహిత్య పరిశోధనలో భవిష్యత్తు తరాలకు ఎంతో సాధించి పెట్టిన ప్రజా ఉద్యమం సృష్టించుకున్న, ప్రజలు మెచ్చిన చరిత్ర కారుడు,  సాహిత్య సౌరభం  మన డా. ముత్యం.

1958 ఏప్రిల్ 14న జన్మించిన డా.ముత్యం1980-82 మద్య ప్రగతిశీల ఉద్యమం బావుటా గా మెరిసి ప్రతిష్టాత్మక మైన ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల విద్యార్థి సంఘం అధ్యక్షుడు గా ఎన్నికై సుపరిచిత మైనాడు. తనదైన సిద్దాంత నిబద్దత ఆయనను ఉస్మానియా యూనివర్సిటీ లో యంఏ తెలుగు పూర్తి చేసుకొని, పిహెచ్ డి కోసం బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వైపు నడిపించింది. అక్కడ ఆయన “శ్రీకాకుళం ఉద్యమం -తెలుగు సాహిత్యం పై ప్రభావం “ అనే అంశంపై పరిశోధన చేసి 1990లో ఆయన” బెస్టు థీసీస్” అవార్డుతో పిహెచ్ డి పట్టాను పొందారు. ఆయన పరిశోధనాంశంను “శ్రీకాకుళ ఉద్యమం సాహిత్యం “పేరుతో ఎంతో ప్రామాణిక తో కలిగిన పుస్తకం తెచ్చారు.

 ఆయన వృత్తి రిత్యా శాతవాహన యూనివర్సిటీ లో తెలుగు అధ్యాపకులు గా చేరినా ఆయన ప్రవృత్తి మాత్రం సాహిత్య, చరిత్ర పరిశోధనలతో కాలం గడిపిన పరిశోధనా తపస్వీ!? తను ఏదైతే ప్రజల కొరకు నిలబడాలని యూనివర్సిటీ స్థాయిలో నిర్ణయించుకొన్నాడో, ఒక్క ఇంచు కూడా ప్రక్కకు జరగకుండా తన జీవితకాలం ప్రజా పరిశోధకుడిగా, చిత్రకారుడిగా, నిత్యసాహిత్య ప్రభావ శీలిగా నిల్వ గలిగారు. ముఖ్యంగా డా.ముత్యం పరిశోధనలు రచనలు రెండు భాగాలుగా మనం చూడవచ్చును. 1)ఉత్తరాంధ్ర సాహిత్య పరిశోధనా-రచనలు 2) తెలంగాణా ప్రాంతం రచనలు,సేకరణలు,సంపాదక కృషి. ఈయన ఈ కృషిలో తిరగని గ్రంథాలయం లేదు! ఎక్కని గడప లేదు!! చేయని ఇంటర్వూ లేదు!!! తిరగని ప్రాంతం లేదు!అనడంలో అతిశయోక్తి లేదు.

ఆయన బెనారస్ హిందూ యూనివర్సిటీ పరిశోధనా అంశంగా ఎంచుకున్న “శ్రీకాకుళ ఉద్యమం-సాహిత్యం పై దాని ప్రభావం “అనే అంశం నుండి దాని మూలాలు వరకు వెంటపడి శోధించి,సాధించారు. ఆ ఉద్యమానికి మూలమైన ఉద్యమాలు, ప్రభావశీలుర జీవితం శకలాలను, కథనాలను తవ్వి తీసే పరిశోధనలో నిమగ్నమైనారు. ముఖ్యంగా శ్రీకాకుళ ఉద్యమానికి పునాది వేసిన స్వాతంత్ర ఉద్యమం, రైతు ఉద్యమ కారులు మార్పు పద్మ నాభం, గానుగుల తరుణాచారి, జెండాలు గవరయ్య జీవితాల్లోకి వెళ్ళి ”ఈ ముగ్గురు ఒక్కరే” పేరుతో పుస్తకం రాశారు. అంతేకాదు, స్వాతంత్ర్య ఉద్యమంలో “మాకొద్దీ తెల్ల దొరతనం” అంటూ గర్జించిన స్వాతంత్ర్య ఉద్యమ కవి గరిమెళ్ళ సత్యనారాయణ అముద్రిత రచనలు సైతం ఎంతో కష్టపడి సాధించి పుస్తకం రూపంలో తేగలిగారు.

 ఇక శ్రీకాకుళం ఉద్యమం కు ప్రేరణగా నిలిచిన ఉత్తరాంధ్ర ప్రజా నాయకులు మరుగును పడ్డ చరిత్ర లు వెలికి తీయడానికి ఆయన పడ్డ శ్రమ ఒక యజ్ఞం గానే చెప్ప వచ్చును. ఆ క్రమంలో వేజా తీయోద్యమనేత, శ్రీకాకుళం దళిత కవి”శిల్లా రాజులు రెడ్డి”జీవితం,కవిత్వం పుస్తకం తెచ్చారు. శ్రీకాకుళ ఉద్యమం సృష్టించిన సాహితీ వెత్త, పాటకు ప్రాణం పోసిన త్యాగ జీవి “సుబ్బారావుపాణీగ్రాహి” పేరుతో కుటుంబసభ్యులను వెతికి పట్టుకొని ఆయన బయోగ్రఫీ, సాహిత్య చరిత్ర ను అందించిన ఘనత డా. ముత్యం దే!

”కమ్యూనిస్టులం-మేంకష్టజీవులం”అంటూ సరళమైన, ప్రజలకు అర్థం అయ్యే సాహిత్యం లో పాటలు రాసిన పాణిగ్రాహిపై డా.ముత్యం రాసిన పుస్తకం చారిత్రక ప్రామాణికంగా నిలిచింది. ఇక   అదే కోవలో శ్రీకాకుళం ఉద్యమానికి ముందు ప్రజా ఉద్యమ కెరటాలు గా వెలుగొందిన  కళింగాంధ్ర తేజం “పుల్లేల శ్యామ సుందర్ రావు జీవితం “చిత్రీకరించారు.స్వాతంత్రోద్యమం కాలపు సంఘ సంస్కర్త అయిన బొంకు మల్లయ్యా శాస్త్రి జీవిత గాథ పుస్తకం గా రాశారు.28ఏళ్ళకే గొప్ప ప్రజానాయకుడు గా,రైతు ఉద్యమం నేతగా ఎదిగిన ఆదర్శ కమ్యూనిస్టు గంటి రాజేశ్వరరావు జీవితాన్ని  శోధించి, మదించి”ప్రవహిస్తున్న జ్ఞాపకం”అనబడే గొప్ప గ్రంధాన్ని అందించగలిగారు. ఆయన  తవ్వి తీసిన జీవితం శకలాలు అన్నీ ప్రత్యక్షంగా నో, పరోక్షంగా నో శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాటానికి ఊపిరి పోసిన వారివి కావడం విశేషం! ఇక ఆయన మరో ప్రామాణిక రచన మందస రైతాంగ పోరాటం  గొప్ప చరిత్ర కధనం. ఇదే”సునాముదిజీవధార”పుస్తకంగా రూపుదిద్దుతుంది.

శ్రీకాకుళం ఉద్యమానికి ప్రాణ ప్రతిష్ట చేసిన ఈ రైతాంగ ఉద్యమం పై డా. ముత్యం రాసిన గ్రంధం చారిత్రక ప్రాధాన్యత సంతరించుకుంది.విద్యా పరిశోధన తో మోదలైనడా.ముత్యంపరిశోధన తన జీవితకాలం హెచ్చించి భవిష్యత్తు తరాలకు,పోరాటాలకు విలువైన 11గ్రంధాలను ఉత్తరాంధ్ర పరిశోధన ద్వారా తెలుగు ప్రజలకు అందించగలిగారు. ఇక ఆయన మరో కోణం సాహిత్య సేవను పరిశీలిస్తే తెలంగాణ కోణం ఉంటుంది.ఆయన పనిచేసిన శాతవాహన యూనివర్సిటీ నుండి 1) ఉత్తర తెలంగాణా చరిత్ర -సంస్క్రుతి2)“ఉత్తర తెలంగాణ పల్లె సంస్కృతి “3) తెలంగాణా అలభ్యం శాసనాలు, గ్రంథాలు అనే పుస్తకాలకు ఆయన సంపాదకత్వం వహించారు.ఇంకా ఆయన తెలంగాణా కళాకారిణి చిందుల ఎల్లమ్మ ఇంటర్వ్యూ,జీవితం రేఖల్ని “నేను చిందు ఎల్లమ్మను”, ”చిందుల ఎల్లమ్మ యాది “ పేరుతో పుస్తకాలు తెచ్చారు. ఇదే అంశాన్ని తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు తర్వాత జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలు కు గాను “చిందుల ఎల్లమ్మ “పేరుతో పుస్తకం రాశారు. దీన్ని తెలుగు అకాడమీ పుస్తకంగా ప్రచురించింది.

 ఈ గ్రంథానికి 2007లోతెలుగు  యూనివర్సిటీ పురస్కారం లభించింది.ఇక తెలంగాణా సాయుధ పోరాట యోధుడు అయిన కష్టాలు కొలిమిలో, త్యాగాలు చాళ్ళు పోసిన చిత్రకారుడు ఫణి హారం రంగాచారి జీవితాన్ని సైతం ఆయన”మట్టి రంగును ఎంచు కొన్న కుంచె”పేరుతో పుస్తకం తెచ్చారు. ఇక సొంత జిల్లా నిజామాబాదు పై మమకారం పెంచుకున్న డా.ముత్యంజిల్లా అంతా తిరిగి పల్లె ప్రజల్లో నానుడి గా ఉన్న శాస్త్రం లను సేకరించి “తెలంగాణా శాస్త్రాలు “పేరుతో ఓ పుస్తకం ప్రచురించారు.ఇంతెందుకు ఆయన పుట్టిన ఊరు కున్న చరిత్ర ను అదే గ్రామానికి చెందిన రచయిత స్వయం ప్రకాష్ తో కలిసి తెలంగాణ లో ఓ గుట్ట క్రింద గ్రామం “బాచనపల్లి”పేరుతో తమ గ్రామ చరిత్ర ను వెలుగు లోనికి తెచ్చారు.

ఇక శ్రీకాకుళం ఉద్యమానికి పునాదులు అయిన వారి జీవితాలు తవ్వి తీసిన విధంగానే ప్రపంచంలో నే గొప్ప పోరాటం గా ఖ్యాతి గడించింది, తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం దానికి ఆయువు పట్టు ఆంధ్ర మహాసభ ! ఆంధ్ర మహాసభ, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించిన సర్వదేవభట్ల రామనాధం,ఈయన వందల ఎకరాల భూస్వామి అయినప్పటికీ దున్నేవానికే భూమి నినాదం కమ్యూనిస్టు పార్టీ పిలుపు కు స్పందించి తమ భూమి ఆసాంతం వందల ఎకరాలు సబ్బండవర్గాలకు పంచిపెట్టి ఉద్యమంలో కీలక నేతగా ఎదిగిన సర్వదేవభట్ల రామనాథం చరిత్రను కమ్యూనిస్టు పార్టీలు సైతం విస్మరించాయి..అలాంటి సందర్భంలో ఎంతో శ్రమకోర్చి మరో మిత్రుడు శివలింగం తో కలిసి “కష్టాల కొలిమి,, త్యాగాల పునాది”సర్వదేవభట్ల రామనాధం చరిత్ర “సైతం ప్రజలకు అందించగలిగారు.

అదే విధంగా ఖమ్మం జిల్లా లోని పిండిప్రోలు గ్రామం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి డెన్ గా ఉంది.ఎందరో యోధులు ఆ గ్రామం కేంద్రంగా రజాకార్ల,యూనియన్ మిలిట్రీపై పోరాడి అసువులు బాసారు.అలాంటి గ్రామ చరిత్ర సైతం శోధించి రాయడం సాహసోపేతమైన విషయం గానే చూడవచ్చును.డా.ముత్యం రచనా శైలి విశిష్టమైన టువంటిది. సరళతరంగా ఉండి సామాన్యుడికి సైతం చదవాలనే ఆసక్తి ఆయన రచనా శైలి,  పదప్రయోగం ఉంటుంది.ఇకవందేళ్ళ క్రితం జీవించిన ఓ వ్యక్తి జీవితం చిత్రించాలన్నా,లేక నాటి పోరాటం చిత్రాల్ని రాయాలన్నా చాలా పరిశోధనలు అవసరం ఉంటాయి.డా.ముత్యం ఏ మాత్రం విరామం సమయం దొరికినా, విశ్రాంత అవకాశం దొరికినా దాన్ని ఉద్యమాల పరిశోధనకోసం, పుస్తక రచనల  కోసమే వినియోగించాడు.ఉత్తరాంద్ర పరిశోధనల విషయంలో తన పూర్వ విద్యార్థి ఉద్యమ సహచరుడు, కార్మిక నేత పి. ప్రసాద్  సలహాలు,సూచనలు ఆయనకు చాలా తోడ్పాటు అందించాయి.

డా .ముత్యం పుస్తకాలు ముందు మాటల్లో ఆవిషయం స్పష్టం అవుతోంది. అన్నింటికీ మించి డా. ముత్యం గత 40ఏళ్ళుగా చేసిన పుస్తకపరిశోధన,రచనా యుజ్నంలో వందలాది మంది వ్యక్తుల పరిచయాలు,ఇంటర్వూలు ఉన్నాయి. చారిత్రిక వ్యక్తుల కుటుంబాలతో ఆయనకు ఏర్పడిన అనుబంధం చాలా గొప్పది. ఆయన పడ్డ శ్రమలో శ్రమైక జీవన సౌందర్యం నిండి ఉంది.మట్టిపరిమళం గుబాలిస్తూంది.ఒళ్ళుగగుర్పొడిచే చారిత్రక సన్నివేశాలు ఆయన అక్షరాల్లో కూర్చిన విధానం అద్భుతం గా ఉంటుంది.డా.ముత్యం చారిత్రిక ఆనవాళ్లను, జ్ఞాపకాల ను చిద్రమైపోకుండా భద్రం చేసి భవిష్యత్తు తరాలకు అందించడంకొరకు పడిన తపనే తన నలభై ఏళ్ళ కష్టం యోక్క లక్ష్యం సఫలం అయ్యింది. ఒక సజీవ రచయిత ఎలా ఉండాలో డా. ముత్యం వ్యక్తిత్వం నిరూపిస్తుంది.

 తన కోసం కాకుండా తన తర్వాత తరాల కోసం చారిత్రక ఆనవాళ్లు పట్టిచ్చిన మహా రచయిత,ప్రజా రచయిత డా. ముత్యం.పుస్తకంలో అసత్యాలు,అర్థం సత్యాలు లేకుండా శ్రమతో, చారిత్రక ఆధారాలు తో కూడిన రచన ఎలా ఉండాలో సమూలంగా చూపిన జ్ఞాన శీలి,అక్షర లాక్షనీకుడు  డా. ముత్యం.చరిత్ర తిరగరాసిన నిరంతరం శ్రమించే,పరిశ్రమించే,పరిశోదించే సాహిత్యంలో దృశ్యము, చరిత్ర పుట డా. ముత్యం.ఆయన ఎగరేసిన ఉద్యమం పతాకం, ఆయన అక్షరాలు చరిత్ర చాళ్ళలో ఆరబోసిన వెన్నెల.!ఆయనే ప్రజల మనిషి, ప్రఖ్యాత ప్రజా రచయిత డా. ముత్యం.ఆయనరచనలన్ని చిరస్మరణీయాలే!?    

  • యన్.తిర్మల్,

సెల్ : 9441864514, ఇమెయిల్: thirmal.1960@gmail.com.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »