నిర్దేశం, హైదరాబాద్ః తిక్క ముదిరితే రోకలి తలకు చుట్టుకున్నట్లు ఉంది నెటిజెన్ల తీరు. సోషల్ మీడియాలో కొన్ని విషయాలపై వారు చూపించే సానుభూతి ఉన్మాదానికి ఎంతమాత్రం తీసిపోదు. తాజాగా బెంగాల్ రాజధాని కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ మీద జరిగిన హత్యాచారంపై వారు స్పందిస్తున్న తీరు అలాగే ఉంది. కొద్ది రోజులుగా ఈ విషయంపై ప్రభుత్వాన్ని, వ్యవస్థలో ఉన్న తప్పిదాల్ని ఎత్తి చూపుతూ చేస్తున్న విమర్శలు నెటిజెన్ల స్పందన హర్షనీయమే. కానీ, తాజాగా వారి డిమాండ్ వెర్రి తలలు వేస్తోంది.
ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీ ఎండీగా ఉన్న వీసీ సజ్జనార్ ను తుపాకీ పట్టి కోల్ కతా హత్యాచార నిందితుడిని కాల్చివేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ లలో ఈ విషయం వైరల్ అవుతోంది. ఇంస్టాలో అయితే సోమవారం ఒక్కరోజే సజ్జనార్ అకౌంట్ ను ట్యాగ్ చేసి సుమారు 70 వేల పోస్టులు చేశారు. తుపాకీ ఫోజులో ఉన్న సజ్జనార్ ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి. నిజానికి, నెటిజెన్లు ఇలా డిమాండ్ చేయడానికి కూడా కారణం ఉంది. వరంగల్ లో స్వప్నిక యాసిడ్ దాడి, హైదరాబాద్ లో దిశ సామూహిక హత్యాచారం అనంతరం జరిగిన ఎన్ కౌంటర్లతో సజ్జనార్ అంటే ఎన్ కౌంటర్, ఎన్ కౌంటర్ అంటే సజ్జనార్ అన్నట్లుగా పేరు మారుమోగిపోయింది.
నేర ఘటనపై మానవతా దృక్పథంతో గళం విప్పడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగ చట్టాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించడం కూడా అంతే ముఖ్యం. ఏదైనా నేరం జరిగితే విచారణ చేసి, అందుకు అనుగుణమైన శిక్షలు విధించడానికి కోర్టులు ఉన్నాయి. ఇలాంటి నేరాలపై కఠిన చర్యలకు చట్టాలు చేసేందుకు చట్ట సభలు ఉన్నాయి. పోలీసులకు ఇలాంటి వాటిలో ఎలాంటి అధికారాలు ఉండవు. చట్టాలు, కోర్టు ఆదేశాల మేరకు మాత్రమే నడుచుకోవాలి. కానీ, చట్టాన్ని పోలీసుల చేతుల్లోకి తీసుకోవాలనడం మంచి సంకేతం కాదు. ఈ కేసులో అది న్యాయంగానే కనిపించవచ్చు, కానీ పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం వల్ల జరుగుతున్న దారుణాల గురించి రోజూ చూస్తూనే ఉన్నాం.
ఇకపోతే.. దిశ ఎన్ కౌంటర్ కేసులో తనకు సంబంధమే లేదని సుప్రీంకోర్టు కమిషన్ ముందు సజ్జనార్ వివరణ ఇచ్చారు. ఎన్ కౌంటర్ టైంలో తాను లేనంటూ సిల్లీ రిజన్స్ ఏవో చెప్పి పేలిన తుపాకీతో తనకు సంబంధం లేదని ఆయన తప్పించుకుంటే.. నెటిజెన్లు మాత్రం ఆయనను తుపాకీ వీరుడిగా కొనియాడడం విచిత్రం. హత్యాలు, అత్యాచారాలు జరిగినప్పుడు అందరూ తక్షణ న్యాయం పేరిట అధికారిక హత్యలకు పిలుపునివ్వడం ఏరకమైన మానవవాదం? నేరం జరిగిన ప్రతీసారి కాల్చుకుంటూ పోతే.. నేరాల కంటే ఎక్కువ ఎన్ కౌంటర్లే జరుగుతాయి.
కఠినమైన చట్టాలు, ఎన్ కౌంటర్లు నేరాలను అదుపు చేయడం లేదు. ఇవన్నీ ఉంటాయని తెలిసి కూడా నేరాలు జరుగుతున్నాయి. కోల్ కతా దారుణంలో తనను ఉరితీస్తే తీయండని నేరస్తుడే చెప్తున్నాడు. మరి ఎన్ కౌంటర్లు చేసి ఏం లాభం? సమాజంలో పరివర్తన తీసుకురాకుండా తుపాకీకి పని చెప్పాలనడం ఉన్మాదమే అవుతుంది. నేరాన్ని చంపడానికి బదులు నేరస్తుడిని చంపాలనే డిమాండ్ దురదృష్టకరం. ప్రజల ఆలోచన మార్చాలి. అలాంటి పరిస్థితులు తీసుకురావాలి. భవిష్యత్ లో మరో నేరం జరగకుండా చూడాలి. ఇది కదా కావాల్సింది. కానీ, ప్రతి ఘటనకు తుపాకీ తీసుకుంటూ పోతే, ప్రతిఘటనలో కూడా తుపాకీనే ఉంటుంది.