బీఆర్ఎస్ లో చేరనున్న డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్
– నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ అభ్యర్ధిగా ప్రకటించే అవకాశం
బహుజన్ సమాజ్ పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆదివారం రాత్రి ప్రకటించారు.హైదరాబాదులో వందలాదిమంది ఆయన శ్రేయోభిలాషులు,ఆప్తులు, అభిమానులందరితో సుదీర్ఘంగా మేధోమధనం జరిపిన అనంతరం కీలక నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని,దేశంలో లౌకికత్వాన్ని కాపాడడం కోసం, రాజ్యాంగ రక్షణ కోసం,బహుజనుల అభ్యున్నతి కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ చేరబోతున్నట్లు ప్రకటించారు.ఏ పార్టీలో చేరినా బహుజన మహనీయుల సిద్దాంతాన్ని గుండెలో పదిలంగా దాచుకుంటానని అన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధిగా నాగర్ కర్నూల్ బరిలో నిలువనున్నారు. పార్టీలో చేరిన అనంతరం ఆయన అభ్యర్థిత్వాన్ని కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది.